
సాక్షి, మెదక్: సింగూర్ నీటిని తరలింపుతో సంగారెడ్డి జిల్లాతో పాటు మెదక్ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం మెదక్ పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగూర్ నీటి తరలింపు సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టిన కానీ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. మంత్రి హరీష్‌రావు అనాలోచితంగా నీటిని తరలించడం వలనే సంగారెడ్డి జిల్లాతో పాటు మెదక్-ఘనపూర్ ఆయకట్టు రైతులకు, మెదక్ మున్సిపాలిటీకి నీరు అందడం లేదన్నారు. దీనికి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
నీటి సమస్య తీర్చే విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చే వరకు హరీష్ రావు ను మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో తిరగనిచ్చేది లేదని వ్యాఖ్యానించారు. జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజాసమస్యలను గాలికొదిలేసి.. హరీష్ రావు ఇంటి వద్ద భజన చేస్తున్నారని నిప్పులు చెరిగారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment