లవ్ మ్యారేజ్.. ప్రతిరోజు భార్యకు నరకం!
హైదరాబాద్ : మొదటి భార్యకు తెలియకుండా రెండో వివాహం చేసుకున్న లెక్చరర్‌ను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ గోవర్ధన్‌రెడ్డి కథనం మేరకు.. కృష్ణా జిల్లా విజయవాడ గొల్లపుడికి చెందిన చింతల బాలాజీ ఎన్బీటీ నగర్‌లో ఉంటూ సీఎంఆర్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. దుర్గమణి(32)ని కొంతకాలం పాటు లవ్ చేసిన బాలాజీ 2009లో ఆమెను ప్రేమవివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు.
2015 నుంచి లెక్చరర్ బాలాజీ భార్యను రూ. 10 లక్షలు అదనపు కట్నం తేవాలని వేధించడమేగాక ఆమెకు 6 సార్లు అబార్షన్ చేయించాడు. చేసుకున్నది ప్రేమ వివాహమే అయినా భార్యకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాడు. నెల క్రితం తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు భార్య దుర్గమణిని బెదిరించాడు. ఈ నెల 8న తాను పెళ్లి చేసుకున్నట్లు చెప్పడంతో ఆ విషయంపై ఆమె గట్టిగా నిలదీసింది. దీంతో గర్భిణీ అని కూడా చూడకుండా ఆమెపై దాడి చేయడమేగాకుండా చంపుతానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. మంగళవారం లెక్చరర్‌ను అరెస్ట్ రిమాండ్‌కు తరలించి విచారణ చేపట్టారు.