ghanapuram project
-
‘జల’ రాజకీయం
జిల్లాలో రాజకీయాలు అప్పుడే వేడిని పుట్టిస్తున్నాయి. దీంతో రేపో మాపో ఎన్నికలు ఉన్నాయా? అన్న అనుమానం సామాన్యుడికి కలుగుతోంది. నువ్వంటే నువ్వే అంటూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు, ప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలో పడేయాలని అధికార పక్షం తార స్థాయిలో వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలో ‘జల’ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఓ అడుగు ముందుగానే దూసుకెళ్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి. రాజకీయంగా ఉపయోగపడే చిన్న అవకాశాన్ని సైతం అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ‘సింగూరు’ జలాల అంశం తెరపైకి రావడంతో ప్రతిపక్ష పార్టీలు ఇదే అంశంపై పోరుకు సిద్ధం అవుతున్నాయి. సాక్షి, మెదక్: జిల్లాలో ఏకైక సాగునీటి ప్రాజెక్టు ఘనపురం. వర్షాభావం కారణంగా ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ఎండిపోయింది. దీంతో ప్రాజెక్టు కింద వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. దీనికి తోడు రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు తక్షణం 0.5 టీఎంసీ జలాలు వదిలితే పంటలు బతికి రైతులకు మేలు జరుగుతుంది. అయితే ఎగువన ఉన్న సింగూరు ప్రాజెక్టులో సైతం జలాలు నిండుకున్నాయి. సింగూరు ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 29.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.5 టీఎంసీ నీళ్లు మాత్రమే ఉన్నాయి. వర్షాభావానికి తోడు సింగూరు ప్రాజెక్టు ఎగువ నుంచి నీళ్లు రాకపోవటంతో నీటి మట్టం తగ్గుముఖం పడుతోంది. దీని కారణంగా దిగువ ఉన్న ఘనపురం ప్రాజెక్టు ప్రస్తు తం నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉందని అధికారులు చె బుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం జారీ చేసిన జీఓ 885 కూడా నీటి విడుదలకు అడ్డంకిగా మా రుతోంది. సింగూరు ప్రాజెక్టులో నీటి మట్టం 16.5 టీఎంసీ దాటినప్పుడే సాగునీరు వదలాలని ఈ జీఓ చెబుతుంది. సింగూరు ప్రాజెక్టు నీటి మ ట్టం 16.5 చేరుకోవాలంటే భారీ వర్షాలు, వరదలు వస్తే తప్ప నిండని పరిస్థితి. ఇదిలా ఉంటే ఘనపురం ప్రాజెక్టు కింద రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వర్షాలు లేక, ప్రాజెక్టులో నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. దీంతో ప్రతిపక్ష పార్టీలు తక్షణం సింగూరు నుంచి నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. గత ఏడాది సింగూరు ప్రాజెక్టు నుంచి ఎన్నడూ లేని విధంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సింగూరు నుం చి 7 టీఎంసీ నీటిని తరలించారు. ఆ ఏడు టీఎం సీల నీటిని ఎస్ఆర్ఎస్పీకి తరలించకపోయి ఉంటే ప్రస్తుతం సింగూరు నుంచి ఆ నీటిని ఘనపురం ప్రాజెక్టుకు విడుదల చేసే అవకాశం ఉండేదని త ద్వారా రైతులకు మేలు జరిగేదని పలు రాజకీయ పార్టీల వాదన. ఇదే విషయమై రైతుల పక్షాన ఆందోళనలు చేపట్టేందుకు సిద్దం అవుతున్నాయి. ప్రతిపక్షాల ‘పోరు’ బావుట ఎస్ఆర్ఎస్పీకి సింగూరు నీటిని తరలించడాన్ని నిరసిస్తూ, పంటల రక్షణ కోసం ప్రసుత్తం ఘనపురం ప్రాజెక్టుకు సింగూరు నుంచి 0.5 టీఎంసీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీలు పోరాటం చేసేందుక సిద్ధం అవుతున్నాయి. ఇదివరకే కాంగ్రెస్ పార్టీ జూలై 30న ‘జలదీక్ష’ పేరిట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది. త్వరలో ఘనపురం ప్రాజె క్టు పరీవాహక ప్రాంతంలో పాదయాత్ర చేపట్టడంతోపాటు రైతులతో కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సన్నద్ధం అవుతోంది. స్థానికంగాను టీఆర్ఎస్ను ఇరుకున పెట్టేందుకుగాను త్వరలోనే కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరెడ్డి ఆధ్యర్యంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డితో కలిసి పాదయ్రాత , మహాధర్నా నిర్వహించేందుకు ఎర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి రైతుల పక్షాన కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం. జీవో 885ని రద్దు చేయడంతోపాటు ప్రస్తుతం ఘనపురం ప్రాజెక్టు కింద ఉన్న పంటలను రక్షించుకునేందుకుగాను సింగూరు నుంచి 0.5 టీఎంసీ నీటిని విడుదల చేయించేలా కోర్టును కోరనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీజేపీ సైతం సింగూరు జలాలపై ఆందోళన సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షులు డా.లక్ష్మణ్ ఇతర నాయకులను తీసుకువచ్చి ఘనపురం రైతులతో మాట్లాడించటంతోపాటు రైతుల పక్షాన ఆందోళన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీపీఎం సైతం రైతు సంఘాలతో కలిసి సోమవారం నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టనుంది. తెలుగుదేశం పార్టీ, తెలంగాణ జన సమితి పార్టీలు సైతం సింగూరు జలాల విషయమై ఆందోళన చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. కాగా టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాల ఎత్తులకు ఎలా తిప్పికొడుతుందో వేచి చూడాలి. -
నేడు మెదక్‌కు సీఎం కేసీఆర్
కొల్చారం/పాపన్నపేట : సీఎం కేసీఆర్ నేడు మెదక్‌కు రానున్నారు. కొల్చారం, పాపన్నపేట మండలాల మధ్య గల ఘనపురం ప్రాజెక్ట్‌ను సందర్శించి ఆనకట్ట ఎత్తు పెంపు అంశంపై స్థానిక అధికారులతో సమీక్షించడంతో పాటు స్థానిక అధికారులతో కలిసి ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, ఎస్ఈ రాధాకృష్ణలతో కలిసి ఘనపురం ప్రాజెక్ట్ వద్ద సీఎం పర్యటన ఏర్పాట్లను పరి శీలించారు. అనంతరం కలెక్టర్ మెదక్‌లో విలేకరులతో మాట్లాడుతూ, బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనపురం ఆనకట్ట వద్దకు హెలీకాఫ్టర్లో చేరుకుంటారని తెలిపారు. అనంతరం ఘనపురం ప్రాజెక్ట్ చుట్టూ అధికారులతో కలిసి ఏరియల్ సర్వే నిర్వహిస్తారని తెలిపారు. ఆనకట్ట ఎత్తు పెంచితే పెరిగే నిల్వ నీటి సామర్థ్యం వివరాలు పరిశీలిస్తారన్నారు. ఇందుకనుగుణంగా ఇరిగేషన్ అధికారులు ఆనకట్టపై, ప్రాజెక్ట్ చుట్టూరా జెండాలు ఏర్పాటు చేసి సీఎంకు వివరిస్తారన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కాలినడకన ఆనకట్ట చుట్టూ తిరిగి వివరాలు తెలుసుకుంటారని వెళ్లడించారు. అనంతరం మెదక్ పట్టణానికి వచ్చి ఇండోర్ స్టేడియం వద్ద మెదక్ నియోజకవర్గ అభివృద్ధిపై అధికారుల, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పం చ్‌లు, కో ఆపరేటివ్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్విహ స్తారని కలెక్టర్ తెలిపారు. ఎంఎన్ కెనాల్ పక్కన హెలీప్యాడ్ కొల్చారం మండలం చిన్నఘనపురం శివారులో గల మహబూబ్ నహర్ కెనాల్ దిగువన, మెకానికల్ బ్రిడ్జి పక్కన సీఎం కేసీఆర్ హెలీకాఫ్టర్ దిగేందుకు హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్. వైస్ చైర్మన్ రాగి అశోక్, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, కొల్చారం తహశీల్దార్ నిర్మల, పోతం శెట్టిపల్లి గ్రామ సర్పంచ్ యాదాగౌడ్, ఏడుపాయల డెరైక్టర్ యాదయ్య, లక్ష్మిపతి, గౌరిశంకర్ ఏర్పాట్లు పరిశీలించారు. సర్వే అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్ట్ పక్కనే భోజనం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లపై జేసీ శరత్ సమీక్ష సంగారెడ్డి అర్బన్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మెదక్ పర్యటన ఏర్పాట్లపై జేసీ శరత్ కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జేసీ శరత్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం సమీక్ష సమావేశానికి అధికారులంతా తగు నివేదికలతో రావాలని ఆదేశాలు జారీ చేశారు. సమీక్షా సమావేశంలో డీఆర్ఓ దయానంద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఘనపురం ప్రాజెక్ట్ కు గత వైభవం
మెదక్: నిజాం కాలంలో నిర్మించిన శతాధిక చరిత్రగల ఘనపురం ప్రాజెక్ట్ గత వైభవం సంతరించుకోనుంది. ఒక టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యమే లక్ష్యంగా ఆనకట్ట ఎత్తు పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఫలితంగా ప్రాజెక్ట్ చివ రి ఆయకట్టు వరకు సాగునీరు అందే అవకాశం ఉంది. మంజీరకు నిలకడ నేర్పిన ఘనపురం పరుగులు తీసే మంజీరమ్మకు ఘనపురం ప్రాజెక్ట్ నిలకడ నేర్పింది. పాపన్నపేట...కొల్చారం మండలాల మధ్య ఏడుపాయల తీరంలో 1905లో నిజాం ప్రభువు ఘనపురం ఆనకట్ట నిర్మించారు. 18,130 చ.కి.మీ. విస్తీర్ణంలో 0.25 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంగా ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. ప్రాజెక్ట్ కింద 42.80 కిలో మీటర్ల పొడవున మహబూబ్ నహర్ కెనాల్ ఉండగా, 11,425 ఎకరాలు ఆయకట్టు ఉంది. 12.80 కిలోమీటర్ల పొడవున ఫతేనహర్ కెనాల్ ఉండగా 10,200 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ రెండు కెనాళ్ల ద్వారా మెదక్, పాపన్నపేట, కొల్చారం మండలాల రైతులు ప్రయోజనం పొందుతున్నారు. అప్పట్లో ఘనపురం నీటితో ఆయకట్టు అంతా సస్యశ్యామలంగా ఉండేది. రానురాను ఆనకట్ట పూడికకు గురికావడంతో నిల్వ నీటి సామర్థ్యం 0.2 టీఎంసీలకు పడిపోయింది. దీనికితోడు మహబూబ్ నహర్, ఫతేనహర్ కాల్వలు శిథిలమయ్యాయి. చివరి ఆయకట్టుకు చుక్కనీరందని పరిస్థితి నెలకొంది. కాల్వల ఆధునికీకరణ కోసం రూ.23.85 కోట్ల జైకా నిధులు మంజూరు కాగా పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ఆనకట్ట ఎత్తు పెంచితే..చివరి ఆయకట్టుకు నీరు పూడికకు గురైన ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంచాలని స్థానిక రైతులు ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు 1988 ప్రాంతంలో అప్పటి మంత్రి రాంచందర్‌రావు కృషితో ఆనకట్ట ఎత్తును అదనంగా ఒక మీటరు పెంచారు. దీంతో ఆయక ట్టు విస్తీర్ణం సుమారు 30 వేలకు పెరిగింది. కా నీ పూడిక నిల్వనీటి సామర్థ్యానికి అడ్డుగా మారింది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్ప టి మంత్రి సునీతాలకా్ష్మరెడ్డి ప్రతిపాదన మేరకు సర్వే నిర్వహించారు. అనంతరం ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిల కృషి మేరకు డిసెంబర్ మొదటి వారంలో నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ మురళీధరన్ ఆనకట్టను సందర్శించి ఎత్తు పెంపు విషయమై పరిశీలన చేశారు. ఒక మీటర్ ఎత్తు..1.8 టీఎంసీల నిల్వ నీటి సామర్థ్యం : ఘనపురం ఆనకట్ట ప్రాజెక్ట్‌ను ఒక మీట ర్ ఎత్తు పెంచితే నిల్వ నీటి సామర్థ్యం 1.8 టీ ఎంసీలకు పెరుగుతుందని అధికారులు భావి స్తున్నారు. ఇందుకు సుమారు రూ.56 లక్షలు అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఎత్తు పెంచడం వల్ల ఆనకట్ట వెంట ఉన్న నాగ్సాన్పల్లి, శేరిపల్లి, కొడుపాకల శివారులోని నదీతీర ప్రాంతాలు కొంత వరకు మునిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆనకట్టపై ఒక మీటర్ ఎత్తున జెండాలు పాతి ఏరియల్ సర్వేలో సీఎం కేసీఆర్‌కు వివరించనున్నట్లు అధికారులు తెలిపా రు. ఎత్తు పెంచడంపై ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా పాపన్నపేట వరకు ఫతే నహర్ కాల్వలు పొడిగించాలని, ప్రాజెక్ట్‌లో పూడిక తీయాలని రైతులు కోరుతున్నారు. -
గ‘ఘన’మేనా!
మెదక్: ఘనపురం ప్రాజెక్ట్ కాల్వల ఆధునికీకరణ కోసం రెండేళ్ల క్రితం రూ.21.86 కోట్లు మంజూరయ్యాయి. అయితే పనులు ముందుకు సాగ లేదు. గత ప్రభుత్వ హయాంలో కాల్వ పనులకు కొంతమంది రాజకీయ నాయకులే మోకాలు అడ్డం వేశారనే ఆరోపణలున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు ప్రారంభానికి 2014 జూన్ 19న మళ్లీ శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఎంఎన్ కెనాల్ 76 చైనేజ్ నుంచి 480 చైనేజ్ వరకు జంగిల్ కటింగ్, పూడికతీత కార్యక్రమాలు కొనసాగాయి. అంతలోనే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో పనులను నిలిపివేశారు. ఈయేడు సింగూర్‌లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున రబీ సీజన్‌కు ఎలాగు నీటిని వదిలే అవకాశం లేదు. తాజాగా టీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ ఘనపురానికి నిధులు కేటాయించారు. కనీసం ఇప్పుడైనా కాల్వల మరమ్మతులు ప్రారంభిస్తే తమ కలలు నెరవేరుతాయని చివరి ఆయకట్టు రైతులు ఆశిస్తున్నారు. తగ్గిన ఆయకట్టు విస్తీర్ణం ఘనపురం ప్రాజెక్ట్‌ను మంజీర నదిపై కొల్చారం, పాపన్నపేట మండలాల మధ్య 1905లో నిర్మించారు. నాటి నుంచి నేటి వరకు ఆనకట్ట పరిధిలోని మహబూబ్ నహర్ కెనాల్, ఫతే నహర్ కెనాళ్లకు కనీస మరమ్మతులు చేయకపోవడంతో అవి పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. ఫలితంగా 22వేల ఎకరాల ఆయకట్టు కాస్తా 12 వేల ఎకరాలకు పడిపోయింది. దీంతో 2009లో నగరబాటలో భాగంగా మెదక్ వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఘనపురం కాల్వల ఆధునికీకరణ కోసం రూ.9 కోట్లు మంజూరు చేశారు. అనంతరం పూర్తిస్థాయి మరమ్మతుల కోసం జపాన్ బ్యాంక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ కార్పొరేషన్ లిమిటెడ్(జైకా) కింద రూ.21.86 కోట్లు మంజూరయ్యాయి. వీటి ద్వారా మహబూబ్‌నహర్ కెనాల్ 34 కిలోమీటర్లు. ఫతేనహర్ కెనాల్ 19కిలో మీటర్ల నిడివి మేర మరమ్మతులు చేయాల్సి ఉంది. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఫిబ్రవరి 2012లో పనులు చేజిక్కించుకొని అగ్రిమెంట్ కుదుర్చుకుంది. రెండేళ్ల కాలపరిమితిలో కాల్వల లైనింగ్, పూడిక తీత, జంగిల్ కటింగ్ తదితర పనులు పూర్తి చేయాల్సి ఉంది. అడుగడుగునా అడ్డంకులే! జైకా పనులు దక్కించుకునేందుకు రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌తోపాటు మరో కంపెనీ పోటీ పడినట్లు తెలిసింది. కాగా పనులు దక్కించుకోలేని కంపెనీ జిల్లాకు చెందిన ఓ మాజీ ముఖ్యనేత అండతో మరమ్మతు పనులు అడ్డుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో పనులు పూర్తిచేసిన రూ.1.27కోట్లకు సంబంధించి బిల్లులు చెల్లించడంలో అధికారులు జాప్యం చేశారనే విమర్శలున్నాయి. చేసిన పనికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు 2013 జూన్ 3న ఎంబీ రికార్డు చేసి పీఏఓకు పంపారు. కానీ 37 రోజుల తర్వాత 2013 జూలై 08న ఎంబీలో కొన్ని పేజీలు చిరిగి పోయాయని చెబుతూ బిల్లును వాపస్ పంపారు. అసలు పేజీలు ఏ శాఖలో చిరిగి పోయాయన్నది ఇప్పటికీ అంతుబట్టని రహస్యం. అదే సమయంలో జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కాంట్రాక్ట్‌పై ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఇలా ముప్పేట దాడితో విలవిల్లాడిన కాంట్రాక్టర్ పనులు నిలిపి వేసి కోర్టుకెక్కాడు. దీంతో జైకా పనులు సాగక రైతన్నల భూములకు నీరందక బీళ్లుగా మారాయి. ఈ క్రమంలో 2014 ఫిబ్రవరి 15తో కాంట్రాక్ట్ గడువు ముగిసిపోయింది. తనకు గడువు పెంచాలని కాంట్రాక్టర్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగస్టు 2015 వరకు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి హరీష్ చొరవతో పనులు ప్రారంభం ఆగిపోయిన జైకా పనులు నీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావు చొరవతో కొలిక్కి వచ్చాయి. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించగానే జైకా పనులపై ప్రత్యేక దృష్టి నిలిపారు. ఈ క్రమంలో పాత కాంట్రాక్టర్‌కు కాంట్రాక్ట్ పదవీ కాలాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జూన్ 19న జైకా పనులకు మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిల ఆధ్వర్యంలో మరోసారి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఎం.ఎన్. కెనాల్లో సుమారు రూ.50 లక్షలు పనులు పూర్తయ్యాయి. అంతలోనే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో సింగూర్ నుంచి ఘనపురం ప్రాజెక్ట్‌కు నీటిని విడుదల చేశారు. దీంతో మరమ్మతు పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ముగిసినందున కాల్వల ఆధునికీకరణ పనులు తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉంది. -
ఘనపురం చేరిన సింగూరు నీరు
పాపన్నపేట: సింగూరు నుంచి బుధవారం సాయంత్రం విడుదల చేసిన 0.25 టీఎంసీల నీరు శుక్రవారం ఘనపురం ప్రాజెక్టు చేరింది. ఎండి పోతున్న పంటలకు ప్రాణం పోసింది. ఘనపురం ప్రాజెక్టు కింద ఖరీఫ్ సీజన్లో రైతన్నలు సుమారు 20 వేల ఎకరాల్లో వరిపంట వేశారు. అయితే ఇప్పటి వరకు సింగూరు నుంచి 0.25 టీఎంసీల చొప్పున రెండు సార్లు నీటిని విడుదల చేశారు. గత 15 రోజుల నుంచి కరెంట్ కోతలు తీవ్రం కావడంతో రోజుకు రెండు మడులు కూడా తడవని పరిస్థితి నెలకొంది. తుఫాన్ ఫలితంగా వర్షాలు పడతాయని రైతులు ఆశించినప్పటికీ వాన జాడే కరువైంది. చాలా చోట్ల వరి పంటలు ఎండి పోయాయి. దీంతో స్పందించిన డిప్యుటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి 0.25 నీరు విడుదల చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం 0.1 టీఎంసీ నీరు ఘనపురం చేరిందని, మరో 0.1 టీఎంసీ వచ్చే ఘనపురంలో చేరుతుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. -
మా నీళ్లు.. మాగ్గావాలె
మెదక్: ‘మానీళ్ళు మాగ్గావాలి.. మా నిధులు, మా ఉద్యోగాలు.. మా పాలన మాగ్గావాలి’ అని నినదించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నా.. ఘనపురం ఆయకట్టు రైతుల ఆశలు మాత్రం నెరవేరడం లేదు. ప్రాజెక్టు నిర్మించి 110 ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు సింగూర్ నీటిలో నిర్దేశిత వాటాపై శాశ్వత జీఓ విడుదల కాలేదు. ఖరీఫ్, రబీ సీజన్లలో సాగునీటి కోసం ఏటా రైతన్నలు బతిమిలాడటం తప్పడం లేదు. సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు సాగునీటి విడుదలకు ప్రతిసారీ పాలకుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈసారి కరువు మేఘాలు కమ్ముకొస్తున్నా.. ఖరీఫ్ సీజన్ కరిగిపోతున్నా.. పాలకులు స్పందించడం లేదు. సింగూర్‌లో 13 టీఎంసీల నీరు నిల్వ ఉన్నా.. ఘనపురం ఆనకట్టకు నీటి విడుదల విషయంలో పాలకులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో 30 వేల ఎకరాల ఆయకట్టు రైతాంగం వరి తుకాలు కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతోంది. మెతుకుసీమ ఒకప్పుడు వేలాది మందికి పట్టెడన్నం పెట్టిన పుడమితల్లి. మంజీర జలాలు పచ్చని పైరు పంటలకు ఊపిరి పోశాయి. అది 1896 సంవత్సరం. మెతుకుసీమలో ఏర్పడిన ఘోర కరవుతో జనం ఆకలి దప్పులతో అలమటించారు. ఈ దుస్థితిని ఎదుర్కొనేందుకు 1898లో మంజీర నదిపై పాపన్నపేట, కొల్చారం మండలాల మధ్య, ఘనపురం ఆనకట్ట నిర్మాణానికి అప్పటి నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ రస్టో అలక్ ఎస్క్యేర్ ప్రాజెక్టుకు ప్లాన్ రూపొందించారు. 1899 ఆక్టోబర్ 3న ఆనకట్టకు పునాది వేశారు. 1905లో మహరాజ బహుదూర్ యామిన్ అజ్ సుల్తాన్ ఆనకట్టకు ప్రారంభోత్సవం చేశారు. 2,337 అడుగుల పొడవున నిర్మించిన ఘనపురం ఆనకట్టకు కుడివైపు మహబూబ్ నహర్ కెనాల్, ఎడమ పక్కన ఫతేనహర్ కెనాల్ నిర్మించారు. వీటి కింద మెదక్, కొల్చారం, పాపన్నపేట మండలాల్లోని 30 వేల ఎకరాలను సాగులోకి తేవాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకు 8.03 అడుగుల ఎత్తు మేర ఆనకట్టను కట్టారు. ఘనపురానికి అశనిపాతంగా మారిన సింగూరు హైదరాబాద్‌లోని జంట నగరాలకు తాగునీరందించే లక్ష్యంతో మంజీర నదిపై 1980లో నిర్మించిన సింగూరు ప్రాజెక్టు ఘనపురం ఆయకట్టు రైతుల పాలిట శాపంగా మారింది. సింగూరు ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 30 టీఎంసీలు కాగా, జంట నగరాల తాగునీటి అవసరాలకు 4 టీఎంసీలు, ఘనపురం ప్రాజెక్టుకు 4 టీఎంసీలు, నిజాంసాగర్ ప్రాజెక్టుకు 8 టీఎంసీలు, మెదక్ జిల్లా రైతాంగానికి 2 టీఎంసీలు, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు 8 టీఎంసీలు, మిగతా 4 టీఎంసీల నీరు ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్‌గా నిల్వ చేసేందుకు నిర్ణయించారు. ఈమేరకు 1980 ఏప్రిల్ 12న ప్రభుత్వ జీఓ నం.190 జారీ చేసింది. ప్రతి ఏటా ఘనపురం ప్రాజెక్ట్‌కు 4 టీఎంసీల నీరు విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్ల కోసం ఘనపురం ఆనకట్టకు నీరు విడుదల చేయాలంటే తాత్కాలిక జీవోలు జారీ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు శాశ్వత జీఓ లేదు. పాలకుల దయాదాక్షిణ్యాలపైనే ఆయకట్టు రైతుల భవిష్యత్తు ఆధారపడుతోంది. రెండేళ్ల క్రితం సాగునీటి విడుదల కోసం ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కొంతమంది రైతు లు మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడు ఖరీఫ్ సీజన్లో వర్షాలు లేక కరువు మేఘాలు కమ్ముకొస్తున్నాయి. ఘనపురం ప్రాజెక్ట్‌లో ఏళ్ల తరబడి పూడిక తీయక నిల్వ నీటి సామర్థ్యం తగ్గిపోయింది, చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు జైకా పథకం కింద రూ.25 కోట్లు మంజూరై రెండేళ్లు గడుస్తున్నా..ఇప్పటి వరకు పనులు పూర్తికాలేదు. ఇటీవలే ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావు చొరవతో పనులు ప్రారంభమయ్యాయి. కాగా ఖరీఫ్ సీజన్లో కార్తెలు కరిగి పోతున్నాయి. చిన్న పుష్యాల పాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఘనపురం ఆయకట్ట పరిధిలోని రైతులు వరి తుకాలు వేసి వాటిని పరిరక్షించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. సింగూరు ప్రాజెక్టులో సుమారు 13 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉన్నందున ఘనపురం ప్రాజెక్టుకు 0.2 టీ ఎంసీల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న అన్నదాతల వేదన అరణ్య రోదనగానే మారింది. సిం గూర్ నుంచి 4 టీఎంసీల నీళ్లు పొందే హక్కున్నా.. తమకు కన్నీళ్లే మిగులుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వరాష్ట్రంలోనైనా తమ కన్నీటి ఘోసను తీర్చాలని రైతన్నలు వేడుకుంటున్నారు. వెంటనే మంత్రి హరీష్‌రావు స్పందించి వేలాది అన్నదాతల ఆకాంక్షను నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
గ్రహణం వీడింది
మెదక్: ఘనపురానికి గ్రహణం వీడింది. రైతన్నల సాగునీటి కష్టం త్వరలోనే తీరనుంది. ఇన్నాళ్లూ రాజకీయ రా ‘బంధు’లకు బలై పోయిన ఈ ప్రాజె క్టు తిరిగి మరోసారి శంకుస్థాపనకు సిద్ధమైంది. పాలకులు..ప్రభుత్వం మారడంతో ఈ ప్రాజెక్టుకు మోక్షం కలిగింది. కొత్త ప్రభుత్వంలో భారీనీటిపారుదల శాఖ చేపట్టిన హరీష్‌రావు మెదక్ ప్రాంత రైతన్నల కన్నీటిని తుడిచి సాగునీరందించేందుకు చక చక పావులు కదిపారు. వారంరోజుల్లో ఘనపురం పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో గురువారం జైకా పనులకు మరోసారి మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. మెతుకు సీమ రైతన్నల ఆశల సౌధం ఘనపురం ప్రాజెక్ట్. 1905లో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌కు మహబూబ్ నహర్, ఫతేనహర్ కెనాళ్లు ఉన్నాయి. వీటి కింద మెదక్, పాపన్నపేట, కొల్చారం మండలాల రైతులు లబ్ధిపొందుతున్నారు. శతాధిక సంవత్సరాల వయస్సుగల ఈ కాల్వలు ఇంత వరకు మరమ్మతుకు నోచుకోలేదు. దీంతో 2009లో నగరబాటలో భాగంగా మెదక్ పట్టణానికి వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఘనపురం కాల్వల ఆధునికీకరణ కోసం రూ.9 కోట్లు మంజూరు చేశారు. అనంతరం పూర్తిస్థాయి మరమ్మతుల కోసం జపాన్ బ్యాంక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(జైకా) కింద రూ.21.86 కోట్లు మంజూరయ్యాయి. వీటి ద్వారా మహబూబ్‌నహర్ కెనాల్ 34 కిలోమీటర్లు, ఫతేనహర్కెనాల్ 19 కిలోమీటర్ల నిడివి మేర మరమ్మతులు చేయాల్సి ఉంది. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఫిబ్రవరి 2012లో పనులు చేజిక్కించుకుని అగ్రిమెంట్ కుదుర్చుకుంది. రెండేళ్ల కాలపరిమితిలో కాల్వల లైనింగ్, పూడిక తీత, జంగిల్ కటింగ్ తదితర పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయ్యో రాఘవా..! ఇవేం అడ్డంకులు జైకా పనులు దక్కించుకునేందుకు రాఘవ కన్స్ట్రక్షన్స్తో పాటు మరో కంపెనీ పోటీ పడినట్లు తెలిసింది. కాగా పనులు దక్కించుకోలేని కంపెనీ జిల్లాకు చెందిన ఓ మాజీ ముఖ్యనేత అండతో మరమ్మతు పనులు అడ్డుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో పనులు పూర్తిచేసిన రూ.1.27 కోట్లకు సంబంధించి బిల్లులు చెల్లించడంలో అధికారులు జాప్యం చేశారనే విమర్శలున్నాయి. చేసిన పనికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు 2013 జూన్ 3వతేదీన ఎంబీ రికార్డు చేసి పీఏఓకు పంపారు. కాని 2013 జూలై 8వ తేదీనఅంటే 37 రోజుల త ర్వాత ఎంబీలో కొన్ని పేజీలు చిరిగి పోయాయని చెబుతూ బిల్లును వాపస్ పంపారు. అసలు పేజీలు ఏ శాఖలో చిరిగి పోయాయన్నది ఇప్పటికీ అంతుబట్టని రహస్యం. అదే సమయంలో జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కాంట్రాక్ట్‌పై ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఇలా ముప్పేట దాడితో విలవిలలాడిన కాంట్రాక్టర్ పనులు నిలిపివేసి కోర్టుకెక్కాడు. దీంతో జైకా పనులు సాగక రైతన్నల భూములకు నీరందక బీళ్లుగా మారాయి. ఈ క్రమంలో 2014 ఫిబ్రవరి 15వ తేదీతో కాంట్రాక్ట్ సమయం ముగిసి పోయింది. తనకు గడువు పెంచాలని కాంట్రాక్టర్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నా, అదేమీ పట్టించుకోని అప్పటి మంత్రి రీ టెండర్ వేయాలని ఆదేశించినట్లు సమాచారం. మంత్రి హరీష్ చొరవతో పనులు ప్రారంభం ఆగిపోయిన జైకా పనులు నీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావు చొరవతో కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన పదవీబాధ్యతలు స్వీకరించగానే జైకా పనులపై ప్రత్యేక దృష్టి నిలిపినట్లు సమాచారం. ఈ క్రమంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్ట్ పదవి కాలాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గురువారం జైకా పనులకు మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిల ఆధ్వర్యంలో శంకుస్థాపన జరుగనుంది.ఘనపురం పనులు మళ్లీ ప్రారంభమవుతున్నాయని తెలుసుకున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో పనులు సాగే అవకాాశం లేకున్నప్పటికీ ఖరీఫ్ అనంతరం మహబూబ్ నహర్, ఫతేనహర్ కెనాళ్ల మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. -
‘పూడు’కున్న ఆశలు!
పాపన్నపేట/కొల్చారం, న్యూస్‌లైన్: మెతుకుసీమ పంటలకు ప్రాణాధారమైన ఘనపురం ప్రాజెక్టు పూడికతో నిండిపోయి రైతన్నల ఆశలు ఆవిరి చేస్తోంది. కనీస మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రాజెక్టులో భారీగా నల్లమట్టి చేరింది. ఫలితంగా నీటి నిల్వ సామర్థ్యం కోల్పోవడంతో చివరి ఆయకట్టు భూములు బీళ్లుగా మారుతున్నాయి. పూడికతీతకు ప్రతిపాదనలు తయారుచేయాలని గత నెల 31న ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి హామీ ఇచ్చినా.. అమలు జరిగేదెన్నడోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉపాధి హామీ పనుల కింద పూడికతీత పనులు చేపడితే ఉభయ ప్రయోజనాలు సమకూరే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 1905లో నిజాం నవాబు కృషి మేరకు మంజీరా నదిపై పాపన్నపేట, కొల్చారం మండలాల మధ్య ఘనపురం ప్రాజెక్టు నిర్మించారు. అప్పట్లో ఈ ప్రాజెక్టులో 0.2 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. 42.80 కిలోమీటర్ల పొడవున్న మహబూబ్ నహర్, 12.80 కిలోమీటర్ల పొడవున్న ఫతే నహర్ కెనాళ్ల కింద 21,625 ఎకరాల సాగుభూమి ఉండేది. అప్పట్లో మంజీర నది ఏడాది పొడవునా ప్రవహిస్తుండటంతో ఆయకట్టు సస్యశామలంగా ఉండేది. కానీ, 1972లో సింగూర్ ప్రాజెక్టు నిర్మించాక ఘనపురం ప్రాజెక్టు పరిస్థితి ఘోరంగా మారింది. న్యాయంగా ప్రాజెక్టులోకి రావాల్సిన 4 టీఎంసీల నీరు పాలకుల దయాదాక్షిణ్యాల ఆధారంగా మారింది. గోటి చుట్టుమీద రోకటిపోటులా మంజీర వరదల వెంట తరలివచ్చిన నల్లమట్టి ఇసుకతో ఘనపురం ప్రాజెక్టు పూడికకు గురైంది. ఎంతో కష్టపడి సింగూర్ నుంచి విడుదల చేసుకున్న నీరు పట్టుమని వారం రోజులు కూడా నిల్వ ఉండని పరిస్థితి ఏర్పడింది. మత్తడి వద్ద పేరుకుపోయిన మట్టితో షట్టర్లు కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది. ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంచితే భూములు మునిగే అవకాశం ఉండటంతో నాటినుంచి పూడిక తీయాలని రైతులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఉపాధి హామీ పనుల ద్వారా పూడిక తీస్తే అటు కూలీలకు, ఇటు రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. కాగా ప్రాజెక్టు మట్టి రైతుల పొలాల్లోకి ఉపయోగపడే అవకాశం ఉంది. కాగా ఇటీవల సందర్శించిన మంత్రి సుదర్శన్‌రెడ్డి ప్రాజెక్టు ఎత్తు, పూడికతీతపై సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం ఆనకట్టలో పూడికతీత పనులు మొక్కుబడిగా చేపట్టిన అధికారులు నాటినుంచి మరో మారు ఆ దిశగా చర్యలు చేపట్టిందిలేదు. ఆనకట్ట నుంచి పూడిక తీసినట్లయితే నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు కాల్వలకు సక్రమంగా నీరందుతుంది. కాని అధికారులు పట్టించుకోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. వెంటనే పనులు మంజూరుచేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
‘ఘనపురం’.. వీడని గ్రహణం!
మెదక్, న్యూస్‌లైన్: ఘనపురం ప్రాజెక్టు పనులకు గ్రహణం వీడటం లేదు. వచ్చే నెల 18వ తేదీతో కాంట్రాక్టు గడువు ముగుస్తున్నా పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. ఇందు లో రాజకీయ నాయకులు ప్రవేశించడంతో రైతు ప్రయోజనాలను దెబ్బతీస్తోంది. శతాధిక చరిత్రగల ఘనపురం ప్రాజెక్టు కాలువల మరమ్మతులకు ‘జైకా’ పథకం ద్వారా రూ.23.85 కోట్లు మంజూరైనా కనీసం పదిశాతం పనులు కూడా పూర్తికాలేదు. దీంతో సుమారు 10 వేల ఎకరాల ఆయకట్టు బీళ్లుగా మారాయి. సాగుకు నోచుకోని భూములను చూసి రైతులు కన్నీరు పెడుతున్నారు. అయినా అధికారుల్లో చలనం లేకపోవడంతో తెలంగాణ రైతు రక్షణ సమితి, మానవహక్కుల వేదికతోపాటు ఇతర రైతు, ప్రజాసంఘాలు పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. ఘనపురం ప్రాజెక్టును 1905లో నిర్మించారు. ఆ ఆనకట్టకు మహబూబ్ నహర్, ఫతేనహర్ కెనాళ్లు ఉన్నాయి. వీటి కింద మెదక్, పాపన్నపేట, కొల్చారం మండలాల రైతులు లబ్ధిపొందుతున్నారు. వందేళ్ల చరిత్రగల ఈ కాలువలు ఇప్పటివరకు మరమ్మతుకు నోచుకోవడంలేదు. కాలువల ఆధునికీకరణ కోసం జపాన్ బ్యాంక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(జైకా) కింద రూ.23.85 కోట్లు మంజూరయ్యాయి. వీటి ద్వారా మహబూబ్‌నహర్ 34 కిలోమీటర్లు, ఫతేనహర్ 19 కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయాల్సి ఉంది. హైదరాబాద్‌కు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఫిబ్రవరి 2012లో పనులు చేజిక్కించుకొని అగ్రిమెంట్ కుదుర్చుకుంది. రెండేళ్ల కాలపరిమితిలో కాలువల లైనింగ్, పూడికతీత, జంగిల్ కటింగ్ తదితర పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ మేరకు 2012 ఏప్రిల్‌లో పని ప్రారంభించిన కాంట్రాక్టర్ 6 శాతం పనులు మాత్రమే పూర్తిచేశారు. కాంట్రాక్ట్ వివాదం... ముందుకు సాగని పనులు ‘జైకా’ పనులు దక్కించుకునేందుకు రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌తోపాటు మరో కంపెనీ పోటీ పడినట్టు తెలిసింది. పనులు దక్కకపోవడంతో సదరు కంపెనీ ప్రతినిధులు జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత అండతో మరమ్మతు పనులను అడ్డుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో పనులు పూర్తిచేసినా రూ.1.27 కోట్లకు సంబంధించి బిల్లులు చెల్లించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. దీంతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్ న్యాయస్థానానికి వెళ్లి బిల్లులు పొందేందుకు మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కాగా ఇరిగేషన్ అధికారులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఇదే సమయంలో వివాదం మరింత ముదిరింది. ఘనపురం పనుల మరమ్మతుల విషయంలో విజిలెన్స్ శాఖకు, ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఇసుక రవాణా కూడా కారణమే.. పనులు నిలిచిపోవడానికి ఇసుక రవాణా కూడా ఓ కారణమని తెలుస్తోంది. పనులు చేపట్టేందుకు నిజామాబాద్ జిల్లా సరిహద్దు నుంచి ఇసుక తెచ్చుకోవడానికి కాంట్రాక్టర్‌కు అగ్రిమెంట్ ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఇసుక తీయాల్సిన ప్రాంతం మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నందున రవాణా విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. ఈ విషయమై 20 ఫిబ్రవరి 2013న మీడియం ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ విజయ్‌ప్రకాశ్ నాగ్సాన్పల్లిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఇసుక వివాదాన్ని పరిష్కరించేందుకు నిజామాబాద్ కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతూ మెదక్ కలెక్టర్ ద్వారా లేఖ రాయించారు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాలోని కిష్టాపూర్, బీర్కూర్, బరంగడి ప్రాంతాల నుంచి ఇసుకను అనుమతించాల్సిందిగా ఇరిగేషన్ అధికారులు సైతం లేఖ రాశారు. కానీ ఇప్పటివరకు ఇసుక రవాణాకు అనుమతి రాకపోవడం, మరోవైపు బిల్లులు చెల్లించకపోవడం, ఏసీబీ, విజిలెన్స్ అధికారులు చర్యలకు ఉపక్రమించడంతో పనులు స్తంభించాయి. కాగా కాంట్రాక్టు గడువును పొడిగించాలని(ఈఓటీ) సదరు కాంట్రాక్టర్ ఇటీవలే దరఖాస్తు చేసుకున్నట్టు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. కాంట్రాక్ట్ సమయాన్ని పొడిగిస్తారా? లేదా? అన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రాజెక్ట్ నిండా నీళ్లు.. రైతన్నకు తప్పని కన్నీళ్లు ఘనపురం ప్రాజెక్ట్ నిండా నీరున్నా... చివరి ఆయకట్టులోని రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. శిథిలమైన కాలువల గుండా సాగునీరంతా వృధాగా పోతుండటంతో చివరి ఆయకట్టులోని భూములన్నీ బీళ్లుగా మారుతున్నాయి. ఓ వైపు రబీ పనులు జోరుగా సాగుతున్న సమయంలో చివరి ఆయకట్టు రైతులు బీడు భూములను చూసి కన్నీరు పెడుతున్నారు. ప్రాజెక్ట్ పరిధిలో సుమారు 25 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, ప్రస్తుతం 15 వేల ఎకరాలు మాత్రమే సాగవుతోంది. మరమ్మతుల కాల పరిమితి వచ్చే నెలతో ముగియనుండటంతో రూ.23.85 కోట్ల జైకా నిధులు వెనక్కిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోరుబాటలో.. ఘనపురం కాలువల ఆధునికీకరణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం, తెలంగాణ రైతు రక్షణ సమితి, మానవ హక్కుల వేదిక, విద్యావంతుల వేదిక వంటి ప్రజా సంఘాలు సైతం పోరుబాట పట్టాయి. ఇప్పటికే తెలంగాణ రైతు రక్షణ సమితి, మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమైంది. ఈ విషయాన్ని రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, అవసరమైతే ప్రత్యక్ష ఉద్యమం చేపడతామని కోదండరాం మెదక్‌లో జరిగిన రైతు సమావేశంలో ప్రకటించారు. ఇసుక లభించకే పనులకు అంతరాయం.. ఇసుక లభించకపోవడం వల్లే కాలువల మరమ్మతు పనులు నిలిచిపోయాయి. ఘనపురం ప్రాజెక్ట్ నుంచి పొలాల్లోకి నీళ్లు వదలడం వల్ల కూడా పనులు ముందుకు సాగడం లేదు. ఇసుక సరఫరా కోసం ఇరిగేషన్ శాఖాపరంగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఏసీబీ కోరిక మేరకు పనులకు సంబంధించి రికార్డులను అప్పగించాం. విజిలెన్స్ అధికారులకు కూడా పనులను పరిశీలిస్తున్నారు. వచ్చే నెలతో కాంట్రాక్ట్ గడువు ముగుస్తుంది. గడువు పొడిగింపు కోసం కాంట్రాక్టర్ దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. - సురేశ్, ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ -
సింగూరు బిరబిర ఘనపురం గలగల
పాపన్నపేట, న్యూస్‌లైన్: సింగూరు నుంచి నీరు విడుదల కావడంతో ఘనపురం ఆనకట్ట పొంగిపొర్లుతోంది. వరి నాట్లకోసం ఎదురు చూస్తున్న రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. రబీపంటల కోసం మంజీరా బ్యారేజీ నుంచి ఆదివారం రాత్రి 6,340 క్యూసెక్కుల నీటిని వదిలారు. మొదటి విడతగా 0.3 టీఎంసీల నీటిని 13.30 గంటలపాటు ఏకధాటిగా వదిలారు. మంగళవారం ఉదయానికి ఆ నీరు ఘనపురం ఆనకట్టకు చేరుకుంది. మధ్యాహ్నం నుంచి ఆనకట్ట పొంగిపొర్లుతోంది. మరోవైపు మహబూబ్ నహర్, ఫతేనహర్ కెనాళ్ల నుంచి నీటిని వదిలారు. దీంతో రైతులు వరినాట్లు ముమ్మరం చేశారు. మరో 5 విడతలపాటు మొత్తం 1.9 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. కాగా ఘనపురం ఆనకట్ట పరిధి కింద మొత్తం 21వేల ఎకరాలు సాగు భూమి ఉంది. సింగూరు నీటి విడుదలతో సుమారు 15వేల ఎకరాలకు ప్రయోజనం చేకూరనుంది. కాగా చివరి ఆయకట్టు కాలువలు శిథిలంకావడంతో ఆ ప్రాంతానికి నీరు చేరే అవకాశం లేదు. జైకా పనులు పూర్తయితే.. తమకు కూడా సాగు నీరు అందేందని చివరి ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి జైకా పనులు సత్వరం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎంఎన్ కెనాల్‌కు సాగునీరు విడుదల కొల్చారం: సింగూరు నీరు రావడంతో మండల పరిధిలోని మహబూబ్ నహర్(ఎంఎన్) కెనాల్‌కు సాగునీటిని విడుదల చేశారు. దీంతో చిన్నఘణాపూర్, పొతంశెట్టిపల్లి, కిష్టాపూర్,రాం పూర్ గ్రామాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాలతో ఘనపురం ఆనకట్టకు పెద్ద ఎత్తున వరదనీరు చేరుకోవడంతో ఆ నీటితోనే రైతులు పంటలు సాగుచేసుకున్నారు. అప్పట్లో సింగూర్ ప్రాజెక్ట్నుంచి చుక్కనీరు విడుదల కాలేదు. కాగా రబీ పంటలకు సాగునీరు అవసరం కావడంతో ప్రభుత్వ జీఓ ప్రకారం సాగునీరు విడుదల చేస్తున్నారు. మంగళవారంస్థానిక నాయకులు మెదక్ సీడీసీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, జిల్లా ఆప్కో డెరైక్టర్ రమేష్, ఏడుపాయల దేవస్థానం డెరైక్టర్లు యాదయ్య, సంగమేశ్వర్, ఎంఎన్ కెనాల్ చైర్మన్ నారాయణ, మండల కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డిలు ఘణాపురం ఆనకట్ట నుంచి ఎంఎన్ కెనాల్‌కు సాగునీటిని విడుదల చేశారు. దీంతో వరినాట్లు ముమ్మరం కానున్నాయి. -
సింగూరు వచ్చేనా..సిరులు పండేనా?
మెదక్, న్యూస్‌లైన్: సింగూరు నీటి కోసం రైతన్నలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తుకాలు వేసి 20 రోజులు కావస్తున్నా ఇంకా నీరువిడుదల కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. నీరు రాకపోతే ఘనపురం ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదముందని చెబుతున్నారు. రబీ సీజన్ కోసం సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు నీరు విడుదల చేయాలంటూ నీటి పారుదల జిల్లా సలహా సంఘం ప్రతిపాదించి 20 రోజులు కావస్తోంది. అయినప్పటికీ ఇంకా జీఓ విడుదల కాలేదు. సింగూరు నుంచి నీరు పొందేందుకు న్యాయమైన హక్కు ఉన్నా.. ఇలా ప్రతియేటా సాగునీటి కోసం ఎదురు చూడాల్సివస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు అయిన ఘనపురం ప్రాజెక్టుకు సింగూరు నుంచి ఏటా 4 టీఎంసీల సాగు నీరు పొందే హక్కు ఉంది. ప్రాజెక్టు కింద సుమారు 21,065 ఎకరాల సాగు భూమి ఉంది. కానీ మహబూబ్ నహర్,ఫతేనహర్ కెనాళ్ళు శిథిలం కావడంతో చివరి ఆయకట్టుకు సాగు నీరందడం లేదు. మరమ్మతుల కోసం జైకా పథకం కింద రూ. 25 కోట్లు మంజూరైనా పనులు సాగడం లేదు. దీంతో కనీసం 15 వేల ఎకరాలకు సింగూరు నుంచి 2.5 టీఎంసీలు విడుదల చేయాలని రైతులు కోరుతున్నా, ఐఓబీ తీర్మానం మేరకు 10 వేల ఎకరాల సాగు కోసం ఏడు విడతల్లో 1.95 టీఎంసీ నీరు విడుదల చేయాలని ప్రతిపాదనలు పంపారు. కానీ ఇంతవరకు ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. ప్రతి ఏటా జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తేనే జీఓ వెలువడుతోందని రైతులు అంటున్నారు.ఈ సారి వారు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే నీటి అవకాశం ఉన్నచోట్ల ప్రాజెక్టు పరిధిలోని రైతులు వరి తుకాలు వేసుకున్నారు.మరో 10 రోజుల్లో అవి నాట్లు వేసే దశకు చేరుకుంటాయి.సింగూరు ప్రాజెక్టులో సైతం సుమారు 26.4 టీఎంసీల నీరు ఉంది.అలాగే ఘనపురంలో 6 అడుగుల మేర నీరు నిలవ ఉంది.కనుక కనీసం 10 వేల ఎకరాలైనా సాగు కావాలంటే వెంటనే సింగూరు నీటిని విడుదల చేసేలా జీఓ జారీ చేయాలని రైతులు కోరుతున్నారు. -
సాగునీటికి యేటా తిప్పలే.
మెదక్, న్యూస్‌లైన్: మెతుకుసీమ రైతన్నల ఆశలసౌధమైన ఘణపురం ప్రాజెక్ట్‌కు రాహుకాలం దాపురిం చింది. అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లు నిధులున్నా.. కాల్వలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. నీరున్నా పొలాలకు పారడం లేదు. సింగూర్ నీటి వినియోగంలో హక్కు కలిగి ఉన్నా అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది. వీటికి తోడు గత ఫిబ్రవరి నెలలో ప్రాజెక్టులోకి చేరిన గుర్రపు డెక్క ప్రాజెక్టును ముంచేస్తోంది. దీంతో ఆయకట్టు రైతులు సాగునీటి కోసం కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో ఉన్న ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు ఘణపురం. పాపన్నపేట-కొల్చారం మండలాల మధ్య మంజీరా నదిపై నిజాం కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు ఫతేనహర్, మహబూబ్ నహర్ కాల్వలున్నాయి. వీటి ద్వారా సుమారు 22 వేల ఎకరాలకు సాగునీరందాల్సి ఉంది. 1905లో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు, కాల్వలు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో మరమ్మతులకు నోచుకోలేదు. అప్పట్లో నగరబాటలో భాగంగా మెదక్ పట్టణానికి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుడి, ఎడమ కాల్వల మర మ్మతుల కోసం తాత్కాలికంగా రూ.9 కోట్లు మంజూరు చేశారు. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ అలక్ష్యం వల్ల సుమారు రూ.3 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో చివరి ఆయకట్టు రైతుల పరిస్థితి దీనంగా మారింది. కాల్వల పూర్తిస్థాయి మరమ్మతు కోసం 2011లో జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ ఆధ్వర్యంలో రూ.25 కోట్లు మంజూరయ్యాయి. వివాదాలతో ఆగిన పనులు కాంట్రాక్టు విషయంలో ఏర్పడిన వివాదం ఘణపురం ప్రాజెక్టు పాలిట గ్రహణంగా మారింది. ఈ పనులు చేయడానికి 2012లో టెండర్ పొందిన ఓ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ పూర్తి చేసుకుని పొదల తొలగింపు పనులు ప్రారంభించారు. 2014 వరకు ఈ పనులు పూర్తికావాల్సి ఉంది. అయితే రాజకీయ ప్రాబ ల్యం గల ఓ నాయకుడి బంధువు ఈ కాంట్రాక్టుపై కన్నుపడటంతో, సదరు నాయకుడు పనులను అడ్డుకుంటున్నాడన్న ఆరోపణలున్నాయి. దీంతో అధికారులు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమైనట్లు తెలుస్తోంది. కాగా ఇసుక బూచిని చూపుతూ పనులు నడవడం లేదని అధికారులు చెబుతున్నారు. శిథిలమైన కాల్వలనుంచి నీరు పారకపోవడంతో చివరి ఆయకట్టు పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. సుమారు 22 వేల ఎకరాల్లో 12 వేల ఎకరాలు మాత్రమే సాగువుతున్నట్లు తెలుస్తోంది. జల వివాదం సింగూర్ ప్రాజెక్టు నుంచి ఘణపురం ప్రాజెక్టుకు 4 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. ఈ మేరకు జీఓ ఉన్నప్పటికీ, నీరు విడిచే ప్రతిసారీ ఎంతమేర నీరు వదలాలన్న విషయమై ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేస్తుంది. దీంతో ఘణపురం ఆయకట్టు రైతుల భవిష్యత్తు అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం సింగూర్ ప్రాజెక్టులో 15.4 టీఎంసీల నీరుండగా, ఘణపురం ప్రాజెక్టు నిండుకుండలా కనిపిస్తుంది. దీంతో రైతులు తమ పంట పొలాలకు నీరు వదలాలని మూడు రోజుల క్రితం ఇరిగేషన్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. సింగూర్ నీరు అడగబోమని హామీ ఇస్తేనే ఘణపురం నీటిని వదులుతామని అధికారులు షరతు విధించారు. దీంతో ఆగ్రహించిన మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ఆధ్వర్యం లో గురువారం ఘణపురం ప్రాజెక్టుపై దాడిచేసి బలవంతంగా సాగునీరును వదిలారు. కాలుష్యంగా మారిన ప్రాజెక్టు గత ఫిబ్రవరి నెలలో ఏడుపాయల జాతర కోసం సింగూర్ నీరు వదిలిన సమయంలో ఘణపురం ప్రాజెక్టులోకి భారీస్థాయిలో గుర్రపుడెక్క చేరింది. దీంతో ప్రాజెక్టులోని నీరు రోజురోజుకి కలుషితమవుతోందని రైతులు వాపోతున్నారు. తాము చేపలు పట్టలేకపోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఘణపురం జలకళను చూసి పర్యాటక అందాలను ఆస్వాదిద్దామనుకున్న భక్తులకు నిరాశే మిగులుతోంది. అధికారులు స్పందించి వెంటనే జైకా పనులు ప్రారంభించి, ఘణపురం ప్రాజెక్ట్‌కు రావాల్సిన 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు.