V vijayasaireddy
-
ఆదాయ పన్ను తగ్గించాలని ప్రధాని మోదీకి విజయసాయిరెడ్డి విజ్ఞప్తి
సాక్షి, తాడేపల్లి: పది లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఆదాయపన్ను తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ‘ఎక్స్’ వేదికగా ప్రధనికి విజ్ఞప్తి చేశారు. ‘దేశంలోని గ్రామీణ/అర్బన్ ప్రాంతాల్లో ఉంటూ ఏడాదికి రూ.10 లక్షలలోపు సంపాదించే వారికి ఆదాయపు పన్ను తగ్గించాల్సిన అవసరం ఉంది. వారి ఆదాయపన్ను తగ్గించాలని ప్రధాని మోదీని అభ్యర్థిస్తున్నా. ద్రవ్యోల్బణం కారణంగా ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతిని ప్రోత్సహించేందుకు పన్ను తగ్గిచండి. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు మేలు చేకూరేలా నిర్ణయం తీసుకోండి’ అని విజయసాయిరెడ్డి అన్నారు.There is an imminent need to reduce Income Tax for those earning under ₹10lakh per year which would boost demand, especially in rural/semi-urban India. I request Hon’ble FM @nsitharaman ji to incentivize our salaried middle class that is reeling under pressure due to inflation.— Vijayasai Reddy V (@VSReddy_MP) June 19, 2024 -
సోషల్ మీడియా కార్యకర్తలకు గుర్తింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా కార్యకర్తలు కీలక పాత్ర పోషించారని, వారికి తగిన గుర్తింపు ఇచ్చి, ప్రోత్సహిస్తామని ఆ పార్టీ అనుబంధ విభాగాల ఇన్చార్జ్, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి చెప్పారు. కొంత మంది సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకుంటామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల 2024లోనూ వైఎస్సార్సీపీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యకర్తలతో దాదాపు మూడు గంటలపాటు సమావేశమై వారి అభిప్రాయాలను సావధానంగా విన్నారు. అనంతరం మాట్లాడుతూ.. పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ తనను ఆదేశించారన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలు ఏ విధంగా పార్టీకి సేవకులో.. తానూ అదే విధంగా పార్టీకి సేవకుడినేనని స్పష్టం చేశారు. వారు లేవనెత్తిన అంశాలను పరిష్కరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఇంకా ఏమన్నారంటే.. ప్రతి మండలానికి ఇన్చార్జ్ ► రాష్ట్రంలో ప్రభుత్వం మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి మండలానికి, నియోజకవర్గానికి, పార్ల్లమెంట్ నియోజకవర్గానికి సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌ను నియమిస్తాం. ► జూలై 8న వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తాం. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయి కమిటీలను పునఃనిర్మాణం చేస్తాం. ప్రతిపక్షంలో ఉండగా పార్టీ సభ్యత్వ నమోదు సాధారణ స్థాయిలో జరిగింది. ఇప్పుడు ఇతర పార్టీల కంటే అత్యధికంగా సభ్యత్వ నమోదు చేయాలి. ► పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలు చురుగ్గా వ్యవహరించి, టీడీపీ అన్యాయాలను, చంద్రబాబు దురాగతాలను ఎప్పటికప్పుడు ఎండగట్టి పార్టీని ప్రజలకు చేరువ చేశారు. వీరి కోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందిస్తాం. పార్టీ కార్యకర్తల తరహాలోనే సోషల్ మీడియా కార్యకర్తలకు సభ్యత్వ కార్డులు ఇస్తాం. ప్రతిపక్షాలు మాత్రమే టార్గెట్ ► సోషల్ మీడియా కార్యకర్తలు కోరినట్లుగా సభ్యత్వం తీసుకున్న వారికి బీమా కల్పించే అంశంపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను టార్గెట్ చేయాలే కానీ ఎగ్జిక్యూటివ్స్‌ను, జ్యూడిషియరీని టచ్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలపై ఎవ్వరూ కేసులు పెట్టే అవకాశం ఉండదు. ► ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోరాటం సాగించాలి. వ్యక్తిగత దూషణలు అవసరం లేదు. ఇకపై కార్యకర్తలకు మరింత సమయం కేటాయిస్తాం. పార్టీ కార్యాలయంలో హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేస్తాం. కార్యకర్తలకు ఏ సహాయం కావాలన్నా చేస్తాం. ► ఈ సమావేశానికి సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పాల్గొన్నారు. -
‘వైఎస్సార్ కప్’ మెగా క్రికెట్ సంరంభం
దొండపర్తి (విశాఖ దక్షిణ): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ‘వైఎస్సార్ కప్’ పేరిట నిర్వహిస్తున్న మెగా క్రికెట్ టోర్నమెంట్ సోమవారం సాయంత్రం ప్రారంభమైంది. ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోర్టు స్టేడియంలో ఎంపీ వి.విజయసాయిరెడ్డి టార్చ్ వెలిగించి టోర్నీని ప్రారంభించారు. ఈ నెల 22నుంచి జనవరి 9వ తేదీ వరకు నిర్వహించే టోర్నమెంట్లో విశాఖ నగర పరిధిలోని 98 వార్డుల నుంచి 422 క్రికెట్ జట్లు తలపడుతున్నాయి. విజేతలకు రూ.50 లక్షలు విలువ చేసే బహుమతులను అందజేయనున్నారు. ప్రారంభ కార్యక్రమానికి అన్ని జట్ల నుంచి 6,500 మంది ఆటగాళ్లు హాజరవడంతో మైదాన ప్రాంగణం కోలాహలంగా మారింది. ఎన్సీసీ క్యాడెట్స్ మార్చ్ఫాస్ట్, ఏయూ విద్యార్థినుల నృత్య ప్రదర్శన అలరించాయి. మార్చ్ఫాస్ట్లో పాల్గొన్న క్రీడాకారులు విశాఖ అంటే సీఎంకు అమితమైన ప్రేమ ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. విశాఖ అంటే సీఎం వైఎస్ జగన్‌కు అమితమైన ప్రేమ అన్నారు. సామాజిక శాస్త్రవేత్తగా, ఆర్థిక నిపుణుడిగా సీఎంను అభివర్ణించారు. చిత్తశుద్ధి, స్థిరచిత్తంతో ఓ వైపు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే.. మరోవైపు రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని సంకల్పించారన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కె.కన్నబాబు మాట్లాడుతూ.. పరిపాలనా రాజధాని విశాఖను అన్ని రంగాలతోపాటు క్రీడా రంగంలోనూ అభివృద్ధి పథంలో నడిపించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. యువత విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించేలా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. -
మార్చి నాటికి కడప విమానాశ్రయం విస్తరణ పనులు పూర్తి
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఏడాది మార్చి నాటికి కడప విమానాశ్రయం విస్తరణ పనులు పూర్తవుతాయని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ కడప విమానాశ్రయంలో ప్రస్తుతం ఉన్న రన్‌వే, టాక్సీ వే, ఆప్రాన్ వంటి విస్తరణ పనులు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 94 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2017లో కడప ఎయిర్పోర్ట్ విస్తరణ పనులు ప్రారంభించినట్టు ఆయన చెప్పారు. రూ .4860 కోట్ల పీఎఫ్ చెల్లింపులు కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సంస్థలు, సిబ్బందిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని కార్మిక శాఖ సహాయమంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. కరోనాతో సమస్యలు ఎదురైన సంస్ధలు, ఉద్యోగులకు ఆసరాగా ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) చెల్లింపుల్లో ఊరట కలిగించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్ట్ వరకూ రూ 4860 కోట్లు చెల్లించిందని ఆయన వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయిరెడ్డి ప్రశ్నకు బదులిస్తూ మంత్రి ఈ వివరాలు తెలిపారు. 100 మంది లోపు ఉద్యోగులు ఉండి, వారిలో 90 శాతం సిబ్బంది 15,000లోపు వేతనం ఉన్న సంస్ధల్లో ఉద్యోగి, యజమాని పీఎఫ్ వాటాను తొలుత మూడు నెలల పాటు ప్రభుత్వమే చెల్లించిందని లిఖితపూర్వక సమాధానంలో మంత్రి పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ పథకాన్ని మరో మూడు నెలలు పొడిగించినట్టు వెల్లడించారు. ఈ పథకం పొడిగింపుపై వస్తున్న డిమాండ్లను ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇక దేశ వ్యాప్తంగా అమలు చేసిన ఈ పథకంతో సెప్టెంబర్ 16 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 11,196 సంస్థలు, ఒక లక్షా 92 వేల 431 మంది ఉద్యోగులకు మేలు చేకూరిందని మంత్రి తెలిపారు. చదవండి : అంతర్వేది ఘటన వెనుక చంద్రబాబు హస్తం.. విదేశీ విద్యా రుణ పథకానికి రూ. 19 కోట్లు మంజూరు వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్ధుల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం డాక్టర్ అంబేడ్కర్ పేరిట వడ్డీ రాయితీతో కూడిన విదేశీ విద్యా రుణాలను సమకూర్చే పథకానికి శ్రీకారం చుట్టినట్లు సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి శ్రీ కృష్ణపాల్ గుర్జర్ వెల్లడించారు. -
అంతర్వేది ఘటన వెనుక చంద్రబాబు హస్తం..
సాక్షి, విశాఖపట్నం: అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం దగ్ధమైన ఘటన వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరుల హస్తం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ప్రవాస అంద్రుడిలా హైదరాబాద్‌లో ఉంటూ రాష్ట్రంలో అలజడి సృష్టించాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరామని, త్వరలోనే చినబాబు, పెదబాబు హస్తం బయటపడుతుందంటూ చంద్రబాబు, నారా లోకేశ్‌లను ఉద్దేశించి విమర్శించారు. అంతర్వేదిలో గలాటా సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగాయని ప్రచారం చేయాలనుకున్నారని మండిపడ్డారు. ఈ ఘటనలో గుంటూరు, హైదరాబాద్ వ్యక్తుల ప్రమేయాన్ని పోలీసులు గుర్తించారని తెలిపారు. స్థానికంగా శుక్రవారం జరిగిన‘మన ఆరోగ్యం మన చేతుల్లోనే’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటనతో ఇక్కడి భూములకు ధరలు పెరిగాయన్నారు. భూ ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి ఘటనల్లో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.(చదవండి: అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తు) మతాల పేరిట విధ్వంసం: మంత్రి అవంతి అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు సీఎం ఆదేశించడం సంతోషకరమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో మతాల పేరిట విధ్వంసం సృష్టించే యత్నం కొన్ని పార్టీలు చేస్తున్నాయని ఆరోపించారు. రాజధాని అంశం రాష్ట్రాల పరిధిలోనే ఉందని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. చంద్రబాబు ట్రాప్‌లో పడి పవన్ కళ్యాణ్ అమరావతిపై ప్రేమ కనబరుస్తున్నారని అన్నారు. 13 జిల్లాల ప్రజలు కలిసి ఉండాలన్న ఉద్దేశంతోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు ప్రతిపాదన చేసినట్టు చెప్పారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతూ జూమ్ ద్వారా ప్రజలలో చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. కాగా ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, విశాఖ ఎంపీ ఎన్వీవి సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీ సత్యవతి, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, అదీప్ రాజు, తిప్పల నాగిరెడ్డి, అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, నార్త్ కన్వీనర్ కేకే రాజు, నగర కన్వీనర్ వంశీ కృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తదితరులు పాల్గొన్నారు. -
‘కుటుంబానికో గుడ్డు కూడా రాదు కదా బాబూ’
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉద్యోగం చేసుకుంటూ తన మానాన తను బతుకున్న మత్తు డాక్టర్ సుధాకర్‌ను టీడీపీ నాయకులు రోడ్డున పడేశారని విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన వరస ట్వీట్లు చేశారు. (చదవండి : అదంతా చంద్రబాబు ఆడించిన నాటకమే!) ‘ఉద్యోగం చేసుకుంటూ తన మానాన తను బతుకుతున్న మత్తు డాక్టర్ ను పచ్చపార్టీ వాళ్లు రోడ్డున పడేశారు. సస్పెండ్ అయ్యేదాక రెచ్చగొట్టారు. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటే పోలీసులు మెంటల్ హాస్పిటల్ కు తరలించారు. యాక్యూట్ అండ్ ట్రాన్సియెంట్ సైకోసిస్ వచ్చిందని సైకియాట్రిస్టులు తేల్చారు’ అని ట్వీట్ చేశారు. ‘కరోనాపై పోరుకు చంద్రబాబు ఇచ్చిన 10 లక్షల విరాళాన్ని ఐదు కోట్ల మందికి పంచితే, తలకు రెండు పైసలు వస్తాయని నెటిజెన్లు లెక్క తేల్చారు. కుటుంబానికో కోడి గుడ్డు కూడా రాదు కదా బాబూ. ఈ మాట ఎవరైనా అడిగితే, ఓడించిన ప్రజలకు సంపాదనంతా ఇచ్చి లోకేశాన్ని రోడ్డున పడేయాలా అని ప్రశ్నిస్తాడేమో!’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ‘కరోనాతో ప్రజలు టెన్షన్ పడుతుంటే నీరో చక్రవర్తిలా ఫిడేల్ వాయిస్తున్నాడు చంద్రబాబు. ఎదుటి వారి దురదృష్టాన్ని చాటుగా గమనిస్తూ ఆనందించే వారిని సైకాలజీలో శాదన్ ఫ్రాయిడా (schadenfreude) అనే రుగ్మతకు గురైన వారిగా భావిస్తారు. బాబుది ఆ కేసే!’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. -
టీడీపీ అడ్డా నుంచే నిమ్మగడ్డ లేఖ?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి పంపించినట్లుగా చెబుతున్న లేఖ ఎక్కడ తయారైందనే అంశంపై సీఐడీ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నట్లుగానే ఆ లేఖ టీడీపీ అడ్డా నుంచే నిమ్మగడ్డకు చేరిందనే అనుమానాలు బలపడుతున్నాయి. నిమ్మగడ్డ లేఖపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ వి.విజయసాయిరెడ్డి డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఈనెల 14న ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. కేంద్రానికి రాసినట్లుగా చెబుతున్న లేఖకు సంబంధించిన అన్ని ఆధారాలను ధ్వంసం చేసినట్లు నిమ్మగడ్డ వద్ద సహాయ కార్యదర్శిగా పనిచేసిన కె.సాంబమూర్తి సీఐడీ అధికారుల వద్ద అంగీకరించారు. మొదట ల్యాప్‌టాప్‌లో లేఖ తయారు చేసి పెన్‌డ్రైవ్ ద్వారా డెస్క్‌టాప్‌లో వేసినట్లు చెప్పిన సాంబమూర్తి వాట్సాప్ వెబ్ ద్వారా నిమ్మగడ్డకు పంపినట్టు వెల్లడించారు. ఆ లేఖను రమేష్‌కుమార్ మొబైల్ నుంచి కేంద్రానికి పంపినట్లు సాంబమూర్తి సీఐడీకి తెలిపారు. అయితే ల్యాప్‌టాప్‌లో ఫైల్స్ డిలీట్ చేయడం, పెన్ డ్రైవ్ ధ్వంసం కావడంతోపాటు డెస్క్ టాప్‌ను రెండు మూడు పర్యాయాలు ఫార్మాట్ చేసినట్లు నిర్ధారణ అయింది. దీనికితోడు కేంద్రానికి నిమ్మగడ్డ రాసిన లేఖ రిఫరెన్స్ నెంబర్ 221తోనే టీడీపీ ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు రాసిన లేఖ కూడా ఉండటం గమనార్హం. సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ వెల్లడించిన వివరాలు ఇవీ.. ► రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన 10–15 నిమిషాల్లోనే అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ కేంద్రానికి లేఖ రాశారు. ► నిమ్మగడ్డ లేఖపై వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ విచారణ చేపట్టి కె.సాంబమూర్తిని విచారించాం. ఆయన ఇచ్చిన వాగ్మూలం మేరకు మార్చి 18న నిమ్మగడ్డ కేంద్రానికి లేఖ రాశారు. దీనికి ఒకరోజు ముందే కేంద్ర హోంశాఖ చిరునామా, మెయిల్ వివరాలను నిమ్మగడ్డ తీసుకున్నట్లు విచారణలో సాంబమూర్తి చెప్పారు. కానీ సాంబమూర్తి కథనానికి, జరిగిన దానికి చాలా విరుద్ధ్దమైన అంశాలున్నాయి. ► సుప్రీం కోర్టు తీర్పు రాగానే నిమ్మగడ్డ అప్పటికే రాసుకున్న డ్రాప్ట్‌ను తెచ్చి డిక్టేట్ చేస్తే తాను లాప్టాప్లో టైప్ చేసి పెన్‌డ్రైవ్ ద్వారా తీసుకుని డెస్క్ట్యాప్కు కనెక్ట్ చేసి ప్రింటౌట్ తీసుకున్నట్లు సాంబమూర్తి చెప్పారు. దీనిపై నిమ్మగడ్డ సంతకం తీసుకుని డెస్క్‌టాప్‌కు ఉన్న స్కానర్‌తో స్కాన్ చేసి వెబ్ వాట్సాప్ ద్వారా తిరిగి నిమ్మగడ్డ మొబైల్‌కు పంపించినట్లు సాంబమూర్తి పేర్కొన్నాడు. నిమ్మగడ్డ తన మొబైల్ నుంచి వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని కేంద్ర హోంశాఖకు మెయిల్ ద్వారా పంపించి ఉంటారన్నది సాంబమూర్తి వాంగ్మూలం. ► ల్యాప్‌టాప్‌లో లెటర్‌ను డిలీట్ చేసినట్లు సాంబమూర్తి చెప్పాడు. డెస్క్టాప్ను రెండు మూడుసార్లు ఫార్మాట్ చేసి మళ్లీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను లోడ్ చేశారు. పెన్‌డ్రైవ్‌ను ధ్వంసం చేశారు. ► ఇది నిజంగా సాధారణ ప్రక్రియలో భాగంగా జరిగిన కమ్యూనికేషన్ అనుకుంటే ఈ ఆధారాలను «ఇంత హడావుడిగా ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమిటి? అన్న ప్రశ్నకు సాంబమూర్తి సమాధానం చెప్పడం లేదు. ఆ లేఖ బయట నుంచి వచ్చిందా? ల్యాప్‌టాప్ ద్వారా మార్పులు చేసుకుని డౌన్లోడ్ చేసి నిమ్మగడ్డకు ఇచ్చారా? ఇలా పలు ప్రశ్నలకు సాంబమూర్తి సరైన జవాబు చెప్పట్లేదు. సమాధానాలు రావడంలేదు. లేఖ బయట నుంచి వచ్చిందా? మీరే తయారు చేశారా? అంటే సహేతుకమైన సమాధానం రాలేదు. ► సాక్ష్యాలను (ఎవిడెన్స్) ట్యాంపర్ చేయడాన్ని గమనిస్తే కచ్చితంగా ఏదో జరిగింది. అనుమానించదగ్గ విషయం ఏదో ఉంది. లేదంటే ఆధారాలను ధ్వంసం చేయరు. ► నిమ్మగడ్డ కేంద్రానికి రాసిన లేఖ నెంబర్ 221. టీడీపీ ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు రాసిన లెటర్‌కు 221 నెంబర్ ఇచ్చారు. ఒకే నెంబర్‌తో రెండు కమ్యూనికేషన్లు జరిగినట్లు గుర్తించాం. ► ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లను సైబర్ ఫోరెన్సిక్ పద్దతుల్లో రిస్టోర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఫార్మాట్ చేసిన హార్డ్ డిస్క్‌ను కూడా ఫోరెన్సిక్ టూల్స్ ద్వారా పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. దీన్ని బట్టి అసలు ఆ లేఖ ఎక్కడ నుంచి వచ్చింది? అనే విషయాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సీఐడీ దర్యాప్తులో తేలాల్సింది... ► హోంశాఖకు రాసిన లేఖ రహస్యం అనుకుంటే దాన్ని మాత్రమే డిలీట్ చేయాలి కానీ ల్యాప్‌టాప్, డెస్క్టాప్ను ఫార్మాట్ చేయాల్సిన అవసరం ఏమిటి? ► హోంశాఖకు నిమ్మగడ్డ రాసిన లేఖ రహస్యమే అయితే టీడీపీ కార్యాలయంలోని మీడియా ప్రతినిధుల చేతికి ఎలా వచ్చింది? జన సామాన్యంలోకి లేఖ ఎలా వచ్చింది? -
అఖిలపక్ష భేటీలో గళమెత్తిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన ఈ అఖిలపక్ష సమావేశంలో అధికార, ప్రతిపక్ష నేతలతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, పార్టీ లోకసభ పక్ష నేత మిథున్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు తదితరులు హాజరయ్యారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని ఈ సమావేశంలో ప్రభుత్వం ప్రతిపక్షాలను కోరింది. కేంద్రం పౌరసత్వ సవరణ బిల్లును ఈ సమావేశాల్లో పార్లమెంటు ముందుకు తీసుకొచ్చే అవకాశముంది. చొరబాటుదారులు ఏరివేత లక్ష్యంగా దేశమంతా ఎన్నార్సీ అమల్లోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ఈ భేటీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలుకోసం గళమత్తారు. అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన అంశాలివే.. విభజన చట్టంలో ప్రతిపాదించినట్టుగా ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన నిధుల బకాయిలను కేంద్రం విడుదల చేయాలి. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి సవరించిన అంచనా వ్యయానికి వెంటనే ఆమోదం తెలపాలి. రూ. 18,969 కోట్ల రెవెన్యూ లోటును భర్తీ చేస్తూ ఆ మేరకు ఏపీకి నిధులు విడుదల చేయాలి. రాష్ట్రంలో ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం రూ. 700 కోట్ల గ్రాంట్‌ను తక్షణమే విడుదల చేయాలి. ఆంధ్రప్రదేశ్‌కు ఏడు మెడికల్ కాలేజీలను మంజూరు చేయాలి. రామాయపట్నంలో మేజర్ పోర్టును నిర్మించాలి. గిరిజన ప్రాంతమైన విజయనగరం జిల్లా సాలూరులో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటుకు అనుమతించాలి. గోదావరి - కృష్ణా నదుల అనుసంధాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించి కేంద్రమే చేపట్టాలి -
‘ఆ విషయంలో చంద్రబాబు ప్లాన్ బెడిసికొట్టింది’
సాక్షి, అమరావతి : ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేత ఘటనను వివాదాస్పదం చేసి సానుభూతి పొందాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన ముఠా వేసిన ఎత్తుగడ వేశారని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. అయితే ఆ విషయంలో చంద్రబాబు ప్లాన్ బెడిసికొట్టిందని వ్యాఖ్యానించారు. కేవలం రేకుల షెడ్డుకు రూ.9 కోట్లు ఎలా ఖర్చు అయిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. రాజధాని వ్యవహారాల్లో ఇంకా ఎంత అవినీతి జరిగిందో అని ప్రజల్లో చర్చ మొదలయిందని విజయసాయిరెడ్డి ట్విటర్లో పేర్కొన్నారు. యుద్ధం ఎప్పుడు చేయాలో సీఎం జగన్‌కు బాగా తెలుసు చంద్రబాబునాయుడు కేసీఆర్ తో ఘర్షణ వైఖరిని అవలంభించినంత మాత్రాన సీఎం జగన్ కూడా అదే పని చేయాలా? అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. నిన్న టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ, ఎప్పుడు యుద్ధం చేయాలో తమ సీఎంకు తెలుసునని అన్నారు. ‘ మీ అధినేత బీజేపీని సమర్థిస్తే అందరూ జై కొట్టాలి. యూటర్న్ తీసుకుని కాంగ్రెస్ గుంపులో చేరితో గొప్ప నిర్ణయం అనాలి. మీరు తెలంగాణ సీఎంతో ఘర్షణ వైఖరి అవలంభిస్తే మేమూ అలాగే ఉండాలా?, యుద్దం ఎప్పుడు చేయాలో, సామరస్యంగా ఎప్పుడు మెలగాలో సీఎం వైఎస్ జగన్‌కు బాగా తెలుసు’ అని విజయసాయిరెడ్డి ట్విటర్లో పేర్కొన్నారు. చంద్రబాబు సమస్యే ప్రజాసమస్యా? టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారంటే ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి విలువైన సూచనలు ఇస్తారనుకున్నాం కానీ ఆయన ఆయన అద్దె ఇంటికి నోటీసులు ఇవ్వడం, నారావారిపల్లెలోని భవనానికి కాపలా తగ్గిండంపై తీర్మానాలు చేయడం విడ్డూరంగా ఉందని విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు సమస్యలే ప్రజా సమస్యలా అని ప్రశించారు. మాజీ మంత్రి దేవినేని ఉమను విమర్శిస్తూ..‘ బహుదా-వంశధార-నాగావళి లింక్ పనులను ఐదేళ్లలో మీరెందుకు పూర్తి చేయలేక పోయారు ఉమా?, వనరుల దోపిడీకి తప్ప ఉత్తరాంధ్రను మీరు పట్టించుకున్నదెపుడు? ఏటా వృథాగా సముద్రంలో కలుస్తున్న 3,500 టిఎంసీల గోదావరి నీటితో ప్రతి ఎకరాకు జలాభిషేకం చేస్తారు సీఎం జగన్ ’ అని అన్నారు. -
రాజ్యసభ ముందుకు రైల్వే ప్రయాణీకుల సమస్యలు
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే ప్రయాణీకుల సమస్యలను వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత వి. విజయసాయిరెడ్డి గురువారం రాజ్యసభ జీరో అవర్‌లో ప్రస్తావించారు. రైళ్లలో అపరిశుభ్రమైన దుప్పట్లు సరఫరా చేస్తున్నారని, ఏసీ సరిగా ఉండటం లేదని ప్రయాణీకుల నుంచి వస్తున్న ఫిర్యాదులను సభ దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీ ఎక్స్‌ప్రెస్, కోరమాండల్ సమత, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో సరైన ఏసీ సదుపాయ ఉండటం లేదని, అపరిశుభ్రమైన బెడ్ రోల్స్ సరఫరా చేస్తున్నారని చెప్పారు. రైళ్లలో శుభ్రతతో కూడిన దుప్పట్లు సరఫరా చేయడంతో పాటు అంతరాయం లేని ఏసీని అందుబాటులోకి తేవాలని కోరారు. రైళ్లలో కనీస సదుపాయాలను పరిశుభ్రంగా ప్రయాణీకులకు అందించాలని, ఈ విషయంలో రైల్వే శాఖ మంత్రి జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరారు. -
‘బాబు దుబారాకు ప్రజావేదిక ఓ నమూనా’
సాక్షి, అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజావేదిక పేరుతో ప్రజాధనాన్ని దుబారా చేసిన తీరును వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి ఎండగట్టారు. కోటి రూపాయలు ఖర్చేయ్యే ప్రజావేదిక తాత్కాలిక నిర్మాణానికి రూ. 9 కోట్లు వెచ్చించినట్టు చూపడంపై విస్మయం వ్యక్తం చేశారు. ప్రజా వేదిక అనే రేకుల షెడ్డు నిర్మాణంలో సిమెంటు కంటే సినిమా సెట్టింగ్‌ల్లో వాడే ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌నే ఎక్కువగా వాడినట్టు కనిపిస్తోందని ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబు హయాంలో జరిగిన నిర్మాణాలన్నీ ఇలానే ఉంటాయని, ఇది అందుకు ఓ చిన్న నమూనానే అన్నారు. ఇక ప్రజావేదిక షెడ్డు కూల్చివేతను చూసేందుకు వచ్చిన ప్రజలకు ఉన్న అవగాహన కూడా టీడీపీ నేతలకు లేకపోవడం దురదృష్టకరమని దుయ్యబట్టారు. రైతుల నుంచి సేకరించిన 33 వేల ఎకరాల్లోనే ప్రజావేదికను నిర్మించి ఉంటే ఇవాళ పెద్దమొత్తంలో ప్రజాధనం వృధా అయ్యేది కాదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. (చదవండి: భారీ భద్రత నడుమ కొనసాగుతున్న ప్రజావేదిక తొలగింపు) -
‘నీటి సంక్షోభానికి అదే ప్రధాన కారణం’
సాక్షి, న్యూఢిల్లీ : నదుల అనుసంధానంతోనే నీటి సంక్షోభాన్ని పరిష్కరించగలమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. దేశంలో తాగునీరు, సాగునీరు సంక్షోభం - సవాళ్లు అనే అంశంపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో విజయసాయి రెడ్డి మాట్లాడారు. రుతుపవనాల వైఫల్యమే నీటి సంక్షోభానికి ప్రధాన కారణమన్నారు. అంతరించి పోతున్న అడవులు మరో కారణమని తెలిపారు. నదుల అనుసంధానమే నీటి సంక్షోభానికి సరైన పరిష్కారం అన్నారు. కేంద్రం ప్రతిపాదించిన నదుల అనుసంధానంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి - పెన్నా నదుల అనుసంధానం తక్షణమే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఏపీలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌కు కేంద్రం రెడీ, కానీ..
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఆంధ్ర ప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కేంద్రంగా సిద్ధంగా ఉంది. అయితే రాయితీ ధరలకు నీరు, విద్యుత్తు వంటి ప్రోత్సాహకాలతోపాటు సుమారు రూ. 5 వేల కోట్ల వరకు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) సమకూర్చడంతోపాటు అవసరమైన అనుమతులు పొందడంలో సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే ఈ ప్రాజెక్ట్ సాకారమవుతుంది’ అని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వక జవాబు ఇస్తూ ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన హామీ ప్రకారం ఏడాదికి 1.7 మిలియన్ టన్నుల ఉత్పాదక శక్తి గల పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌పై 2017లోనే డీపీఆర్‌ను సిద్ధం చేసినట్లు చెప్పారు. తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆర్థిక మదింపు అధ్యయనం కూడా పూర్తయిందన్నారు. ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 32 వేల 901 కోట్లు అవుతుందని మంత్రి తెలిపారు. రిఫైనరీ, పెట్రోకెమికల్ ప్రాజెక్ట్‌కు భారీ పెట్టుబడులు అవసరమని తెలిపారు. గతంలో ఇలాంటి ప్రాజెక్ట్‌లకు ఆయా రాష్ట్రాలే నీరు, విద్యుత్‌పై రాయితీలు ఇచ్చేవని చెప్పారు. చట్టంపరంగా పొందాల్సిన అనుమతులు రాబట్టడంలో సహకరించేవని, అలాగే వయబులిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్)ను కూడా సమకూర్చేవని మంత్రి తెలిపారు. ఈ అంశాలపై గతంలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించినట్లు చెప్పారు. ‘ఈ తరహా భారీ ప్రాజెక్ట్ ఏర్పాటుతో పారిశ్రామికంగా రాష్ట్రం ముందడుగు వేస్తుంది. రాష్ట్ర ఆర్థిక రంగంపై ప్రత్యక్షంగాను, పరోక్షంగాను దీని ప్రభావం గణనీయంగా ఉంటుంది. పారిశ్రామీకీకరణ వేగవంతం కావడంతో ప్రజల ఆదాయ వనరులు పుష్కలంగా పెరుగుతాయి. ఉపాధి అవకాశాలు దండిగా లభిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది’ అని మంత్రి వివరించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయం తీసుకుంటే రిఫైనరీ, పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. -
బీసీ క్రీమీ లేయర్‌పై నిపుణుల కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ : సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన వర్గాలలో క్రీమీ లేయర్ నిర్ధారణకు సంబంధించి ఉత్పన్నమవుతున్న సమస్యల పరిశీలన కోసం ఈ ఏడాది మార్చి 8న మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారి బీపీ శర్మ అధ్యక్షతన ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించినట్లు సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి బుధవారం రాజ్య సభకు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. నిపుణుల సంఘం విధి విధానల గురించి మంత్రి తన జవాబులో వివరిస్తూ వెనుకబడిన తరగతులలో క్రీమీ లేయర్ (ఆర్థికస్థితి మెరుగ్గా ఉన్నవారు) నిర్ధారణ కోసం గతంలో నియమించిన ప్రసాద్ కమిటీ అనుసరించిన ప్రాతిపదికను లోతుగా పరిశీలిస్తుందని చెప్పారు. ఇందిరా సహానీ కేసులో సుప్రీం కోర్టు వెల్లడించిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని క్రీమీ లేయర్ విధానాన్ని సరళతరం, క్రమబద్ధీకరించే దిశగా తగిన సిఫార్సులు చేయడం శర్మ కమిటీకి నిర్దేశించిన విధి విధానాలలో ఒకటని మంత్రి చెప్పారు. అలాగే కేటగిరీ 2 సీ కింద ప్రభుత్వ రంగ సంస్థలలో బీసీలకు ఉద్యోగ ఖాళీల సంఖ్యను నిర్ధారించడానికి కూడా తగిన సిఫార్సులను ఈ నిపుణుల కమిటీ చేస్తుందని చెప్పారు. క్రీమీ లేయర్‌కు సంబంధించి సివిల్ సర్వీసెస్ అభ్యర్ధులు దాఖలు చేసిన అపరిష్కృత కేసులను శర్మ కమిటీ పరిశీలిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం బీసీ సర్టిఫికెట్ సమర్పించిన అభ్యర్ధులలో క్రీమీ లేయర్ వారిని గుర్తించి తొలగించడానికి అనుసరించవలసిన ఆచరణ సాధ్యమైన విధానాన్ని ఈ కమిటీ రూపొందిస్తుందని మంత్రి చెప్పారు. 2017 సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరైన బీసీ అభ్యర్ధుల సర్టిఫికెట్లను యూపీపీఎస్సీ తిరస్కరించిన నేపథ్యంలో తిరస్కరణకు గురైన ప్రతి కేసుపై ఆయా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన మీదట ఈ కమిటీ నిర్దిష్టమైన సిఫార్సు చేస్తుందని మంత్రి వివరించారు. -
తెల్లకాగితం మీద అగ్రిమెంట్ రాసుకోవడమేంటో?
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా మరోసారి టీవీ9 రవిప్రకాశ్, టాలీవుడ్ నటుడు శివాజీ విమర్శనాస్త్రాలు సంధించారు. రవిప్రకాశ్ తనకు టీవీ9 షేర్లు అమ్మి బదిలీ చేయడం లేదని కంపెనీస్ లా ట్రిబ్యునల్‌కు శివాజీ ఫిర్యాదు చేసింది నిజమైతే.. చీటింగ్ కేసుగా పరిగణించి ఆ ఫిర్యాదుపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ‘ రవి ప్రకాశ్ తనకు టీవీ9 షేర్లు అమ్మి బదిలీ చేయడం లేదని గరుడ పురాణం శొంటినేని శివాజీ కంపెనీస్ లా ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశాడంటున్నారు. ఇది చీటింగ్ కేసు అవుతుంది. ట్రిబ్యునల్ ఆ ఫిర్యాదుపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి. అయినా తెల్ల కాగితం మీద షేర్ల అమ్మకం అగ్రిమెంట్ రాసుకోవడమేంటో?’ అని విజయసాయి రెడ్డి ట్విట్ చేశారు. వాళ్ల కోసం బాబు నానా తంటాలు పడుతున్నారు ప్రజలంతా మనవైపే.. విజయం మనదే అంటూ ఢీలా పడ్డ నేతలను గాలికొట్టి లేపడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నానా తంటాలు పడుతున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. టీడీపీ నేతలకు ధైర్యాన్ని నూరిపోస్తునే మరోవైపు తన కోటరీలో ఉన్న కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను చకచక క్లియర్ చేయించుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఈ నెల 23న( ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు) రిటర్న్ టికెట్ బుక్ చేసుకొని..తమ్ముళ్లకు మాత్రం ధైర్యం నూరిపోస్తున్నారని ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు. -
టీడీపీ పక్షపాతి.. ఏపీ డీజీపీని బదిలీ చేయండి!
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోని రాష్ట్రంలోని పోలీసు విభాగాన్ని చంద్రబాబునాయుడు సర్కారు విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తుండటం.. టీడీపీకి అనుకూలంగా పోలీసు బాస్ ఆర్పీ ఠాకూర్ సహా బదిలీ అయిన ఇంటెలిజెన్స్ డీజీ, ఇతర ఉన్నతాధికారులు కొమ్ముకాస్తుండటంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాకు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన జరగాల్సిన ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా, సజావుగా జరిగేందుకే కేంద్ర ఎన్నికల సంఘం సత్వరమే చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం టీడీపీకి కొమ్ముకాస్తూ.. అత్యంత పక్షపాతపూరితంగా, అసమర్థంగా వ్యవహరిస్తున్న ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను బదిలీ చేయాలని, టీడీపీకి అనుకూలంగా పనిచేస్తూ.. వైఎస్సార్సీపీ సహా ఇతర ప్రతిపక్ష నేతలను వేధిస్తున్న ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు టీ యోగానంద్, మాధవ్‌రావులను ఇంటెలిజెన్స్ విభాగం ఓఎస్డీలుగా తొలగించాలని, అదేవిధంగా పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో డీజీపీ కార్యాలయం సమన్వయ అధికారిగా పనిచేస్తున్న డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించి.. వేరేచోటకు పంపాలని వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో కోరారు. వైఎస్సార్సీపీ ఫిర్యాదు నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వర్రావును గతంలోనే బదిలీ చేసినప్పటికీ.. ఆయన ఇప్పటికీ పోలీసు విభాగంలో జోక్యం చేసుకుంటూ.. డీజీపీ ఠాకూర్ మద్దతుతో టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, క్షేత్రస్థాయిలో నిఘా వ్యవస్థను టీడీపీకి అనుకూలంగా వాడుకుంటూ.. ఆ నివేదికలను రహస్యంగా సీఎం చంద్రబాబుకు చేరవేస్తున్నారని విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు. ఏబీ వెంకటేశ్వర్రావు పోలీసు వ్యవస్థలో జోక్యం చేసుకోకుండా వెంటనే నిలువరించాలని, కుట్రపూరిత వ్యవహారాలు చేపట్టకుండా.. సెక్రటేరియట్లో రిపోర్ట్ చేయాలని ఆయనను ఆదేశించాలని ఈసీని అభ్యర్థించారు. సీఎం చంద్రబాబు సామాజిక వర్గమైన కమ్మ కులానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్‌లు టీ యోగానంద్, మాధవరావులను రాజకీయ కార్యకలాపాల కోసమే గతంలో వెంకటేశ్వర్రావు ఇంటెలిజెన్స్ ఓఎస్డీలుగా నియమించారని, టీడీపీ అనుకూల అధికారులుగా ముద్రపడిన వారు.. పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగపరుస్తూ.. ఆ పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని, అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసి.. వేధిస్తున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికలు జరగవేమోనన్న నిస్సహాయ పరిస్థితి తమకు కలుగుతోందని అన్నారు. ఇక, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఐపీఎస్ అధికారి ఘట్టమనేని శ్రీనివాస్‌ను పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో డీఐజీ కో ఆర్డినేషన్, లా అండ్ ఆర్డర్‌గా నియమించారని, గతంలో రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు ఎస్పీగా, కర్నూల్ రేంజ్ డీఐజీగా, అనంతపురం రేంజ్ ఇన్చార్జ్గా పనిచేసిన ఆయన టీడీపీ అనుకూల ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లను ఆ ప్రాంతంలో నియమించారని, పోలీసు వ్యవస్థను టీడీపీకి రాజకీయంగా అనుకూలంగా మలిచినందుకే ఆయనకు ముఖ్యమంత్రి ప్రమోషన్ ఇచ్చారని, ఇప్పుడు ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసేందుకు ఆయన పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారని విజయసాయిరెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్‌తోపాటు డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ను బదిలీ చేయాలని, ఇంటెలిజెన్స్ ఓస్డీలుగా ఉన్న ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు టీ యోగానంద్, మాధవరావులను ఆ పదవుల నుంచి వెంటనే తొలగించాలని ఆయన కోరారు. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థనలు, ఎమర్జెన్సీ ఫిర్యాదులు స్వీకరించి.. సత్వర్వమే తగిన చర్యలు తీసుకునేందుకు ఎన్నికల సంఘం ప్రధానాధికారి కార్యాలయంలో, డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ లేదా ఎమర్జెన్సీ రెస్పాన్స్ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి జిల్లాలోనూ ఎన్నికల అధికారులు, (కలెక్టర్లు), ఎస్పీల సంయుక్త నేృతృత్వంలో ఇదేవిధంగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. పోలింగ్‌కు మిగిలిన ఉన్న రెండురోజులు.. పోలింగ్ తేదీ నాడు ఎలక్షన్ కంట్రోల్ రూమ్, పోలీసు వ్యవస్థను పర్యవేక్షించేందుకు డీజీపీ కార్యాలయంలో ఎన్నికల పరిశీలకులు నియమించాలని కోరారు. -
జగన్ రిమాండ్ 26 వరకు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 26 వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఐఆర్ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డి రిమాండ్‌ను కూడా ఈనెల 26 వరకు పొడిగించింది. వీరి రిమాండ్ గడువు ముగియడంతో సోమవారం చంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపర్చారు. అలాగే ఇతర చార్జిషీట్లలో నిందితులుగా ఉన్న మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, మన్మోహన్సింగ్, శ్యామూల్, గనుల శాఖ మాజీ డెరైక్టర్ వీడీ రాజగోపాల్, రాంకీ సంస్థల అధినేత అయోధ్యరామిరెడ్డి, దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియా, ఉద్యోగులు సంజయ్ ఎస్.మిత్రా, నీల్‌కమల్‌బేరి, జయ్‌దీప్‌బసు తదితరులు కోర్టు ఎదుట హాజరయ్యారు. నిమ్మగడ్డ ప్రకాష్, ఈశ్వర్ సిమెంట్స్ మాజీ ఎండీ సజ్జల దివాకర్‌రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారులు వెంకట్రామిరెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, ఫార్మా కంపెనీల ప్రతినిధులు హాజరునకు మినహాయింపు కోరుతూ వారి తరఫు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు అనుమతించింది. తదుపరి విచారణను కోర్టు ఈనెల 26కు వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసు నుంచి తమను తొలగించాలని కోరుతూ నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జి పిటిషన్లను కోర్టు మంగళవారం విచారించనుంది.