![Two remanded in CMR Hostel incident](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/6/cmr.jpg.webp?itok=mjCUSMkx)
మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సోదరుడిపై కూడా కేసు నమోదు
మేడ్చల్‌రూరల్: గర్ల్స్ హాస్టల్‌లోని బాత్‌రూంలో వీడియోల చిత్రీకరణ ఘటనలో మేడ్చల్ పోలీసులు ఇద్దరిని రిమాండ్ చేశారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సోదరుడు, సీఎంఆర్ గ్రూప్స్ చైర్మన్ గోపాల్‌రెడ్డి సహా మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...కండ్లకోయలోని సీఎంఆర్ ఐటీ కళాశాల గర్ల్స్ హాస్టల్‌లో డిసెంబర్ 31 రాత్రి బాత్‌రూంలోకి ఓ విద్యార్థిని వెళ్లగా, ఆ సమయంలో ఎవరో వెంటిలెటర్ నుంచి తొంగి చూస్తున్నట్టు గుర్తించింది.
ఈ విషయాన్ని హాస్టల్ వార్డెన్ దృష్టికి తీసుకెళ్లగా, సకాలంలో స్పందించలేదు. దీంతో హాస్టల్‌లోని విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జరిగిన ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి కళాశాలకు నోటీసులు జారీ చేసి విచారణ జరిపింది. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బిహార్‌కు చెందిన కిశోర్‌కుమార్, గోవింద్‌కుమార్‌తో పాటు మరికొందరు మెస్‌లో పనిచేస్తున్నారు.
హాస్టల్ వెనుక భాగంలో యాజమాన్యం ఏర్పాటు చేసిన గదుల్లో వారు ఉంటున్నారు. విద్యార్థుల ఆరోపణలు, ఆందోళన నేపథ్యంలో మెస్‌లో పనిచేసే ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా, కిశోర్‌కుమార్, గోవింద్‌కుమార్‌లు బాత్‌రూం వెంటిలేటర్ ద్వారా తొంగి చూసినట్టు నేరం అంగీకరించారు. దీంతో వారిపై పోక్సో కేసు నమోదు చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. విద్యార్థినులు ఫిర్యాదు చేసిన సమయంలో వారిని కించపరుస్తూ మాట్లాడిన హాస్టల్ వార్డెన్లు ప్రీతిరెడ్డి, ధనలక్ష్మిలపై కూడా కేసు నమోదు చేశారు.
జరిగిన ఘటనను బయటకు రాకుండా చూడాలని, పోలీసులు, విద్యార్థినుల తల్లిదండ్రులకు సమాచారం చేరకుండా చూసుకోవాలని హాస్టల్ వార్డెన్‌లపై ఒత్తిడి తీసుకొచ్చిన సీఎంఆర్ సెట్ కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ, సీఎంఆర్ ఐటీ కళాశాల డైరెక్టర్ మాదిరెడ్డి జంగారెడ్డి, సీఎంఆర్ విద్యాసంస్థల చైర్మన్ గోపాల్‌రెడ్డిలపై కూడా కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment