మెదక్: ‘మానీళ్ళు మాగ్గావాలి.. మా నిధులు, మా ఉద్యోగాలు.. మా పాలన మాగ్గావాలి’ అని నినదించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నా.. ఘనపురం ఆయకట్టు రైతుల ఆశలు మాత్రం నెరవేరడం లేదు. ప్రాజెక్టు నిర్మించి 110 ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు సింగూర్ నీటిలో నిర్దేశిత వాటాపై శాశ్వత జీఓ విడుదల కాలేదు. ఖరీఫ్, రబీ సీజన్‌లలో సాగునీటి కోసం ఏటా రైతన్నలు బతిమిలాడటం తప్పడం లేదు. సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు సాగునీటి విడుదలకు ప్రతిసారీ పాలకుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వస్తోంది.
ఈసారి కరువు మేఘాలు కమ్ముకొస్తున్నా.. ఖరీఫ్ సీజన్ కరిగిపోతున్నా.. పాలకులు స్పందించడం లేదు. సింగూర్‌లో 13 టీఎంసీల నీరు నిల్వ ఉన్నా.. ఘనపురం ఆనకట్టకు నీటి విడుదల విషయంలో పాలకులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో 30 వేల ఎకరాల ఆయకట్టు రైతాంగం వరి తుకాలు కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతోంది. మెతుకుసీమ ఒకప్పుడు వేలాది మందికి పట్టెడన్నం పెట్టిన పుడమితల్లి. మంజీర జలాలు పచ్చని పైరు పంటలకు ఊపిరి పోశాయి.
అది 1896 సంవత్సరం. మెతుకుసీమలో ఏర్పడిన ఘోర కరవుతో జనం ఆకలి దప్పులతో అలమటించారు. ఈ దుస్థితిని ఎదుర్కొనేందుకు 1898లో మంజీర నదిపై పాపన్నపేట, కొల్చారం మండలాల మధ్య, ఘనపురం ఆనకట్ట నిర్మాణానికి అప్పటి నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ రస్టో అలక్ ఎస్క్యేర్ ప్రాజెక్టుకు ప్లాన్ రూపొందించారు. 1899 ఆక్టోబర్ 3న ఆనకట్టకు పునాది వేశారు. 1905లో మహరాజ బహుదూర్ యామిన్ అజ్ సుల్తాన్ ఆనకట్టకు ప్రారంభోత్సవం చేశారు. 2,337 అడుగుల పొడవున నిర్మించిన ఘనపురం ఆనకట్టకు కుడివైపు మహబూబ్ నహర్ కెనాల్, ఎడమ పక్కన ఫతేనహర్ కెనాల్ నిర్మించారు. వీటి కింద మెదక్, కొల్చారం, పాపన్నపేట మండలాల్లోని 30 వేల ఎకరాలను సాగులోకి తేవాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకు 8.03 అడుగుల ఎత్తు మేర ఆనకట్టను కట్టారు.
ఘనపురానికి అశనిపాతంగా మారిన సింగూరు
హైదరాబాద్‌లోని జంట నగరాలకు తాగునీరందించే లక్ష్యంతో మంజీర నదిపై 1980లో నిర్మించిన సింగూరు ప్రాజెక్టు ఘనపురం ఆయకట్టు రైతుల పాలిట శాపంగా మారింది. సింగూరు ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 30 టీఎంసీలు కాగా, జంట నగరాల తాగునీటి అవసరాలకు 4 టీఎంసీలు, ఘనపురం ప్రాజెక్టుకు 4 టీఎంసీలు, నిజాంసాగర్ ప్రాజెక్టుకు 8 టీఎంసీలు, మెదక్ జిల్లా రైతాంగానికి 2 టీఎంసీలు, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు 8 టీఎంసీలు, మిగతా 4 టీఎంసీల నీరు ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్‌గా నిల్వ చేసేందుకు నిర్ణయించారు. ఈమేరకు 1980 ఏప్రిల్ 12న ప్రభుత్వ జీఓ నం.190 జారీ చేసింది.
ప్రతి ఏటా ఘనపురం ప్రాజెక్ట్‌కు 4 టీఎంసీల నీరు విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్ల కోసం ఘనపురం ఆనకట్టకు నీరు విడుదల చేయాలంటే తాత్కాలిక జీవోలు జారీ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు శాశ్వత జీఓ లేదు. పాలకుల దయాదాక్షిణ్యాలపైనే ఆయకట్టు రైతుల భవిష్యత్తు ఆధారపడుతోంది. రెండేళ్ల క్రితం సాగునీటి విడుదల కోసం ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కొంతమంది రైతు లు మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ ఏడు ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు లేక కరువు మేఘాలు కమ్ముకొస్తున్నాయి. ఘనపురం ప్రాజెక్ట్‌లో ఏళ్ల తరబడి పూడిక తీయక నిల్వ నీటి సామర్థ్యం తగ్గిపోయింది, చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు జైకా పథకం కింద రూ.25 కోట్లు మంజూరై రెండేళ్లు గడుస్తున్నా..ఇప్పటి వరకు పనులు పూర్తికాలేదు. ఇటీవలే ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావు చొరవతో పనులు ప్రారంభమయ్యాయి. కాగా ఖరీఫ్ సీజన్‌లో కార్తెలు కరిగి పోతున్నాయి. చిన్న పుష్యాల పాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఘనపురం ఆయకట్ట పరిధిలోని రైతులు వరి తుకాలు వేసి వాటిని పరిరక్షించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు.
సింగూరు ప్రాజెక్టులో సుమారు 13 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉన్నందున ఘనపురం ప్రాజెక్టుకు 0.2 టీ ఎంసీల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న అన్నదాతల వేదన అరణ్య రోదనగానే మారింది. సిం గూర్ నుంచి 4 టీఎంసీల నీళ్లు పొందే హక్కున్నా.. తమకు కన్నీళ్లే మిగులుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వరాష్ట్రంలోనైనా తమ కన్నీటి ఘోసను తీర్చాలని రైతన్నలు వేడుకుంటున్నారు. వెంటనే మంత్రి హరీష్‌రావు స్పందించి వేలాది అన్నదాతల ఆకాంక్షను నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మా నీళ్లు.. మాగ్గావాలె
Published Sun, Jul 27 2014 11:41 PM | Last Updated on Sat, Sep 2 2017 10:58 AM
Advertisement