నీళ్లు, నిధులు సాధించుకుంటాం
- ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తాం: సీఎం కేసీఆర్
- పొరుగు రాష్ట్రాలతో బస్తీ మే సవాల్ అంటే నీళ్లు రావు
- మన అప్పులు చాలా రాష్ట్రాల కంటే తక్కువే
- 2019-20 నాటికి రాష్ట్ర బడ్జెట్ రూ. 2 లక్షల కోట్లు దాటుతుంది
- ఇంటికో ఉద్యోగమిస్తామని ఏనాడూ చెప్పలేదు
- ఈ టర్మ్‌లోనే లక్ష ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ పూర్తిచేస్తాం
- గ్రూప్-2లో మరో వెయ్యి పోస్టులకు నోటిఫికేషన్
- 31న సాగునీటిపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్
- అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై సీఎం సుదీర్ఘ ప్రసంగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు కారణమైన నీళ్లు, నిధులు, నియామకాలను సాధించుకోవడంలో వెనకడుగు వేసేది లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులతోపాటు కొత్తగా తలపెట్టిన ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తిచేస్తామని చెప్పారు. పక్క రాష్ట్రాలతో ‘బస్తీ మే సవాల్’ అనే ధోరణిలో వెళ్లకుండా వాళ్ల ప్రయోజనాలు కూడా కాపాడుతూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సాగునీటిని సాధించుకుంటున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, తదనుగుణంగా ఫలితాలు కనిపిస్తున్నాయని అన్నారు. మంగళవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై సభ్యులు వ్యక్తం చేసిన సందేహాలకు సీఎం సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి ఏమన్నారో ఆయన మాటల్లోనే..
బడ్జెట్ కేటాయింపులు ఎప్పుడూ ఖర్చు కావు
తెలంగాణ కొత్త రాష్ట్రం. ఏడు నెలల వరకు ఐఏఎస్‌లు కూడా లేరు. అయినా పదేళ్ల కాంగ్రెస్ పాలన కంటే, కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిన బడ్జెట్ కంటే మెరుగైన ఫలితాలు సాధించినం. 2011-12 నుంచి 2014-15 వరకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా నిధుల్లో 83.23 శాతం మాత్రమే ఖర్చు చేస్తే పదేళ్ల కాంగ్రెస్ పాలనలో 79.52 శాతం ఖర్చు చేశారు. కానీ 2015-16లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం 80.33 శాతం ప్రణాళిక నిధులు ఖర్చు చేసింది. లగ్జరీ జెట్ తీసుకొని చైనా పర్యటనకు వెళ్లి రూ.15 కోట్లు వృథా ఖర్చు చేశారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. అది అవాస్తవం. చైనా ‘గో గ్లోబల్’ కార్యక్రమంలో భాగంగా వరల్డ్ ఎకానమిక్ ఫోరం నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు మంత్రులు, అధికారులతో కలసి మొత్తం 17 మంది చైనాకు వెళ్లి తొమ్మిది రోజుల పాటు 13 బిజినెస్ మీటింగుల్లో పాల్గొన్నాం. ఇందుకు విమానం ఖర్చు రూ.2.03 కోట్లు అయితే భోజనాలు, హోటళ్లు, లాడ్జింగులు, వాహనాల రెంటుకు అయిన ఖర్చు రూ.72 లక్షలు.
తెలంగాణ అప్పులు 16.1 శాతమే
అప్పులకు భయపడాల్సిన అవసరం లేదు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం ప్రభుత్వం రాష్ట్ర అవసరాలకు అప్పులు తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వ అప్పులు 47 శాతం ఉంటే తెలంగాణ అప్పులు 16.1 శాతమే. పంజాబ్, గోవా, ఉత్తరప్రదేశ్, కేరళ, బిహార్, మధ్యప్రదేశ్ మొదలుకొని ఆంధ్రప్రదేశ్ వరకు 17 నుంచి 30 శాతం వరకు అప్పుల్లో ఉన్నాయి. పంజాబ్ 36 శాతంతో అగ్రస్థానంలో ఉంటే ఛత్తీస్‌గఢ్, తెలంగాణ తప్ప అన్ని రాష్ట్రాలు 20 శాతంపైనే ఉన్నాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వృద్ధి రేటు ఉంటేనే అప్పులు పుడతాయి. 2015-16లో 12.7 శాతం వృద్ధిరేటు తెలంగాణకు ఉంది. బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అప్పు పుట్టని రాష్ట్రాల కేటగిరీలో ఉన్నాయి.
ఇంటికో ఉద్యోగమని చెప్పలేదు
ఇంటికో ఉద్యోగం అని నేనెక్కడా చెప్పలేదు. ఇంటికో ఉద్యోగాన్ని ఏ రాష్ట్రమూ, కేంద్రం కూ డా ఇవ్వలేదు. ప్రభుత్వ ఉద్యోగాల పైనే ఆశలు పెంచుకొని యువకులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. అవసరమైన చోట కొత్త పోస్టులు సృష్టించి ఉద్యోగాలు కల్పిస్తాం. రాష్ట్రంలో లక్ష మందికి ఉద్యోగాలు కల్పించే ప్రక్రియను ఈ టర్మ్‌లోనే పూర్తి చేస్తాం. ప్రభుత్వ రంగ సంస్థల విభజన, ఉద్యోగుల విభజన పూర్తి కాలేదు. అయినా 24,500 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినం. 10 వేల టీచర్ పోస్టులకు రేపోమాపో నోటిఫికేషన్ వస్తది. ఆర్.కృష్ణయ్య, కె.లక్ష్మణ్ నన్ను కలసి గ్రూప్-2 కింద 400పైచిలుకు పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారని, ఖాళీలు ఉన్నాయని చెప్పారు. త్వరలోనే మరో వెయ్యి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాం.
కోటి ఎకరాలకు సాగునీరు.. ఇంటింటికి మంచినీరు
తెలంగాణలో నిర్మాణంలో ఉన్న, కొత్తగా ప్రకటించిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి. కొత్తవి, పాతవి కలిపి వచ్చే మూడేళ్లలో లక్షా యాభై వేల కోట్లు ఖర్చు పెడితే ఇవన్నీ పూర్తవుతాయి. ప్రాజెక్టులపై 31న సమగ్రంగా చర్చిద్దాం. మిషన్ భగీరథ పథకం అత్యద్భుతం. దానికోసం ఎంత పెట్టుబడైనా పెట్టాల్సిందే. వచ్చే 50 ఏళ్ల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని కృష్ణా, గోదావరి నుంచి వచ్చే నీటిని మదింపు చేసుకొని ఈ ప్రాజెక్టును చేపట్టాం. ప్రతిరోజు ప్రతి ఒక్కరికి మంచినీరు అందిస్తే అంతకు మించిన లక్ష్యాన్ని చేరడం వేరే లేదు. 2016 డిసెంబర్ నాటికి 6,200 గ్రామాలకు తాగునీరు అందించబోతున్నాం. 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్, మే నెలల్లోనే అందిస్తాం. ప్రాజెక్టులకు ఖర్చులు పెట్టడం వల్ల నష్టం లేదు. 2019-20 సంవత్సరం బడ్జెట్ రూ.2 లక్షల కోట్లు దాటుతుంది. ప్రాజెక్టులకు చేసే అప్పులు తనఖా రుణాలుగా ఉంటాయి. వాటిని ఆయా సంస్థలే భరిస్తాయి.
నీటి ప్రాజెక్టుల మీద సమగ్ర చర్చ
సాగునీటి రంగం పరిస్థితి, పొరుగు రాష్ట్రాలతో ఒప్పందాలు, ఎవరెవరు ఏం చేశారు, ఏం ఒప్పందాలు చేసుకున్నారు? అన్న అంశాలపై 31న అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తాం. గూగుల్ మ్యాప్స్‌తో ఏయే రాష్ట్రాల్లో ఏం ప్రాజెక్టులు, ఎంత నీరు వినియోగం అవుతుందో చూపిస్తాం. మండలి వాళ్లను కూడా పిలుద్దాం. సభ్యులందరికీ పెన్‌డ్రైవ్‌లో ఈ సమాచారం ఇస్తాం. గంటన్నర లంచ్‌బ్రేక్ ఇచ్చి సాగునీటి రంగ నిపుణులతో చర్చించి ఎవరికైనా సందేహాలు ఉంటే వాటిని లేవనెత్తవచ్చు. రాత్రి 11 గంటల వరకైనా సభను నడుపుకుందాం. అప్పటికీ పూర్తికాకపోతే ఒకటో తారీఖున కంటిన్యూ చేద్దాం.
ఏప్రిల్‌లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపునకు బిల్లు
ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగే పార్లమెంటు సమావేశాల్లో.. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల పెంపునకు సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లు ఆమోదం పొందితే.. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో కేంద్రం నుంచి వివిధ రూపాల్లో సాయం పెరుగుతుంది. సీఎం తరహాలో.. మంత్రులకు రూ.25 కోట్ల మేర ప్రత్యేక అభివృద్ధి నిధులు (ఎస్‌డీఎఫ్) మంజూరు చేస్తాం.
దర్గా భూములు వక్ఫ్‌కు అప్పగిస్తాం
హుస్సేనీ షా వలీ దర్గా భూములతో పాటు ఇతర దర్గా భూముల్లో అన్యాక్రాంతం కాగా మిగిలిన వాటిని వక్ఫ్‌బోర్డుకు అప్పగిస్తాం. దర్గా భూములను పొందిన సంస్థలు చెల్లించే మొత్తాన్ని వక్ఫ్‌బోర్డు ఖాతాకు జమ చేసి మైనార్టీల సంక్షేమానికి వెచ్చిస్తాం. సౌదీ, అజ్మీర్ యాత్రకు వెళ్లే వారి సౌకర్యం కోసం రుబాత్‌ల నిర్మాణం కోసం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేస్తాం. కేంద్ర ప్రభుత్వ నిబంధనలతో కరువు మండలాల గుర్తింపులో శాస్త్రీయత లోపించింది. కేంద్రం మంజూరు చేసిన ఇన్‌పుట్ సబ్సిడీ రూ.770 కోట్లకు అదనంగా రాష్ట్రం కొంత జోడించి ఖరీఫ్‌లోగా రైతులకు అందజేస్తుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఏప్రిల్‌లోగా పూర్తిగా చెల్లించి, వచ్చే ఏడాది నుంచి ప్రతీనెలా చెల్లించేలా ఏర్పాట్లు చేస్తాం.
ప్రజలు నవ్వుకోకూడదనే: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘మీరు చెప్పేవి విని మౌనంగా వెళ్లిపోయామని ప్రజలు అనుకోకుండా, నవ్వకుండా ఉండేందుకే నేను మాట్లాడుతున్నా’ అని ప్రతిపక్ష నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. అనంతరం జానారెడ్డికి వివరణ కోరేందుకు అవకాశమివ్వగా.. ‘వేగవంతమైన అభివృద్ధికి మా సహకారం ఉంటుంది. సీఎంకు ముందుకు వెళ్లాలనే కోరిక బలంగా ఉంది. విమర్శించేందుకు కాదు.. అలర్ట్ చేయడానికే మాట్లాడుతున్నాం. మీ ప్రసంగంలో సాధ్యం కాని అంశాలను గుర్తు చేస్తున్నాం. మీరు అక్కడే (సీఎం స్థానాన్ని చూపిస్తూ) కూర్చోవాలని ఆశిస్తున్నాం. గతంలో అక్కడి నుంచే వచ్చాం. ప్రజలు కోరుకుంటే తిరిగి అక్కడకు వెళ్తాం’ అని వ్యాఖ్యానించారు. ద్రవ్య వినిమయ బిల్లును కాంగ్రెస్ ఆమోదించిందా, వ్యతిరేకించిందా అనే అంశంపై స్పష్టత ఇవ్వకుండానే జానారెడ్డి ప్రసంగం ముగించారు.