సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలను ఢిల్లీ తెలుగు అకాడమీ సత్కరించింది. 17వ లోక్‌సభకు ఎన్నికైన ఏపీ, తెలంగాణకు చెందిన సభ్యులతోపాటు రాజ్యసభ సభ్యులకు అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ ఎంపీలు ఒకే వేదిక పంచుకున్నారు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులైన వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, రెడ్డెప్ప, తలారి రంగయ్య, డా.సంజీవ్‌కుమార్, డా.సత్యవతి, దుర్గాప్రసాద్, చంద్రశేఖర్, టీఆర్‌ఎస్ నుంచి లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్ నేత, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీజేపీ నుంచి బండి సంజయ్‌లను ఢిల్లీ తెలుగు అకాడమీ ప్రతినిధులు సత్కరించారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు వారిగా అందరం కలసి రెండు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పార్లమెంటులో ఎంపీలు లేవనెత్తే స్థానిక సమస్యలపై పార్టీలకు అతీతంగా అభినందించడం కొనసాగుతుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల ఎంపీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చినందుకు అకాడమీ సభ్యులను ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అభినందించారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడుతూ.. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఎన్నటికీ ప్రత్యర్థులు కారని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఎంపీలందరూ కలసి కృషి చేద్దామని బీజేపీ ఎంపీ బండి సంజయ్ సూచించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి పీఎస్ నారాయణ, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్‌కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఎంపీలను సత్కరించారు. ప్రోగ్రాం కన్వీనర్ ఆర్.సదానందరెడ్డి, అకాడమీ ప్రధాన కార్యదర్శి నాగరాజు, సభ్యులు చంద్రశేఖర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment