పాపన్నపేట/కొల్చారం, న్యూస్‌లైన్: మెతుకుసీమ పంటలకు ప్రాణాధారమైన ఘనపురం ప్రాజెక్టు పూడికతో నిండిపోయి రైతన్నల ఆశలు ఆవిరి చేస్తోంది. కనీస మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రాజెక్టులో భారీగా నల్లమట్టి చేరింది. ఫలితంగా నీటి నిల్వ సామర్థ్యం కోల్పోవడంతో చివరి ఆయకట్టు భూములు బీళ్లుగా మారుతున్నాయి.
పూడికతీతకు ప్రతిపాదనలు తయారుచేయాలని గత నెల 31న ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి హామీ ఇచ్చినా.. అమలు జరిగేదెన్నడోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉపాధి హామీ పనుల కింద పూడికతీత పనులు చేపడితే ఉభయ ప్రయోజనాలు సమకూరే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 1905లో నిజాం నవాబు కృషి మేరకు మంజీరా నదిపై పాపన్నపేట, కొల్చారం మండలాల మధ్య ఘనపురం ప్రాజెక్టు నిర్మించారు.
అప్పట్లో ఈ ప్రాజెక్టులో 0.2 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. 42.80 కిలోమీటర్ల పొడవున్న మహబూబ్ నహర్, 12.80 కిలోమీటర్ల పొడవున్న ఫతే నహర్ కెనాళ్ల కింద 21,625 ఎకరాల సాగుభూమి ఉండేది. అప్పట్లో మంజీర నది ఏడాది పొడవునా ప్రవహిస్తుండటంతో ఆయకట్టు సస్యశామలంగా ఉండేది. కానీ, 1972లో సింగూర్ ప్రాజెక్టు నిర్మించాక ఘనపురం ప్రాజెక్టు పరిస్థితి ఘోరంగా మారింది. న్యాయంగా ప్రాజెక్టులోకి రావాల్సిన 4 టీఎంసీల నీరు పాలకుల దయాదాక్షిణ్యాల ఆధారంగా మారింది. గోటి చుట్టుమీద రోకటిపోటులా మంజీర వరదల వెంట తరలివచ్చిన నల్లమట్టి ఇసుకతో ఘనపురం ప్రాజెక్టు పూడికకు గురైంది. ఎంతో కష్టపడి సింగూర్ నుంచి విడుదల చేసుకున్న నీరు పట్టుమని వారం రోజులు కూడా నిల్వ ఉండని పరిస్థితి ఏర్పడింది.
మత్తడి వద్ద పేరుకుపోయిన మట్టితో షట్టర్లు కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది. ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంచితే భూములు మునిగే అవకాశం ఉండటంతో నాటినుంచి పూడిక తీయాలని రైతులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఉపాధి హామీ పనుల ద్వారా పూడిక తీస్తే అటు కూలీలకు, ఇటు రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. కాగా ప్రాజెక్టు మట్టి రైతుల పొలాల్లోకి ఉపయోగపడే అవకాశం ఉంది. కాగా ఇటీవల సందర్శించిన మంత్రి సుదర్శన్‌రెడ్డి ప్రాజెక్టు ఎత్తు, పూడికతీతపై సర్వే నిర్వహించాలని ఆదేశించారు.
ఎప్పుడో నాలుగేళ్ల క్రితం ఆనకట్టలో పూడికతీత పనులు మొక్కుబడిగా చేపట్టిన అధికారులు నాటినుంచి మరో మారు ఆ దిశగా చర్యలు చేపట్టిందిలేదు. ఆనకట్ట నుంచి పూడిక తీసినట్లయితే నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు కాల్వలకు సక్రమంగా నీరందుతుంది. కాని అధికారులు పట్టించుకోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. వెంటనే పనులు మంజూరుచేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
‘పూడు’కున్న ఆశలు!
Published Wed, Feb 5 2014 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM
Advertisement