నీళ్లు: ఎన్నెన్నో సవాళ్లు..
సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి భారీ లక్ష్యాలు
గత ఏడాది కొత్తగా నీరందించింది 2 వేల ఎకరాలకే
హైదరాబాద్: ‘నీళ్లు, నిధులు, నియామకాల’ కోసం పోరాడి ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్రానికి నీటి వనరుల విషయంలో తొలి ఏడాది కొంత మోదం.. కొంత ఖేదం ఎదురైంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను వేగిరం చేసేందుకు, కొత్త ప్రాజెక్టులకు ఓ రూపునిచ్చేందుకు, పొరుగు రాష్ట్రాలతో వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం చూపిన చొరవ కొంత ఫలితమిచ్చినా... కళ్ల ముందు మాత్రం భారీ లక్ష్యమే ఉంది. ఆయక ట్టు లక్ష్యాలను చేరుకునేందుకు, ప్రాజెక్టుల పూర్తికి రూ.లక్ష కోట్ల మేర నిధులను ఖర్చు చేయాల్సి రానుంది. కొత్తగా చేపడుతున్న ‘పాలమూరు’ ఎత్తిపోతల పథకాన్ని నాలుగేళ్లలో పూర్తిచేయడం ఓ సవాలుకాగా.. అనేక వివాదాలను మోస్తున్న ‘ప్రాణహిత’కు రూపునిచ్చి జాతీయ హోదా దక్కించుకోవడం మరో పెద్ద సవాలు.
వేగం పెంచితేనే..!
సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్న వ్యయం అంతా ఇంతా కాదు. 33 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు రానున్న నాలుగేళ్లలో దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. ప్రాజెక్టులకు 2014-15తో పాటు ఈ ఏడాది బడ్జెట్‌లో కలిపి మొత్తంగా రూ.10 వేల కోట్ల మేర కేటాయించినా.. అదనంగా అందుబాటులోకి వచ్చిన కొత్త ఆయకట్టు 2 వేల ఎకరాలు మాత్రమే. భూసేకరణ సమస్యలు, పరిహారంలో జాప్యం, ఎస్కలేషన్ చార్జీలు పెంచాలంటూ కాంట్రాక్టర్లు పనులు నిలిపేయడం వంటి కారణాలతో ఈ ఏడాదిలో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోయింది. అసలు ఈ ఏడాది జూన్‌నాటికి పూర్తయి అందుబాటులోకి వచ్చే ప్రాజెక్టుల పరిధిలో కొత్తగా సుమారు 6.26 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. కానీ అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికైనా భూసేకరణ, సహాయ పునరావాసంతో పాటు ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచితేనే ఆయకట్టు లక్ష్యాలు సాకారమవుతాయి.
రూపు మారుతున్న ప్రాణహిత..
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న మరో కీలక నిర్ణయం ‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టు డిజైన్‌ను పూర్తిగా మార్చడం. ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద చేపట్టదలచిన బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్ర అభ్యంతరాలు, ప్రాణహితలో నీటి లభ్యతపై కేంద్ర జల సంఘం లేవనెత్తిన ప్రశ్నల దృష్ట్యా ఈ ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలని నిర్ణయించారు. ఆయకట్టు లక్ష్యాలు ఎక్కడా దెబ్బతినకుండా... 160 టీఎంసీల నీటిని కాళేశ్వరం దిగువన మేటిగడ్డ వద్ద నుంచి మళ్లించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక వీటితో పాటు కంతనపల్లి, దేవాదుల, ఎల్లంపల్లి ప్రాజెక్టులను కూడా రీఇంజనీరింగ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
కొనసాగుతున్న వివాదాలు..
రాష్ట్ర విభజన తర్వాత సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన వివాదాలూ ముసురుకున్నాయి. ముఖ్యంగా కృష్ణా నది నీటి వాడకంపై ఆంధ్రప్రదేశ్‌తో మొదలైన వివాదం.. కృష్ణా డెల్టాకు నీటి విడుదలపై బోర్డు జోక్యం నుంచి ఖరీఫ్, రబీ పంటలకు నీరిచ్చే వరకు కొనసాగింది. సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో నీటి జగడం చివరకు ఇరు రాష్ట్రాల మధ్య శాంతిభద్రతలకు భంగం కలిగించేంతవరకూ వెళ్లింది. చివరికి గవర్నర్ జోక్యంతో ఆ సమస్యకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంలో కృష్ణా బోర్డు పూర్తిగా విఫలమైంది. ఇప్పటికీ ప్రాజెక్టుల నిర్వహణ మార్గదర్శకాలు, విధానాలను ఖరారు చేయలేదు. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ వద్ద మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల మధ్య ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే దిగువ పెన్‌గంగ, లెండి ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్రతో ఉన్న వివాదాలను ఓ కొలిక్కి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలమైంది.
కొత్త ప్రాజెక్టులు.. కొంగొత్త ఆశలు..
టీఆర్‌ఎస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. శ్రీశైలం నుంచి 70 టీఎంసీల నీటిని తీసుకుని.. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని పది లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడం దీని లక్ష్యం. జూన్ 11న శంకుస్థాపన చేయనున్న ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.35 వేల కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. దీనితోపాటు నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరుతో పాటు ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు మంచినీరు అందించేందుకు నక్కలగండి ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. నక్కలగండి రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి మిడ్‌డిండి ద్వారా అప్పర్ డిండి వరకు నీటిని తరలించేందుకు రూ.5,500 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు.
త్రికరణశుద్ధితో పనిచేస్తున్నాం..
‘‘గతంలో సాగునీటి ప్రాజెక్టుల పనులన్నీ కాంట్రాక్టర్ల కోసం, పర్సంటేజీల కోసం ఆలోచించి చేపట్టారు. ఇప్పుడు తెలంగాణ కోణంలో దీర్ఘకాలిక ప్రయోజనాలను చూసుకుంటూ, భవిష్యత్‌కు భరోసా ఇచ్చేలా ప్రాజెక్టులను తీర్చిదిద్దుతున్నాం. మూడు రకాల వ్యూహాలతో సాగునీటి రంగాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతోంది. సాగునీటి రంగం విషయంలో ఎలాంటి అనుమానాలు, అపోహలు వద్దు. కచ్చితంగా అనుకున్న ఆయకట్టుకు, అనుకున్న సమయానికి నీరందించేందుకు త్రికరణ శుద్ధితో పనిచేస్తున్నాం.’’
- హరీశ్‌రావు, నీటి పారుదలశాఖ మంత్రి