- రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ సలహాదారు విద్యాసాగర్‌రావు
- ముగిసిన రెండురోజుల ‘ఐవా’ అంతర్జాతీయ సదస్సు
సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మించనున్న సాగునీటి ప్రాజెక్టుల్లో పదిశాతం జలాలను గ్రామీణ, పట్టణ తాగునీటి అవసరాలకు విధిగా కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ సలహాదారుడు ఆర్.విద్యాసాగర్‌రావు అన్నారు. ఇండియన్ వాటర్‌వర్క్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘పట్టణాల్లో మెరుగైన తాగునీటి సరఫరా..ఉత్తమ పద్ధతులు’ అన్న అంశంపై బేగంపేట్‌లోని ఓ హోటల్‌లో జరిగిన రెండురోజుల అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో శుక్రవారం ఆయన కీలకోపన్యాసం చేశారు.
హైదరాబాద్ నగరానికి ఆయా జలాశయాల నుంచి తరలిస్తున్న నీటి పంపింగ్‌కు నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యేక ఫీడర్ల ఏర్పాటుపైనా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అమెరికా,జపాన్ దేశాలతోపాటు ఐవా అధ్యక్షుడు పీజీ శాస్త్రి, ప్రతినిధులు బి.చంద్రశేఖర్, వి.జంబుల్‌రెడ్డి, జలమండలి ఈఎన్‌సీ ఎం.సత్యనారాయణ, డెరైక్టర్ జి.రామేశ్వర్‌రావు పాల్గొన్నారు.
అంతర్జాతీయ సదస్సు తీర్మానాలివే
ప్రతి సాగునీటి ప్రాజెక్టులో పదిశాతం నీటి వాటాను గ్రామీణ,పట్టణాల తాగునీటి అవసరాలకు కేటాయించాలి, నగరాల్లో 24 గంటలపాటు కొరత లేకుండా నీటిని సరఫరా చేయాలి. నీటి వృథాను అరికట్టాలి, ఉపయోగించిన నీటిని పునఃశుద్ధి(రీసైక్లింగ్)చేసి తిరిగి వినియోగించే విధానాలపై దృష్టిసారించాలి,తాగునీటిని అందిస్తున్న జలాశయాలను పదికాలాల పాటు పరిరక్షించాలి, తాగునీటి జలాశయాలు కాలుష్యం,కబ్జాల బారిన పడకుండా కాపాడాలి, తాగునీటిని పొదుపుగా వాడడంపై ప్రజల్లో విస్తృత అవగాహనకల్పించాలి, పట్టణ ప్రణాళికలో నీటి సరఫరాకు అధిక ప్రాధాన్యం కల్పించాలి, వర్షపునీటిని జాగ్రత్తగా ఒడిసిపట్టాలి, భూగర్భజలాల పెంపునకు ప్రభుత్వం,ప్రజలు కృషిచేయాలి.