మంజీర ఉరకలు!
‘సింగూర్ కాల్వల’
ప్రాజెక్టుకు ట్రయల్ రన్
వచ్చే నెల 2న ముహూర్తం
0.15 టీఎంసీల నీరుకేటాయింపు
ఖరీఫ్‌లో ఆయకట్టుకు సాగునీరు
సన్నాహాలు చేస్తున్న అధికారులు
మిగులు పనులతోనే దిగులు
సాక్షి, సంగారెడ్డి:
మంజీర ఉరకలెత్తనుంది. బిరబిర పరుగెత్తనుంది. మెతుకు సీమ రైతుల హృదయాల్లో ఆనందపు పరవళ్లు తొక్కనుంది. వచ్చే ఖరీఫ్ నుంచి సింగూర్ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు సాగు నీటి సరఫరా కోసం జరుగుతున్న సన్నాహాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. సింగూర్ ప్రాజెక్టు నుంచి కాల్వలకు ప్రయోగాత్మకంగా నీటిని విడుదల చేసి పరీక్షించడానికి వచ్చేనెల 2న ట్రయల్ రన్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సింగూర్ కాల్వలు, ఎత్తిపోతల ప్రాజెక్టుల మిగులు పనులు ఖరీఫ్‌లోగా పూర్తి అయితే మెతుకు సీమ రైతుల దశాబ్దాల కల సాకారం కానుంది. ట్రయల్ రన్‌లో భాగంగా కుడి ప్రధాన కాల్వకు 0.15 టీఎంసీల నీటిని విడుదలకు ప్రభుత్వం అనుమతించింది. విడుదల చేసిన నీళ్లు వృథా కాకుండా మాసన్‌పల్లి కుంటకు మళ్లించి అక్కడి నుంచి అందోల్ చెరువుకు తరలించనున్నారు. మార్గమధ్యంలో సింగూర్, మునిమాణిక్యం చెరువులను నింపనున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ చేతుల మీదుగా ట్రయల్ రన్ నిర్వహించడానికి నీటిపారుదల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రాజెక్టు తూములకు మరమ్మతులు చేసి ట్రయల్ రన్‌కు సర్వం సిద్ధం చేశారు.
మిగులు పనులతోనే దిగులు
సింగూర్ కాల్వలకు ట్రయల్ రన్ ఊరిస్తున్నా, మిగులు పనులు ఆందోళన కలిగిస్తున్నాయి. అందోల్ నియోజకవర్గం పరిధిలోని 40 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి జలయజ్ఞం కింద సుమారు రూ.58 కోట్ల వ్యయంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఎం.బాగారెడ్డి సింగూరు కాల్వల పథకం నిర్మాణాన్ని చేపట్టింది. ఖరీఫ్‌లో 2 టీఎంసీల నీటిని 120 రోజుల పాటు కాల్వలకు విడుదల చేసి ఆయకట్టుకు సరఫరా చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ‘మహాలక్ష్మీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్’ అనే నిర్మాణ సంస్థతో 2006 మే 6న ఒప్పొందం జరిగింది. ఈ ఒప్పొందం ప్రకారం 2008 మే 7తో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా..ఆలోగా కేవలం 10 శాతం పనులే పూర్తయ్యాయి. నాలుగు పర్యాయాలు గడువు పెంచినా ఇంకా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదు. మే 07 నుంచి 2013 నవంబర్ 06తో నాలుగోసారి పెంచిన గడువు సైతం తీరిపోయింది.
ప్రాజెక్టు కింద ప్రధానంగా కుడి ప్రధాన కాల్వ, ఎడమ ప్రధాన కాల్వ, ప్రధాన బ్రాంచీ కాల్వ పేరుతో మొత్తం 60.75 కి.మీల పొడవున మూడు కాల్వల తవ్వకాలు జరపాల్సి ఉండగా 58.45 కి.మీల మేర పని పూర్తయింది. 8 డిస్ట్రిబ్యూటరీ కాల్వల తవ్వకాలు పూర్తికాగా మిగిలిన పనులు అసంపూర్తిగానే మిగిలి పోయాయి. ఇక కాల్వలపై నిర్మించే రోడ్డు బ్రిడ్జీలు, అండర్ టన్నెళ్లు తదితర నిర్మాణా(స్ట్రక్చర్లు)ల్లో సైతం పురోగతి లేదు. ఇప్పటి వరకు దాదాపు రూ.30 కోట్ల ఖర్చుతో 55 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. వచ్చే జూన్‌లోగా శరవేగంగా మిగులు పనులు పూర్తిచేస్తేనే ఖరీఫ్‌లో ఆయకట్టుకు నీటి విడుదల సాకారం కానుంది.