CMR College
-
HYD: సడన్ హార్ట్ ఎటాక్.. కాలేజీలోనే కుప్పకూలిన ఇంజనీరింగ్ విద్యార్థి..
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో యువకుడు గుండెపోటుకు బలయ్యాడు. మేడ్చల్ సీఎంఆర్ కాలేజీలో ఈ విషాద ఘటన జరిగింది. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విశాల్ అనే విద్యార్థి గుండెపోటుతో కాలేజీ ఆవరణలోనే కుప్పకూలాడు. కారిడార్‌లో నడుస్తూ ఛాతీలో నొప్పితో సడన్‌గా కిందపడిపోయాడు. తోటి విద్యార్థులు అతడ్ని సీఎంఆర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విశాల్‌ది రాజస్థాన్ అని తెలుస్తోంది. కాగా.. ఇటీవల యువకుల్లో గుండెపోటు ఘటనలు బాగా పెరిగిపోయాయి. కొద్దిరోజుల క్రితమే యువ కానిస్టేబుల్ జిమ్‌లో కసరత్తులు చేస్తూ గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. మరో ఘటనలో స్నేహితుడి పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ యువకుడు సడన్‌గా కుప్పకూలి ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.. గుండె.. ఉండేది మనిషి గుప్పెడంత. కానీ, నిలువెత్తు మనిషి ప్రాణం దాని మీదే ఆధారపడి ఉంటుంది. అయితే మారుతున్న లైఫ్‌స్టైల్.. ఆహారపు అలవాట్లు మనిషిని నిలబెట్టే ఆ బలాన్ని.. బలహీనపరుస్తోంది. అందుకే గుండె సమస్యలతోపాటు కార్డియాక్ అరెస్ట్ సమస్యలతో.. వయసుతో సంబంధం లేకుండా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. అప్పటికప్పుడే ప్రాణం విడుస్తున్నారు. చదవండి: దోస్తు పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు.. 19 ఏళ్లకే గుండెపోటుతో.. -
లవ్ మ్యారేజ్.. ప్రతిరోజు భార్యకు నరకం!
హైదరాబాద్ : మొదటి భార్యకు తెలియకుండా రెండో వివాహం చేసుకున్న లెక్చరర్‌ను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ గోవర్ధన్‌రెడ్డి కథనం మేరకు.. కృష్ణా జిల్లా విజయవాడ గొల్లపుడికి చెందిన చింతల బాలాజీ ఎన్బీటీ నగర్లో ఉంటూ సీఎంఆర్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. దుర్గమణి(32)ని కొంతకాలం పాటు లవ్ చేసిన బాలాజీ 2009లో ఆమెను ప్రేమవివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు. 2015 నుంచి లెక్చరర్ బాలాజీ భార్యను రూ. 10 లక్షలు అదనపు కట్నం తేవాలని వేధించడమేగాక ఆమెకు 6 సార్లు అబార్షన్ చేయించాడు. చేసుకున్నది ప్రేమ వివాహమే అయినా భార్యకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాడు. నెల క్రితం తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు భార్య దుర్గమణిని బెదిరించాడు. ఈ నెల 8న తాను పెళ్లి చేసుకున్నట్లు చెప్పడంతో ఆ విషయంపై ఆమె గట్టిగా నిలదీసింది. దీంతో గర్భిణీ అని కూడా చూడకుండా ఆమెపై దాడి చేయడమేగాకుండా చంపుతానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. మంగళవారం లెక్చరర్‌ను అరెస్ట్ రిమాండ్‌కు తరలించి విచారణ చేపట్టారు. -
'అమ్మానాన్నలకు భారం కాదల్చుకోలేదు'
హైదరాబాద్ : 'చదువులో వెనుకబడిన నేను అమ్మానాన్నలకు భారం కాదల్చుకోలేదు.. అందుకే ప్రాణం తీసుకుంటున్నా' అని సూసైడ్ నోట్ రాసి ఓ బీటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌కు చెందిన జె. రాకేష్(20) స్థానిక యన్.సి.యల్ శివసాయి బాయ్స్ హాస్టల్లో ఉంటూ మేడ్చల్‌లోని సీఎంఆర్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా చదువులో వెనుకబడిపోవడంతో.. అమ్మానాన్నలకు భారంగా మారుతున్నానని భావించి హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
కాలేజీ ముందు విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన
మేడ్చల్: రంగారెడ్డి జిల్లాలో మూడు రోజుల క్రితం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు సీఎంఆర్ కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఎంఆర్ కాలేజీలో భార్గవ్ అనే విద్యార్థి బీఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతడి హాజరు 50 శాతం కంటే తక్కువ ఉండటంతో ల్యాబ్ పరీక్షకు ప్రిన్సిపల్ అనుమతించలేదని చెప్పారు. దీంతో తీవ్ర మనస్తాపంతో భార్గవ్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి యాజమాన్యమే బాధ్యత వహించి న్యాయం చేయాలని తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి ఆందోళన చేశారు.