జలదీక్ష సందర్భంగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులు
జిల్లాలో రాజకీయాలు అప్పుడే వేడిని పుట్టిస్తున్నాయి. దీంతో రేపో మాపో ఎన్నికలు ఉన్నాయా? అన్న అనుమానం సామాన్యుడికి కలుగుతోంది. నువ్వంటే నువ్వే అంటూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు, ప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలో పడేయాలని అధికార పక్షం తార స్థాయిలో వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలో ‘జల’ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఓ అడుగు ముందుగానే దూసుకెళ్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి. రాజకీయంగా ఉపయోగపడే చిన్న అవకాశాన్ని సైతం అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ‘సింగూరు’ జలాల అంశం తెరపైకి రావడంతో ప్రతిపక్ష పార్టీలు ఇదే అంశంపై పోరుకు సిద్ధం అవుతున్నాయి.
సాక్షి, మెదక్: జిల్లాలో ఏకైక సాగునీటి ప్రాజెక్టు ఘనపురం. వర్షాభావం కారణంగా ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ఎండిపోయింది. దీంతో ప్రాజెక్టు కింద వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. దీనికి తోడు రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు తక్షణం 0.5 టీఎంసీ జలాలు వదిలితే పంటలు బతికి రైతులకు మేలు జరుగుతుంది. అయితే ఎగువన ఉన్న సింగూరు ప్రాజెక్టులో సైతం జలాలు నిండుకున్నాయి. సింగూరు ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 29.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.5 టీఎంసీ నీళ్లు మాత్రమే ఉన్నాయి. వర్షాభావానికి తోడు సింగూరు ప్రాజెక్టు ఎగువ నుంచి నీళ్లు రాకపోవటంతో నీటి మట్టం తగ్గుముఖం పడుతోంది. దీని కారణంగా దిగువ ఉన్న ఘనపురం ప్రాజెక్టు ప్రస్తు తం నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉందని అధికారులు చె బుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం జారీ చేసిన జీఓ 885 కూడా నీటి విడుదలకు అడ్డంకిగా మా రుతోంది.
సింగూరు ప్రాజెక్టులో నీటి మట్టం 16.5 టీఎంసీ దాటినప్పుడే సాగునీరు వదలాలని ఈ జీఓ చెబుతుంది. సింగూరు ప్రాజెక్టు నీటి మ ట్టం 16.5 చేరుకోవాలంటే భారీ వర్షాలు, వరదలు వస్తే తప్ప నిండని పరిస్థితి. ఇదిలా ఉంటే ఘనపురం ప్రాజెక్టు కింద రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వర్షాలు లేక, ప్రాజెక్టులో నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. దీంతో ప్రతిపక్ష పార్టీలు తక్షణం సింగూరు నుంచి నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. గత ఏడాది సింగూరు ప్రాజెక్టు నుంచి ఎన్నడూ లేని విధంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సింగూరు నుం చి 7 టీఎంసీ నీటిని తరలించారు. ఆ ఏడు టీఎం సీల నీటిని ఎస్‌ఆర్‌ఎస్పీకి తరలించకపోయి ఉంటే ప్రస్తుతం సింగూరు నుంచి ఆ నీటిని ఘనపురం ప్రాజెక్టుకు విడుదల చేసే అవకాశం ఉండేదని త ద్వారా రైతులకు మేలు జరిగేదని పలు రాజకీయ పార్టీల వాదన. ఇదే విషయమై రైతుల పక్షాన ఆందోళనలు చేపట్టేందుకు సిద్దం అవుతున్నాయి.
ప్రతిపక్షాల ‘పోరు’ బావుట
ఎస్‌ఆర్‌ఎస్పీకి సింగూరు నీటిని తరలించడాన్ని నిరసిస్తూ, పంటల రక్షణ కోసం ప్రసుత్తం ఘనపురం ప్రాజెక్టుకు సింగూరు నుంచి 0.5 టీఎంసీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీలు పోరాటం చేసేందుక సిద్ధం అవుతున్నాయి. ఇదివరకే కాంగ్రెస్ పార్టీ జూలై 30న ‘జలదీక్ష’ పేరిట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది. త్వరలో ఘనపురం ప్రాజె క్టు పరీవాహక ప్రాంతంలో పాదయాత్ర చేపట్టడంతోపాటు రైతులతో కలిసి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సన్నద్ధం అవుతోంది. స్థానికంగాను టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టేందుకుగాను త్వరలోనే కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరెడ్డి ఆధ్యర్యంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డితో కలిసి పాదయ్రాత , మహాధర్నా నిర్వహించేందుకు ఎర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి రైతుల పక్షాన కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం.
జీవో 885ని రద్దు చేయడంతోపాటు ప్రస్తుతం ఘనపురం ప్రాజెక్టు కింద ఉన్న పంటలను రక్షించుకునేందుకుగాను సింగూరు నుంచి 0.5 టీఎంసీ నీటిని విడుదల చేయించేలా కోర్టును కోరనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీజేపీ సైతం సింగూరు జలాలపై ఆందోళన సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షులు డా.లక్ష్మణ్ ఇతర నాయకులను తీసుకువచ్చి ఘనపురం రైతులతో మాట్లాడించటంతోపాటు రైతుల పక్షాన ఆందోళన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీపీఎం సైతం రైతు సంఘాలతో కలిసి సోమవారం నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టనుంది. తెలుగుదేశం పార్టీ, తెలంగాణ జన సమితి పార్టీలు సైతం సింగూరు జలాల విషయమై ఆందోళన చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. కాగా టీఆర్‌ఎస్ పార్టీ ప్రతిపక్షాల ఎత్తులకు ఎలా తిప్పికొడుతుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment