2020 నాటికి తుపాకులగూడెం పూర్తి | Fill the ponds with the water - errabelli dayakar rao | Sakshi
Sakshi News home page

2020 నాటికి తుపాకులగూడెం పూర్తి

Published Tue, Apr 30 2019 1:13 AM | Last Updated on Tue, Apr 30 2019 1:13 AM

Fill the ponds with the water - errabelli dayakar rao - Sakshi

కన్నాయిగూడెం: ఏజెన్సీ ప్రాంతాల్లోని చెరువులను దేవాదుల నీటితో నింపుతామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం దేవాదుల చొక్కారావు ఎత్తిపోతల పథకం ఇన్‌టెక్‌ వెల్, తుపాకులగూడెం గోదావరి నదిపై నిర్మిస్తున్న పీవీ నర్సింహారావు సుజల స్రవంతి బ్యారేజి నిర్మాణ పనులను ఆయన అధికారులతో కలసి సోమవారం పరిశీలించారు. దేవాదుల ప్రాజెక్టుకు ప్రాణధారమైన తుపాకులగూడెం బ్యారేజి నిర్మాణం పనులు 2020 జనవరి నాటికి పూర్తి చేయడానికి చర్యలు చేపట్టామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవాదుల ఎత్తిపోతల పథకంలోని గంగారం ఇన్‌టెక్‌వెల్‌ పంపులకు ఏడాది పొడవునా నీరందించే లక్ష్యంతో 7 టీఎంసీల సామర్థ్యంతో తుపాకులగూడెం బ్యారేజి నిర్మాణ స్థలాన్ని మార్చినట్లు పేర్కొన్నారు. దీనిద్వారా దేవాదుల ఎత్తిపోతల పథకం కింద 6.21 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని చెప్పారు.

కాంగ్రెస్‌ హయాంలో గోదావరి ఎడారిగా మారిందని, ఎస్సారెస్పీ కాల్వలను నింపడానికి ఆ పార్టీకి 40 ఏళ్లు పట్టిందని, అదే టీఆర్‌ఎస్‌ సర్కారు మూడేళ్లలోనే పూర్తి చేసి సత్తా చాటిందని పేర్కొన్నారు. తుపాకులగూడెం బ్యారేజి నిర్మాణానికి ఇప్పటి వరకు రూ.700 కోట్లు ఖర్చు చేశామని, ఇంకా రూ.1,500 కోట్లు వెచ్చించాల్సి ఉందన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంటనగరాల తాగు నీటికి 50 టీఎంసీలు అందిస్తూ 240 మెగావాట్ల హైడ్రో పవర్‌ ఉత్పత్తి కొరకు ప్రతిపాదించినట్లు వివరించారు. బ్యారేజి వద్ద 24 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఎర్త్‌ వర్క్‌కు గాను 17.30 లక్షల క్యూబిక్‌ మీటర్లు, 10.24 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులకు 4.78 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు, 59 రేడియల్‌ గేట్లకు గాను 21 గేట్ల నిర్మాణం పూర్తయిందని ఈ సందర్భంగా ఇంజనీరింగ్‌ చీఫ్‌ (ఈ అండ్‌ సీ) నాగేంద్రరావు మంత్రికి వివరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement