నిధులు ఖర్చు చేస్తే నీళ్లేవి?
పదేళ్లలో ఐదు లక్షల ఎకరాలకైనా నీళ్లిచ్చారా?
కాంగ్రెస్‌కు ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు ప్రశ్నలు
1956 నుంచి 2004 వరకు గరిష్టంగా జరిగిన సాగు 18 లక్షలే
తమ్మిడిహెట్టి 152 మీటర్లకు సమ్మతి ఉన్నట్లు ఒక్క కాగితమైనా ఉందా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి రంగంపై కాంగ్రెస్ చేసిన ప్రజెంటేషన్‌ను ప్రభుత్వం తిప్పికొట్టింది. అవాస్తవాలతో ప్రజలను గందరగోళ పరిచేందుకు ప్రయత్నించిందని విమర్శించింది. ఉమ్మడి ఏపీలో సాగునీటి రంగంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని శ్రీకృష్ణ కమిటీ ముందు చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తెలంగాణను కించపరిచేలా వ్యవహరించారని దుయ్యబట్టింది. కాంగ్రెస్ ప్రజెంటేషన్‌పై గురువారం ప్రభుత్వం తరఫున సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు సచివాలయంలో గంటన్నర పాటు వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ లేవనెత్తిన ప్రతి అంశాన్ని స్పృసిస్తూ.. కొట్టిపారేశారు. వివిధ అంశాలపై విద్యాసాగర్‌రావు ఏమన్నారో ఆయన మాటల్లోనే..
2004 వరకు గరిష్ట సాగు 18 లక్షలే..
రాష్ట్రంలో 1956 నుంచి 2004 వరకు కెనాల్, చెరువుల కింద ఉన్న సాగు 47 లక్షలని కాంగ్రెస్ చెప్పింది. నిజానికి ఇరిగేషన్ ద్వారా గరిష్టంగా 1990-91లో 18 లక్షల ఎకరాలకు సాగు నీరందింది. మిగతా ఏ ఏడాదిలోనే ఈ స్థాయిలో సాగు నీరందలేదు. బోర్లు, బావుల కింద రైతులు తమ సొంత ఖర్చుతో చేసుకున్న 32 లక్షల ఎకరాల సాగును తన ఖాతాలో కలిపేసుకుని 47 లక్షలనడం తప్పు. 2004-14 వరకు 51 లక్షల ఎకరాలకు ప్రాజెక్టుల నిర్మాణం చేశారని కాంగ్రెస్ చెబుతోంది. ఇందులో ఎప్పుడైనా 5 లక్షల ఎకరాలకైనా నీళ్లిచ్చారా?. కేవలం నిధులు ఖర్చు చేశారు తప్పితే నీళ్లివ్వలేదు.
జాతీయ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉందన్న సీడబ్ల్యూసీ
కాంగ్రెస్ పార్టీ ప్రతిసారీ ప్రాణహిత-చేవెళ్ల గొప్ప ప్రాజెక్టని, జాతీయ హోదాకు ప్రయత్నించామని చెబుతోంది. నిజానికి కేంద్ర జల సంఘం ఈ ఏడాది జూలై 4న కేంద్ర కేబినెట్ సెక్రటరీకి సమర్పించిన లేఖలో ప్రాణహితపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘ఎలాంటి సర్వేలు చేయకుండా ప్రాథమిక అంచనాలతో ప్రాజెక్టును రూ.42,300 కోట్లతో వ్యయం వేశారు. 180 టీఎంసీల నీటిని మళ్లించేందుకు 7 రిజర్వాయర్లను 14.7 టీఎంసీలతో ప్రతిపాదించారు. ఇందులో 90 టీఎంసీలను మళ్లించేందుకే ప్రణాళిక వేశారు. ఎలాంటి సర్వే.. డిజైన్స్ లేకుండా ఈపీసీ విధానం ద్వారా చేపట్టిన ఈ ప్రాజెక్టును గమనిస్తే కాంట్రాక్టర్లకు లాభార్జన చేసేలా, జాతీయ ప్రయోజనాలకు భంగం కలిగేలా ఉంది’ అని ఘాటుగా విమర్శించింది. మహారాష్ట్ర తమ్మిడిహెట్టి 152 మీటర్లను వ్యతిరేకించడం, ఆ ఎత్తులో నీటి లభ్యత లేకపోవడంతోనే మేడిగడ్డ ద్వారా నీటిని మళ్లించాలని నిర్ణయించాం. మేడిగడ్డ ద్వారా నిర్ణీత 16 లక్షల ఎకరాలతో పాటు ఎస్సారెస్పీ, సింగూరు, నిజాంసాగర్ కింద ఉన్న 20 లక్షల ఆయకట్టుకు కలిపి మొత్తంగా 36 లక్షల ఎకరాలను స్థిరీకరించే అవకాశం ఉంది. మరి 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకున్నట్లు కాంగ్రెస్ వద్ద ఒక్క కాగితమైనా ఉందా?.
ముంపు తగ్గిస్తే పాలమూరు తప్పంటారా?
తక్కువ సామర్థ్యం ఉన్న జూరాలను కాదని పెద్ద రిజర్వాయరైన శ్రీశైలం నుంచి నీటిని పాలమూరు ద్వారా తరలిస్తామంటే కాంగ్రెస్ తప్పంటోంది. నిజానికి శ్రీశైలానికి జూరాలతో పాటు తుంగభద్ర నీళ్లొస్తాయి. ఇక జూరాలతో ముంపు 72 వేల ఎకరాలైతే.. శ్రీశైలంతో ముంపు 40 వేల ఎకరాలే. జూరాలతో ప్రభావితమయ్యే కుటుంబాలు 84 వేలైతే.. శ్రీశైలంతో 11 వేలే. ఈ దృష్ట్యానే శ్రీశైలం ఎంపిక చేశాం. పాలమూరు, డిండి ఎత్తిపోతల ద్వారా రంగారెడ్డి జిల్లాలో 4.35 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు యత్నిస్తున్నాం. ప్రాణహిత పథకంలో 2.10 లక్షల ఎకరాలకే జిల్లాలో నీళ్లిచ్చేలా ప్రణాళిక వేశారు. కానీ రీఇంజనీరింగ్‌తో 4.35 లక్షల ఎకరాలకు నీరందుతుంది.
ఉమ్మడి ఏపీలో అన్యాయాన్ని ప్రస్తావించరా?
ఉమ్మడి ఏపీలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగినా కాంగ్రెస్ తన ప్రజెంటేషన్లో ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని మళ్లించినా, దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ ద్వారా నీటిని తీసుకెళ్లే ప్రయత్నం చేసినా మాట్లాడలేదు. ఆర్డీఎస్ కాల్వల పనుల్లో ఏపీ అడ్డుకుంటున్న వైనాన్ని చెప్పలేదు. కేవలం తన తప్పిదాలను కప్పిపుచ్చి, తెలంగాణ ప్రజలను గందరగోళపరిచే ప్రయత్నం చేసింది.