సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోని రాష్ట్రంలోని పోలీసు విభాగాన్ని చంద్రబాబునాయుడు సర్కారు విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తుండటం.. టీడీపీకి అనుకూలంగా పోలీసు బాస్ ఆర్పీ ఠాకూర్ సహా బదిలీ అయిన ఇంటెలిజెన్స్ డీజీ, ఇతర ఉన్నతాధికారులు కొమ్ముకాస్తుండటంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాకు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన జరగాల్సిన ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా, సజావుగా జరిగేందుకే కేంద్ర ఎన్నికల సంఘం సత్వరమే చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం టీడీపీకి కొమ్ముకాస్తూ.. అత్యంత పక్షపాతపూరితంగా, అసమర్థంగా వ్యవహరిస్తున్న ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను బదిలీ చేయాలని, టీడీపీకి అనుకూలంగా పనిచేస్తూ.. వైఎస్సార్‌సీపీ సహా ఇతర ప్రతిపక్ష నేతలను వేధిస్తున్న ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు టీ యోగానంద్, మాధవ్‌రావులను ఇంటెలిజెన్స్ విభాగం ఓఎస్డీలుగా తొలగించాలని, అదేవిధంగా పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో డీజీపీ కార్యాలయం సమన్వయ అధికారిగా పనిచేస్తున్న డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించి.. వేరేచోటకు పంపాలని వైఎస్సార్‌సీపీ నేత విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో కోరారు.
వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వర్‌రావును గతంలోనే బదిలీ చేసినప్పటికీ.. ఆయన ఇప్పటికీ పోలీసు విభాగంలో జోక్యం చేసుకుంటూ.. డీజీపీ ఠాకూర్ మద్దతుతో టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, క్షేత్రస్థాయిలో నిఘా వ్యవస్థను టీడీపీకి అనుకూలంగా వాడుకుంటూ.. ఆ నివేదికలను రహస్యంగా సీఎం చంద్రబాబుకు చేరవేస్తున్నారని విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు. ఏబీ వెంకటేశ్వర్‌రావు పోలీసు వ్యవస్థలో జోక్యం చేసుకోకుండా వెంటనే నిలువరించాలని, కుట్రపూరిత వ్యవహారాలు చేపట్టకుండా.. సెక్రటేరియట్‌లో రిపోర్ట్ చేయాలని ఆయనను ఆదేశించాలని ఈసీని అభ్యర్థించారు.
సీఎం చంద్రబాబు సామాజిక వర్గమైన కమ్మ కులానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్‌లు టీ యోగానంద్, మాధవరావులను రాజకీయ కార్యకలాపాల కోసమే గతంలో వెంకటేశ్వర్‌రావు ఇంటెలిజెన్స్ ఓఎస్డీలుగా నియమించారని, టీడీపీ అనుకూల అధికారులుగా ముద్రపడిన వారు.. పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగపరుస్తూ.. ఆ పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని, అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసి.. వేధిస్తున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికలు జరగవేమోనన్న నిస్సహాయ పరిస్థితి తమకు కలుగుతోందని అన్నారు.
ఇక, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఐపీఎస్ అధికారి ఘట్టమనేని శ్రీనివాస్‌ను పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో డీఐజీ కో ఆర్డినేషన్, లా అండ్ ఆర్డర్‌గా నియమించారని, గతంలో రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు ఎస్పీగా, కర్నూల్ రేంజ్ డీఐజీగా, అనంతపురం రేంజ్ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన ఆయన టీడీపీ అనుకూల ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లను ఆ ప్రాంతంలో నియమించారని, పోలీసు వ్యవస్థను టీడీపీకి రాజకీయంగా అనుకూలంగా మలిచినందుకే ఆయనకు ముఖ్యమంత్రి ప్రమోషన్ ఇచ్చారని, ఇప్పుడు ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసేందుకు ఆయన పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారని విజయసాయిరెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్‌తోపాటు డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ను బదిలీ చేయాలని, ఇంటెలిజెన్స్ ఓస్డీలుగా ఉన్న ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు టీ యోగానంద్, మాధవరావులను ఆ పదవుల నుంచి వెంటనే తొలగించాలని ఆయన కోరారు.
అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థనలు, ఎమర్జెన్సీ ఫిర్యాదులు స్వీకరించి.. సత్వర్వమే తగిన చర్యలు తీసుకునేందుకు ఎన్నికల సంఘం ప్రధానాధికారి కార్యాలయంలో, డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ లేదా ఎమర్జెన్సీ రెస్పాన్స్ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి జిల్లాలోనూ ఎన్నికల అధికారులు, (కలెక్టర్లు), ఎస్పీల సంయుక్త నేృతృత్వంలో ఇదేవిధంగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. పోలింగ్‌కు మిగిలిన ఉన్న రెండురోజులు.. పోలింగ్ తేదీ నాడు ఎలక్షన్ కంట్రోల్ రూమ్, పోలీసు వ్యవస్థను పర్యవేక్షించేందుకు డీజీపీ కార్యాలయంలో ఎన్నికల పరిశీలకులు నియమించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment