మెదక్, న్యూస్‌లైన్: సింగూరు నీటి కోసం రైతన్నలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తుకాలు వేసి 20 రోజులు కావస్తున్నా ఇంకా నీరువిడుదల కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. నీరు రాకపోతే ఘనపురం ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదముందని చెబుతున్నారు. రబీ సీజన్ కోసం సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు నీరు విడుదల చేయాలంటూ నీటి పారుదల జిల్లా సలహా సంఘం ప్రతిపాదించి 20 రోజులు కావస్తోంది. అయినప్పటికీ ఇంకా జీఓ విడుదల కాలేదు. సింగూరు నుంచి నీరు పొందేందుకు న్యాయమైన హక్కు ఉన్నా.. ఇలా ప్రతియేటా సాగునీటి కోసం ఎదురు చూడాల్సివస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు అయిన ఘనపురం ప్రాజెక్టుకు సింగూరు నుంచి ఏటా 4 టీఎంసీల సాగు నీరు పొందే హక్కు ఉంది.
ప్రాజెక్టు కింద సుమారు 21,065 ఎకరాల సాగు భూమి ఉంది. కానీ మహబూబ్ నహర్,ఫతేనహర్ కెనాళ్ళు శిథిలం కావడంతో చివరి ఆయకట్టుకు సాగు నీరందడం లేదు. మరమ్మతుల కోసం జైకా పథకం కింద రూ. 25 కోట్లు మంజూరైనా పనులు సాగడం లేదు. దీంతో కనీసం 15 వేల ఎకరాలకు సింగూరు నుంచి 2.5 టీఎంసీలు విడుదల చేయాలని రైతులు కోరుతున్నా, ఐఓబీ తీర్మానం మేరకు 10 వేల ఎకరాల సాగు కోసం ఏడు విడతల్లో 1.95 టీఎంసీ నీరు విడుదల చేయాలని ప్రతిపాదనలు పంపారు. కానీ ఇంతవరకు ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. ప్రతి ఏటా జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తేనే జీఓ వెలువడుతోందని రైతులు అంటున్నారు.ఈ సారి వారు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
అయితే నీటి అవకాశం ఉన్నచోట్ల ప్రాజెక్టు పరిధిలోని రైతులు వరి తుకాలు వేసుకున్నారు.మరో 10 రోజుల్లో అవి నాట్లు వేసే దశకు చేరుకుంటాయి.సింగూరు ప్రాజెక్టులో సైతం సుమారు 26.4 టీఎంసీల నీరు ఉంది.అలాగే ఘనపురంలో 6 అడుగుల మేర నీరు నిలవ ఉంది.కనుక కనీసం 10 వేల ఎకరాలైనా సాగు కావాలంటే వెంటనే సింగూరు నీటిని విడుదల చేసేలా జీఓ జారీ చేయాలని రైతులు కోరుతున్నారు.
సింగూరు వచ్చేనా..సిరులు పండేనా?
Published Mon, Dec 30 2013 11:49 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement