పథకాల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శివకుమార్
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాల్లో భాగంగా రాష్ర్ట ప్రభుత్వం ఏయే రంగానికి ఎంతెంత ఖర్చు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే తమ పాల నలో సంక్షేమానికి చేసిన ఖర్చు ఎంత, అందులో ప్రజలకు ఎంత చేరిందో లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేసింది. బుధవారం పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ మాట్లాడుతూ... ప్రభుత్వం చేపడుతున్న పథకాల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తన కుటుంబ సభ్యులతో సహా ఎవరు అవినీతికి పాల్పడినా చర్యలు తీసుకుంటామని, అందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.
నీటి పారుదల ప్రాజెక్టులు మొదలుకుని చేప పిల్లల పెంపకం వరకు కాదేది అవినీతికి అనర్హం అన్నట్లుగా సాగుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో భారీగా వర్షాలు పడడంతో చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు రూ.49 కోట్లు కేటాయించారని, టెండర్లో ఒక్కో చేప పిల్లకు రూ.1.25 పేర్కొనగా, పార్టీ నాయకుల సహకారంతో దానిని 60-70 పైసలకే టెండర్లు దక్కించుకున్నారని చెప్పారు. అయితే ఒక్కో చెరువులో లక్ష చేప పిల్లలను వదలాల్సి ఉండగా, కేవలం 20 వేలే వదిలి చేతులు దులుపుకున్నారన్నారు. టీఆర్‌ఎస్ చెబుతున్న బంగారు తెలంగాణ ఏమో కాని బిచ్చమెత్తుకునే పరిస్థితి ఎదురుకాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలోని ప్రజా సమస్యలపై పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు.