సాక్షి, పాపన్నపేట(మెదక్): స్నేహితుడికోసం తోడుగా వెళ్లిన ఓ యువకుడు.. బతుకుదెరువుకోసం బెడ్ షీట్లు అమ్ముకునేందుకు బయలు దేరిన మరో యువకుడి బతుకులు నిద్ర మత్తులో చిత్తయ్యాయి. రైస్‌మిల్ ఎదుట రోడ్డు పక్కనే ఆపిన ధాన్యం లారీలు.. యువకుల పాలిట శాపంగా మారాయి. వార్తా పత్రికలు తెచ్చేందుకు పట్నం వెళ్లిన యువకులు మరో అరగంటలో గమ్యం చేరుతారనగా.. కడతేరి పోయారు. నిల్చున్న లారీని ఆటో ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు యువకులు చనిపోగా.. మరో యువకుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇంకో వ్యక్తి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పాపన్నపేట మండలం ఎల్లాపూర్ గ్రామశివారులోని సత్యసాయి రైస్‌మిల్ వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి పోలీసులు, బాధిత వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం...
పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామానికి చెందిన కుర్మ భూపాల్(21) పదో తరగతి వరకు చదివి, ఆటో నడుపుతూ కుటుంబ సభ్యులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. పాపన్నపేటకు చెందిన ఓ వ్యక్తి ప్రతి రోజూ హైదరాబాద్ నుంచి దినపత్రికలు తేవడానికి తన ఆటోను నడుపుతున్నాడు. ఇందుకోసం పాపన్నపేటకు చెందిన తాటిగారి వంశీగౌడ్‌ను డ్రైవర్‌గా నియమించుకున్నాడు. అయితే సోమవారం సాయంత్రం హైదరాబాద్ వెళ్లేందుకు వంశీ తన మిత్రుడైన కుర్మ భూపాల్‌ను వెంట తీసుకెళ్లాడు. వీరిద్దరూ పేపర్లు తీసుకొని తిరిగి వస్తుండగా మెదక్‌లో గుల్బర్(22), అతిక్ రహమాన్ అనే బెడ్‌షీట్ వ్యాపారులు ఆటో ఎక్కారు.
వీరు నలుగురు కలసి పాపన్నపేటకు వస్తుండగా, ఎల్లాపూర్ శివారులోని శ్రీ సత్యసాయి రైస్ మిల్ వద్ద ఎలాంటి హెచ్చరికలు.. ముందు జాగ్రత చర్యలు లేకుండా రోడ్డును ఆనుకొని ఆపి ఉంచిన లారీ(నెం.టీఎస్12యుపి 6593)నీ ఆటో ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు ఢీకొట్టింది. రైస్ మిల్లులో పనిచేస్తున్న కొంతమంది అక్కడికి పరుగెత్తుకొచ్చి ఆటోలో ఉన్న యువకులను బయటకు తీశారు. ఈ సంఘటనలో ఆటో నడుపుతున్న కుర్మ భూపాల్ అక్కడిక్కడే మృతి చెందాడు బెడ్ïÙట్‌లు అమ్మకునేందుకు వస్తున్న గుల్బర్‌ను 108లో తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. తాటిగారి వంశీగౌడ్‌కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరో ప్రయాణికుడు అతిక్ రహమాన్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించి సీజ్ చేశామన్నారు.
బతుకు పోరులో సమిధగా మారిన భూపాల్..
పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామానికి చెందిన కుర్మ దుర్గమ్మ, బేతయ్య దంపతులకు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు శంకర్ బతుకు దెరువుకోసం పట్నం వెళ్లగా తల్లి దుర్గమ్మ సైతం అక్కడే ఉంటుంది. వృద్ధుడైన బేతయ్యకు సపర్యలు చేస్తూ భూపాల్, చిన్న కొడుకు ప్రవీణ్‌లు రామతీర్థంలోఉంటున్నారు. ఆటో నడుపుతూ భూపాల్ బతుకు బండి లాగుతున్నాడు. ఇదే సమయంలో ఇప్పుడే వస్తానంటూ వెళ్లిన కొడుకు శవమై రావడంతో తల్లిదండ్రులు, అన్నదమ్ములు కన్నీరు, మున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు మృతుడి ఇంటి వద్దకు చేరుకొని పెద్దపెట్టున విలపించారు.
బతుకుదెరువుకోసం వచ్చి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ జిల్లా నవర్డా గ్రామానికి చెందిన గుల్బర్(22)కుటుంబ సభ్యులతో కలసి పదేళ్ల క్రితం మెదక్‌కు వచ్చి, బెడ్‌షీట్లు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పాపన్నపేటో బెడ్ షీట్లు అమ్ముకునేందుకు, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తన మిత్రుడు అతిక్ రహమాన్‌తో కలసి పాపన్నపేటకు వచ్చేందుకు ఆటో ఎక్కి, ఎల్లాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు, తల్లిదండ్రులు ఉన్నారు. వ్యాపారం కోసం బయటకు వెళ్లిన కొడుకు శవమై రావడంతో తల్లిదండ్రులు, కుటుంబీకులు లబోదిబోమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment