మెదక్, న్యూస్‌లైన్: మెతుకుసీమ రైతన్నల ఆశలసౌధమైన ఘణపురం ప్రాజెక్ట్‌కు రాహుకాలం దాపురిం చింది. అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లు నిధులున్నా.. కాల్వలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. నీరున్నా పొలాలకు పారడం లేదు. సింగూర్ నీటి వినియోగంలో హక్కు కలిగి ఉన్నా అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది. వీటికి తోడు గత ఫిబ్రవరి నెలలో ప్రాజెక్టులోకి చేరిన గుర్రపు డెక్క ప్రాజెక్టును ముంచేస్తోంది. దీంతో ఆయకట్టు రైతులు సాగునీటి కోసం కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో ఉన్న ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు ఘణపురం. పాపన్నపేట-కొల్చారం మండలాల మధ్య మంజీరా నదిపై నిజాం కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు ఫతేనహర్, మహబూబ్ నహర్ కాల్వలున్నాయి. వీటి ద్వారా సుమారు 22 వేల ఎకరాలకు సాగునీరందాల్సి ఉంది. 1905లో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు, కాల్వలు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో మరమ్మతులకు నోచుకోలేదు. అప్పట్లో నగరబాటలో భాగంగా మెదక్ పట్టణానికి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుడి, ఎడమ కాల్వల మర మ్మతుల కోసం తాత్కాలికంగా రూ.9 కోట్లు మంజూరు చేశారు. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ అలక్ష్యం వల్ల సుమారు రూ.3 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో చివరి ఆయకట్టు రైతుల పరిస్థితి దీనంగా మారింది. కాల్వల పూర్తిస్థాయి మరమ్మతు కోసం 2011లో జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ ఆధ్వర్యంలో రూ.25 కోట్లు మంజూరయ్యాయి.
వివాదాలతో ఆగిన పనులు
కాంట్రాక్టు విషయంలో ఏర్పడిన వివాదం ఘణపురం ప్రాజెక్టు పాలిట గ్రహణంగా మారింది. ఈ పనులు చేయడానికి 2012లో టెండర్ పొందిన ఓ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ పూర్తి చేసుకుని పొదల తొలగింపు పనులు ప్రారంభించారు. 2014 వరకు ఈ పనులు పూర్తికావాల్సి ఉంది. అయితే రాజకీయ ప్రాబ ల్యం గల ఓ నాయకుడి బంధువు ఈ కాంట్రాక్టుపై కన్నుపడటంతో, సదరు నాయకుడు పనులను అడ్డుకుంటున్నాడన్న ఆరోపణలున్నాయి. దీంతో అధికారులు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమైనట్లు తెలుస్తోంది. కాగా ఇసుక బూచిని చూపుతూ పనులు నడవడం లేదని అధికారులు చెబుతున్నారు. శిథిలమైన కాల్వలనుంచి నీరు పారకపోవడంతో చివరి ఆయకట్టు పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. సుమారు 22 వేల ఎకరాల్లో 12 వేల ఎకరాలు మాత్రమే సాగువుతున్నట్లు తెలుస్తోంది.
జల వివాదం
సింగూర్ ప్రాజెక్టు నుంచి ఘణపురం ప్రాజెక్టుకు 4 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. ఈ మేరకు జీఓ ఉన్నప్పటికీ, నీరు విడిచే ప్రతిసారీ ఎంతమేర నీరు వదలాలన్న విషయమై ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేస్తుంది. దీంతో ఘణపురం ఆయకట్టు రైతుల భవిష్యత్తు అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం సింగూర్ ప్రాజెక్టులో 15.4 టీఎంసీల నీరుండగా, ఘణపురం ప్రాజెక్టు నిండుకుండలా కనిపిస్తుంది. దీంతో రైతులు తమ పంట పొలాలకు నీరు వదలాలని మూడు రోజుల క్రితం ఇరిగేషన్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. సింగూర్ నీరు అడగబోమని హామీ ఇస్తేనే ఘణపురం నీటిని వదులుతామని అధికారులు షరతు విధించారు. దీంతో ఆగ్రహించిన మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ఆధ్వర్యం లో గురువారం ఘణపురం ప్రాజెక్టుపై దాడిచేసి బలవంతంగా సాగునీరును వదిలారు.
కాలుష్యంగా మారిన ప్రాజెక్టు
గత ఫిబ్రవరి నెలలో ఏడుపాయల జాతర కోసం సింగూర్ నీరు వదిలిన సమయంలో ఘణపురం ప్రాజెక్టులోకి భారీస్థాయిలో గుర్రపుడెక్క చేరింది. దీంతో ప్రాజెక్టులోని నీరు రోజురోజుకి కలుషితమవుతోందని రైతులు వాపోతున్నారు. తాము చేపలు పట్టలేకపోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఘణపురం జలకళను చూసి పర్యాటక అందాలను ఆస్వాదిద్దామనుకున్న భక్తులకు నిరాశే మిగులుతోంది. అధికారులు స్పందించి వెంటనే జైకా పనులు ప్రారంభించి, ఘణపురం ప్రాజెక్ట్‌కు రావాల్సిన 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు.
సాగునీటికి యేటా తిప్పలే.
Published Sat, Aug 10 2013 12:26 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
Advertisement
Advertisement