అఖిలపక్ష భేటీలో గళమెత్తిన వైఎస్సార్‌సీపీ నేతలు | Parliament winter session : all-party meeting Begins | Sakshi
Sakshi News home page

అఖిలపక్ష భేటీలో గళమెత్తిన వైఎస్సార్‌సీపీ నేతలు

Published Sun, Nov 17 2019 11:42 AM | Last Updated on Sun, Nov 17 2019 2:58 PM

Parliament winter session : all-party meeting Begins - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సోమవారం నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన ఈ అఖిలపక్ష సమావేశంలో అధికార, ప్రతిపక్ష నేతలతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, పార్టీ లోకసభ పక్ష నేత మిథున్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు తదితరులు హాజరయ్యారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని ఈ సమావేశంలో ప్రభుత్వం ప్రతిపక్షాలను కోరింది. కేంద్రం పౌరసత్వ సవరణ బిల్లును ఈ సమావేశాల్లో పార్లమెంటు ముందుకు తీసుకొచ్చే అవకాశముంది. చొరబాటుదారులు ఏరివేత లక్ష్యంగా దేశమంతా ఎన్నార్సీ అమల్లోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ఈ భేటీలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నేతలు ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలుకోసం గళమత్తారు.

అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన అంశాలివే..

  • విభజన చట్టంలో ప్రతిపాదించినట్టుగా ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి.
  • పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సంబంధించిన నిధుల బకాయిలను కేంద్రం విడుదల చేయాలి. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి సవరించిన అంచనా వ్యయానికి వెంటనే ఆమోదం తెలపాలి.
  • రూ. 18,969 కోట్ల రెవెన్యూ లోటును భర్తీ చేస్తూ ఆ మేరకు ఏపీకి నిధులు విడుదల చేయాలి.
  • రాష్ట్రంలో ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం రూ. 700 కోట్ల గ్రాంట్‌ను తక్షణమే విడుదల చేయాలి.
  • ఆంధ్రప్రదేశ్‌కు ఏడు మెడికల్‌ కాలేజీలను మంజూరు చేయాలి.
  • రామాయపట్నంలో మేజర్‌ పోర్టును నిర్మించాలి.
  • గిరిజన ప్రాంతమైన విజయనగరం జిల్లా సాలూరులో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటుకు అనుమతించాలి.
  • గోదావరి - కృష్ణా నదుల అనుసంధాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించి కేంద్రమే చేపట్టాలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement