సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా మిగులు జలాల్లో ఏపీ, తెలంగాణ మధ్య వాటాలను నిర్ధారించే అంశం కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) పరిశీలనలో ఉందని కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు చెప్పారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో 75 శాతం నికర జలాలకు మించి ప్రవహించే మిగులు జలాలను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు నిర్దిష్టమైన విధానం రూపకల్పన బాధ్యతను కేఆర్‌ఎంబీ రివర్ మేనేజ్‌మెంట్ కమిటీకి అప్పగించినట్లు తెలిపారు.
మిగులు జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు నియంత్రిత పద్ధతిలో పంపిణీ చేసేందుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)కు చెందిన సాంకేతిక సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉభయ రాష్ట్రాలు దీనికి సంబంధించి అవసరమైన సమాచారం ఇవ్వకపోవడంతో సాంకేతిక సంఘం తన బాధ్యతను పూర్తిచేయలేకపోయిందన్నారు. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వారీగా కేటాయించేందుకు వివాద పరిష్కార ట్రిబ్యునల్ కాల పరిమితి పొడిగించామన్నారు.
ప్రధానమంత్రి స్వానిధి పథకం కింద రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వీధి వ్యాపారుల్లో 25 శాతం మందికి రుణాలు మంజూరు చేయకుండా బ్యాంకు అధికారులు తిరస్కరించారని, పెండింగ్‌లో ఉన్న ఫైళ్ళతో కలిపితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉందన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను అంగీకరించిన కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురి ఈ అంశం కేంద్రం పరిధిలోనిది కాదన్నారు. రుణాల మంజూరుపై ఆయా బ్యాంకులు నిర్ణయం తీసుకుంటాయని, సంబంధిత శాఖల మంత్రులు ఈ విషయమై బ్యాంకు అధికారులతో చర్చిస్తున్నారని తెలిపారు.
బీచ్‌శాండ్ తవ్వకాలపై నిషేధం తొలగించే ప్రతిపాదన
బీచ్‌శాండ్‌తో సహా మరికొన్ని అణు ఖనిజాల తవ్వకాలపై నిషేధాన్ని తొలగించే ప్రతిపాదనపై ప్రభుత్వం అందరి సలహాలు, సూచనలు కోరినట్లు కేంద్ర గనులశాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి తెలిపారు. గనులు, ఖనిజాల నియంత్రణ, అభివృద్ధి చట్టం మొదటి షెడ్యూలులోని పార్ట్–బి కింద చేర్చిన బీచ్‌శాండ్ మినరల్స్‌తోపాటు మరికొన్ని అటామిక్ మినరల్స్‌ను తొలగించే ప్రతిపాదనపై వివిధ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, మైనింగ్ పరిశ్రమకు చెందిన భాగస్వాములు, పారిశ్రామిక సంఘాలతోపాటు ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు.
ఇండియన్ అంటార్కిటిక్ బిల్లుకి వైఎస్సార్‌సీపీ మద్దతు
రాజ్యసభలో ఇండియన్ అంటార్కిటిక్ బిల్లుకి వైఎస్సార్‌సీపీ మద్దతు తెలిపింది. రాజ్యసభలో సోమవారం బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ఎంపీ నిరంజన్‌రెడ్డి.. దేశాన్ని సంప్రదింపుల భాగస్వామిగా చూపే ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్రానికి కొన్ని సూచనలు చేశారు.
కృష్ణా మిగులు జలాల్లో వాటాలు తేలుస్తాం
Published Tue, Aug 2 2022 4:49 AM | Last Updated on Tue, Aug 2 2022 3:19 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment