గ్రహణం వీడింది
మెదక్: ఘనపురానికి గ్రహణం వీడింది. రైతన్నల సాగునీటి కష్టం త్వరలోనే తీరనుంది. ఇన్నాళ్లూ రాజకీయ రా ‘బంధు’లకు బలై పోయిన ఈ ప్రాజె క్టు తిరిగి మరోసారి శంకుస్థాపనకు సిద్ధమైంది. పాలకులు..ప్రభుత్వం మారడంతో ఈ ప్రాజెక్టుకు మోక్షం కలిగింది. కొత్త ప్రభుత్వంలో భారీనీటిపారుదల శాఖ చేపట్టిన హరీష్‌రావు మెదక్ ప్రాంత రైతన్నల కన్నీటిని తుడిచి సాగునీరందించేందుకు చక చక పావులు కదిపారు. వారంరోజుల్లో ఘనపురం పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు.
ఈ క్రమంలో గురువారం జైకా పనులకు మరోసారి మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. మెతుకు సీమ రైతన్నల ఆశల సౌధం ఘనపురం ప్రాజెక్ట్. 1905లో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌కు మహబూబ్ నహర్, ఫతేనహర్ కెనాళ్లు ఉన్నాయి. వీటి కింద మెదక్, పాపన్నపేట, కొల్చారం మండలాల రైతులు లబ్ధిపొందుతున్నారు. శతాధిక సంవత్సరాల వయస్సుగల ఈ కాల్వలు ఇంత వరకు మరమ్మతుకు నోచుకోలేదు. దీంతో 2009లో నగరబాటలో భాగంగా మెదక్ పట్టణానికి వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఘనపురం కాల్వల ఆధునికీకరణ కోసం రూ.9 కోట్లు మంజూరు చేశారు.
అనంతరం పూర్తిస్థాయి మరమ్మతుల కోసం జపాన్ బ్యాంక్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(జైకా) కింద రూ.21.86 కోట్లు మంజూరయ్యాయి. వీటి ద్వారా మహబూబ్‌నహర్ కెనాల్ 34 కిలోమీటర్లు, ఫతేనహర్‌కెనాల్ 19 కిలోమీటర్ల నిడివి మేర మరమ్మతులు చేయాల్సి ఉంది. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ ఫిబ్రవరి 2012లో పనులు చేజిక్కించుకుని అగ్రిమెంట్ కుదుర్చుకుంది. రెండేళ్ల కాలపరిమితిలో కాల్వల లైనింగ్, పూడిక తీత, జంగిల్ కటింగ్ తదితర పనులు పూర్తి చేయాల్సి ఉంది.
అయ్యో రాఘవా..! ఇవేం అడ్డంకులు
జైకా పనులు దక్కించుకునేందుకు రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌తో పాటు మరో కంపెనీ పోటీ పడినట్లు తెలిసింది. కాగా పనులు దక్కించుకోలేని కంపెనీ జిల్లాకు చెందిన ఓ మాజీ ముఖ్యనేత అండతో మరమ్మతు పనులు అడ్డుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో పనులు పూర్తిచేసిన రూ.1.27 కోట్లకు సంబంధించి బిల్లులు చెల్లించడంలో అధికారులు జాప్యం చేశారనే విమర్శలున్నాయి. చేసిన పనికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు 2013 జూన్ 3వతేదీన ఎంబీ రికార్డు చేసి పీఏఓకు పంపారు. కాని 2013 జూలై 8వ తేదీనఅంటే 37 రోజుల త ర్వాత ఎంబీలో కొన్ని పేజీలు చిరిగి పోయాయని చెబుతూ బిల్లును వాపస్ పంపారు.
అసలు పేజీలు ఏ శాఖలో చిరిగి పోయాయన్నది ఇప్పటికీ అంతుబట్టని రహస్యం. అదే సమయంలో జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కాంట్రాక్ట్‌పై ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఇలా ముప్పేట దాడితో విలవిలలాడిన కాంట్రాక్టర్ పనులు నిలిపివేసి కోర్టుకెక్కాడు. దీంతో జైకా పనులు సాగక రైతన్నల భూములకు నీరందక బీళ్లుగా మారాయి. ఈ క్రమంలో 2014 ఫిబ్రవరి 15వ తేదీతో కాంట్రాక్ట్ సమయం ముగిసి పోయింది. తనకు గడువు పెంచాలని కాంట్రాక్టర్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నా, అదేమీ పట్టించుకోని అప్పటి మంత్రి రీ టెండర్ వేయాలని ఆదేశించినట్లు సమాచారం.
మంత్రి హరీష్ చొరవతో పనులు ప్రారంభం
ఆగిపోయిన జైకా పనులు నీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావు చొరవతో కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన పదవీబాధ్యతలు స్వీకరించగానే జైకా పనులపై ప్రత్యేక దృష్టి నిలిపినట్లు సమాచారం. ఈ క్రమంలో రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కాంట్రాక్ట్ పదవి కాలాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గురువారం జైకా పనులకు మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిల ఆధ్వర్యంలో శంకుస్థాపన జరుగనుంది.ఘనపురం పనులు మళ్లీ ప్రారంభమవుతున్నాయని తెలుసుకున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో పనులు సాగే అవకాాశం లేకున్నప్పటికీ ఖరీఫ్ అనంతరం మహబూబ్ నహర్, ఫతేనహర్ కెనాళ్ల మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.