విద్యార్థినుల హాస్టల్ బాత్‌రూంలో వీడియోల చిత్రీకరణపై విచారణ
సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని పోలీసులకు ఆదేశం
గురువారం కూడా కొనసాగిన విద్యార్థుల ఆందోళన
పోలీసుల అదుపులో హాస్టల్ వార్డెన్ సహా ఏడుగురు
మేడ్చల్ రూరల్: మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయలోని సీఎంఆర్ కళాశాలలో విద్యార్థినులు గురువారం కూడా ఆందోళన కొనసాగించారు. కళాశాల క్యాంటీన్‌లో పనిచేసే యువకులు బుధవారం గర్ల్స్ హాస్టల్ బాత్‌రూంలో మొబైల్ ఫోన్లు ఉంచి విద్యార్థినుల వీడియోలను చిత్రీకరించే ప్రయత్నం చేసిన విషయం తెలిసింది. ఈ విషయాన్ని గుర్తించిన విద్యార్థినులు బుధవారం మధ్యాహ్నం నుంచి ఆందోళన చేపట్టారు.
విద్యార్థులకు మద్దతుగా విద్యార్థి సంఘాలు హాస్టల్ వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నిరసన తెలపటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్.. కళాశాలకు నోటీసులు జారీ చేసింది. కమిషన్ కార్యదర్శి పద్మజ రమణ కళాశాలలో గురువారం విచారణ జరిపారు. సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని పోలీసులను కూడా కమిషన్ ఆదేశించింది.
యాజమాన్యం నిర్లక్ష్యం
హాస్టల్ బాత్‌రూంలో గుర్తు తెలియని వ్యక్తులు తమ వీడియోలు చిత్రీకరిస్తున్నారని విద్యార్థినులు హాస్ట ల్ వార్డెన్ ప్రీతిరెడ్డికి తెలిపారు. అయితే, సమస్యను పరిష్కరించాల్సిన వార్డెన్.. తమనే తప్పుపడుతూ దురుసుగా, నిర్లక్ష్యంగా ప్రవర్తించారని విద్యార్థులు ఆరోపించారు. వీడియోలు తీయటానికి ప్రయత్నించింది హాస్టల్ మెస్‌లో పనిచేసే ఇతర రాష్ట్రాల కార్మికులే అని తెలుపగా.. మీరే మగవారిని చూసి అలా ప్రవర్తిస్తున్నారని వార్డెన్ దారుణంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ విషయం బయటకు చెప్తే మీ వీడియోలు కూడా బయటకు వెళ్తాయని వార్డెన్ అనటంతో ఆగ్రహించిన విద్యార్థినులు ఆందోళనను మరింత తీవ్రం చేశారు. పరిస్థితి విషమించటంతో వార్డెన్ బుధవారం అర్ధరాత్రే అక్కడి నుండి దొడ్డిదారిన వెళ్లిపోయింది.
పోలీసుల అదుపులో వార్డెన్
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మెస్‌లో పనిచేసే ఐదుగురితోపాటు హాస్టల్ వార్డెన్ ప్రీతిరెడ్డి, మెస్ ఇన్‌చార్జి సెల్వంను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన విషయంలో కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కనిపించిందని మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
హాస్టల్ బాత్‌రూంల సమీపంలోనే మెస్‌లో పనిచేసే 12 మంది కార్మికులకు గదులు కేటాయించడమే ఈ ఘటనకు కారణమని చెప్పారు. అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న 12 మొబైల్ ఫోన్లలో అభ్యంతరకరమైన ఎలాంటి వీడియోలు లభ్యం కాలేదని పేర్కొన్నారు. డిలీట్ చేసిన వీడియోలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు ఫోన్లను ల్యాబ్‌కు పంపినట్లు వివరించారు.
కాగా ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని కళాశాల యాజమాన్యాన్ని జేఎన్‌టీయూ ఆదేశించింది. ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులతో సీఎంఆర్ గ్రూప్స్ కార్యదర్శి గోపాల్‌రెడ్డి చర్చలు జరిపారు. హాస్టల్ పరిసరాల్లో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment