తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 26 వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఐఆర్‌ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డి రిమాండ్‌ను కూడా ఈనెల 26 వరకు పొడిగించింది.
సాక్షి, హైదరాబాద్: తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 26 వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఐఆర్‌ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డి రిమాండ్‌ను కూడా ఈనెల 26 వరకు పొడిగించింది. వీరి రిమాండ్ గడువు ముగియడంతో సోమవారం చంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపర్చారు.
అలాగే ఇతర చార్జిషీట్లలో నిందితులుగా ఉన్న మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, మన్మోహన్‌సింగ్, శ్యామూల్, గనుల శాఖ మాజీ డెరైక్టర్ వీడీ రాజగోపాల్, రాంకీ సంస్థల అధినేత అయోధ్యరామిరెడ్డి, దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియా, ఉద్యోగులు సంజయ్ ఎస్.మిత్రా, నీల్‌కమల్‌బేరి, జయ్‌దీప్‌బసు తదితరులు కోర్టు ఎదుట హాజరయ్యారు. నిమ్మగడ్డ ప్రకాష్, ఈశ్వర్ సిమెంట్స్ మాజీ ఎండీ సజ్జల దివాకర్‌రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారులు వెంకట్‌రామిరెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, ఫార్మా కంపెనీల ప్రతినిధులు హాజరునకు మినహాయింపు కోరుతూ వారి తరఫు న్యాయవాదులు పిటిషన్‌లు దాఖలు చేయగా కోర్టు అనుమతించింది. తదుపరి విచారణను కోర్టు ఈనెల 26కు వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసు నుంచి తమను తొలగించాలని కోరుతూ నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జి పిటిషన్లను కోర్టు మంగళవారం విచారించనుంది.