సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఏడాది మార్చి నాటికి కడప విమానాశ్రయం విస్తరణ పనులు పూర్తవుతాయని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్‌సీపీ సభ్యులు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ కడప విమానాశ్రయంలో ప్రస్తుతం ఉన్న రన్‌వే, టాక్సీ వే, ఆప్రాన్ వంటి విస్తరణ పనులు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 94 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2017లో కడప ఎయిర్‌పోర్ట్ విస్తరణ పనులు ప్రారంభించినట్టు ఆయన చెప్పారు.
రూ .4860 కోట్ల పీఎఫ్ చెల్లింపులు
కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సంస్థలు, సిబ్బందిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని కార్మిక శాఖ సహాయమంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. కరోనాతో సమస్యలు ఎదురైన సంస్ధలు, ఉద్యోగులకు ఆసరాగా ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) చెల్లింపుల్లో ఊరట కలిగించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్ట్ వరకూ రూ 4860 కోట్లు చెల్లించిందని ఆయన వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్‌సీపీ సభ్యులు వి.విజయసాయిరెడ్డి ప్రశ్నకు బదులిస్తూ మంత్రి ఈ వివరాలు తెలిపారు.
100 మంది లోపు ఉద్యోగులు ఉండి, వారిలో 90 శాతం సిబ్బంది 15,000లోపు వేతనం ఉన్న సంస్ధల్లో ఉద్యోగి, యజమాని పీఎఫ్ వాటాను తొలుత మూడు నెలల పాటు ప్రభుత్వమే చెల్లించిందని లిఖితపూర్వక సమాధానంలో మంత్రి పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ పథకాన్ని మరో మూడు నెలలు పొడిగించినట్టు వెల్లడించారు. ఈ పథకం పొడిగింపుపై వస్తున్న డిమాండ్లను ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇక దేశ వ్యాప్తంగా అమలు చేసిన ఈ పథకంతో సెప్టెంబర్ 16 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 11,196 సంస్థలు, ఒక లక్షా 92 వేల 431 మంది ఉద్యోగులకు మేలు చేకూరిందని మంత్రి తెలిపారు. చదవండి : అంతర్వేది ఘటన వెనుక చంద్రబాబు హస్తం..
విదేశీ విద్యా రుణ పథకానికి రూ. 19 కోట్లు మంజూరు
వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్ధుల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం డాక్టర్ అంబేడ్కర్ పేరిట వడ్డీ రాయితీతో కూడిన విదేశీ విద్యా రుణాలను సమకూర్చే పథకానికి శ్రీకారం చుట్టినట్లు సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి శ్రీ కృష్ణపాల్ గుర్జర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment