‘ఘనపురం’.. వీడని గ్రహణం! | ghanapuram project work not going properly | Sakshi
Sakshi News home page

‘ఘనపురం’.. వీడని గ్రహణం!

Published Mon, Jan 27 2014 11:27 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

ghanapuram project work not going properly

 మెదక్, న్యూస్‌లైన్:
 ఘనపురం ప్రాజెక్టు పనులకు గ్రహణం వీడటం లేదు. వచ్చే నెల 18వ తేదీతో కాంట్రాక్టు గడువు ముగుస్తున్నా పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. ఇందు లో రాజకీయ నాయకులు ప్రవేశించడంతో రైతు ప్రయోజనాలను దెబ్బతీస్తోంది. శతాధిక చరిత్రగల ఘనపురం ప్రాజెక్టు కాలువల మరమ్మతులకు ‘జైకా’ పథకం ద్వారా రూ.23.85 కోట్లు మంజూరైనా కనీసం పదిశాతం పనులు కూడా పూర్తికాలేదు. దీంతో సుమారు 10 వేల ఎకరాల ఆయకట్టు బీళ్లుగా మారాయి. సాగుకు నోచుకోని భూములను చూసి రైతులు కన్నీరు పెడుతున్నారు. అయినా అధికారుల్లో చలనం లేకపోవడంతో తెలంగాణ రైతు రక్షణ సమితి, మానవహక్కుల వేదికతోపాటు ఇతర రైతు, ప్రజాసంఘాలు పోరుబాటకు సిద్ధమవుతున్నాయి.
 
  ఘనపురం ప్రాజెక్టును 1905లో నిర్మించారు. ఆ ఆనకట్టకు మహబూబ్ నహర్, ఫతేనహర్ కెనాళ్లు ఉన్నాయి. వీటి కింద మెదక్, పాపన్నపేట, కొల్చారం మండలాల రైతులు లబ్ధిపొందుతున్నారు. వందేళ్ల చరిత్రగల ఈ కాలువలు ఇప్పటివరకు మరమ్మతుకు నోచుకోవడంలేదు. కాలువల ఆధునికీకరణ కోసం జపాన్ బ్యాంక్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(జైకా) కింద రూ.23.85 కోట్లు మంజూరయ్యాయి. వీటి ద్వారా మహబూబ్‌నహర్ 34 కిలోమీటర్లు, ఫతేనహర్ 19 కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయాల్సి ఉంది. హైదరాబాద్‌కు చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ ఫిబ్రవరి 2012లో పనులు చేజిక్కించుకొని అగ్రిమెంట్ కుదుర్చుకుంది. రెండేళ్ల కాలపరిమితిలో కాలువల లైనింగ్, పూడికతీత, జంగిల్ కటింగ్ తదితర పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ మేరకు 2012 ఏప్రిల్‌లో పని ప్రారంభించిన కాంట్రాక్టర్ 6 శాతం పనులు మాత్రమే పూర్తిచేశారు.
 
 కాంట్రాక్ట్ వివాదం...
 ముందుకు సాగని పనులు
 ‘జైకా’ పనులు దక్కించుకునేందుకు రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌తోపాటు మరో కంపెనీ పోటీ పడినట్టు తెలిసింది. పనులు దక్కకపోవడంతో సదరు కంపెనీ ప్రతినిధులు జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత అండతో మరమ్మతు పనులను అడ్డుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో పనులు పూర్తిచేసినా రూ.1.27 కోట్లకు సంబంధించి బిల్లులు చెల్లించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. దీంతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్ న్యాయస్థానానికి వెళ్లి బిల్లులు పొందేందుకు మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కాగా ఇరిగేషన్ అధికారులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఇదే సమయంలో వివాదం మరింత ముదిరింది. ఘనపురం పనుల మరమ్మతుల విషయంలో విజిలెన్స్ శాఖకు, ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి.  
 
 ఇసుక రవాణా కూడా కారణమే..
 పనులు నిలిచిపోవడానికి ఇసుక రవాణా కూడా ఓ కారణమని తెలుస్తోంది. పనులు చేపట్టేందుకు నిజామాబాద్ జిల్లా సరిహద్దు నుంచి ఇసుక తెచ్చుకోవడానికి కాంట్రాక్టర్‌కు అగ్రిమెంట్ ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఇసుక తీయాల్సిన ప్రాంతం మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నందున రవాణా విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. ఈ విషయమై 20 ఫిబ్రవరి 2013న మీడియం ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ విజయ్‌ప్రకాశ్ నాగ్సాన్‌పల్లిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఇసుక వివాదాన్ని పరిష్కరించేందుకు నిజామాబాద్ కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతూ మెదక్ కలెక్టర్ ద్వారా లేఖ రాయించారు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాలోని కిష్టాపూర్, బీర్కూర్, బరంగడి ప్రాంతాల నుంచి ఇసుకను అనుమతించాల్సిందిగా ఇరిగేషన్ అధికారులు సైతం లేఖ రాశారు. కానీ ఇప్పటివరకు ఇసుక రవాణాకు అనుమతి రాకపోవడం, మరోవైపు బిల్లులు చెల్లించకపోవడం, ఏసీబీ, విజిలెన్స్ అధికారులు చర్యలకు ఉపక్రమించడంతో పనులు స్తంభించాయి. కాగా కాంట్రాక్టు గడువును పొడిగించాలని(ఈఓటీ) సదరు కాంట్రాక్టర్ ఇటీవలే దరఖాస్తు చేసుకున్నట్టు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. కాంట్రాక్ట్ సమయాన్ని పొడిగిస్తారా? లేదా? అన్న విషయం తెలియాల్సి ఉంది.
 
 ప్రాజెక్ట్ నిండా నీళ్లు.. రైతన్నకు తప్పని కన్నీళ్లు
 ఘనపురం ప్రాజెక్ట్ నిండా నీరున్నా... చివరి ఆయకట్టులోని రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. శిథిలమైన కాలువల గుండా సాగునీరంతా వృధాగా పోతుండటంతో చివరి ఆయకట్టులోని భూములన్నీ బీళ్లుగా మారుతున్నాయి. ఓ వైపు రబీ పనులు జోరుగా సాగుతున్న సమయంలో చివరి ఆయకట్టు రైతులు బీడు భూములను చూసి కన్నీరు పెడుతున్నారు. ప్రాజెక్ట్ పరిధిలో సుమారు 25 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, ప్రస్తుతం 15 వేల ఎకరాలు మాత్రమే సాగవుతోంది. మరమ్మతుల కాల పరిమితి వచ్చే నెలతో ముగియనుండటంతో రూ.23.85 కోట్ల జైకా నిధులు వెనక్కిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 పోరుబాటలో..
 ఘనపురం కాలువల ఆధునికీకరణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం, తెలంగాణ రైతు రక్షణ సమితి, మానవ హక్కుల వేదిక, విద్యావంతుల వేదిక వంటి ప్రజా సంఘాలు సైతం పోరుబాట పట్టాయి. ఇప్పటికే తెలంగాణ రైతు రక్షణ సమితి, మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమైంది. ఈ విషయాన్ని రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, అవసరమైతే ప్రత్యక్ష ఉద్యమం చేపడతామని కోదండరాం  మెదక్‌లో జరిగిన రైతు సమావేశంలో ప్రకటించారు.
 
 ఇసుక లభించకే పనులకు అంతరాయం..
 ఇసుక లభించకపోవడం వల్లే కాలువల మరమ్మతు పనులు నిలిచిపోయాయి. ఘనపురం ప్రాజెక్ట్ నుంచి పొలాల్లోకి నీళ్లు వదలడం వల్ల కూడా పనులు ముందుకు సాగడం లేదు. ఇసుక సరఫరా కోసం ఇరిగేషన్ శాఖాపరంగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఏసీబీ కోరిక మేరకు పనులకు సంబంధించి రికార్డులను అప్పగించాం. విజిలెన్స్ అధికారులకు కూడా పనులను పరిశీలిస్తున్నారు. వచ్చే నెలతో కాంట్రాక్ట్ గడువు ముగుస్తుంది. గడువు పొడిగింపు కోసం కాంట్రాక్టర్ దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
 - సురేశ్, ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement