
పెద్దల సభలో రైల్వే ప్రయాణీకుల సమస్యల ప్రస్తావన
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే ప్రయాణీకుల సమస్యలను వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత వి. విజయసాయిరెడ్డి గురువారం రాజ్యసభ జీరో అవర్‌లో ప్రస్తావించారు. రైళ్లలో అపరిశుభ్రమైన దుప్పట్లు సరఫరా చేస్తున్నారని, ఏసీ సరిగా ఉండటం లేదని ప్రయాణీకుల నుంచి వస్తున్న ఫిర్యాదులను సభ దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీ ఎక్స్‌ప్రెస్, కోరమాండల్ సమత, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో సరైన ఏసీ సదుపాయ ఉండటం లేదని, అపరిశుభ్రమైన బెడ్ రోల్స్ సరఫరా చేస్తున్నారని చెప్పారు.
రైళ్లలో శుభ్రతతో కూడిన దుప్పట్లు సరఫరా చేయడంతో పాటు అంతరాయం లేని ఏసీని అందుబాటులోకి తేవాలని కోరారు. రైళ్లలో కనీస సదుపాయాలను పరిశుభ్రంగా ప్రయాణీకులకు అందించాలని, ఈ విషయంలో రైల్వే శాఖ మంత్రి జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరారు.