![3 Year Old Boy Lost Breath Who Fell Into Borewell In Medak District - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/28/boy-death_0.jpg.webp?itok=wfbNcWEr)
సాక్షి, మెదక్ : జిల్లాలోని పాపన్నపేట మండలం పొడిచన్‌పల్లి గ్రామంలో బోరుబావిలో పడిన చిన్నారి సంజయ్ సాయివర్ధన్ మృతి చెందాడు. 25 అడుగుల లోతులో బాలుడి మృతదేహం లభ్యమైంది. బుధవారం సాయంత్రం తాతతో కలసి పొలం వద్ద నుంచి ఇంటికి వెళ్తున్న మూడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు అప్పుడే వేసిన బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. బాలుడిని రక్షించేందుకు అధికారులు విశ్వప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. దాదాపు 12 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించినప్పటికీ చిన్నారిని కాపాడలేకపోయారు. 25 అడుగుల లోతులో బాలుడు ఉండొచ్చని భావించి, బోరు బావికి సమాంతరంగా గొయ్యి తవ్వి బాలుడిని బయటకు తీశారు. కానీ చిన్నారి అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటనతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. (చదవండి : బోరుబావిలో బాలుడు)
ప్రాణం మీదకు తెచ్చిన బోర్లు..
సాగు కోసం నీటి కొరత ఉండొద్దనే ఉద్దేశంతో భిక్షపతి తనకున్న పొలంలో బోర్లు వేయిస్తున్నాడు. ఈ క్రమంలో భార్గవి, నవీనాతోపాటు పిల్లలు పొలానికి వచ్చారు. మంగళవారం రాత్రి 160 ఫీట్ల వరకు ఒక బోరు వేయగా.. నీళ్లు పడలేదు. మళ్లీ వేరే స్థలంలో బుధవారం ఉదయం 300 ఫీట్ల వరకు వేశారు. అక్కడ కూడా నీరు పడకపోవడంతో చివరగా ఇంకో చోట 150 ఫీట్ల లోతు వరకు బోరుగుంత తవ్వినా.. ఫలితం లేకపోయింది. దీంతో వేసిన కేసింగ్ తీసేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఇంటి బాట పట్టారు. తాత భిక్షపతితో కలసి బాలుడు సంజయ్ సాయివర్ధన్ వస్తున్నాడు. తాత కంటే ముందు వెళ్తున్న బాలుడు ప్రమాదవశాత్తు జారి బోరుగుంతలో పడిపోయాడు.
మిన్నంటిన రోదనలు
ఘటనా స్థలం వద్ద బాధిత బాలుడి కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. వారు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కంట తడిపెట్టించింది. బాలుడు సాయివర్ధన్ ప్రాణాలతో బయటపడాలని అందరూ ప్రార్థించారు.
Comments
Please login to add a commentAdd a comment