
సాక్షి, హైదరాబాద్: ఎల్‌బీ నగర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కారు వరదనీటిలో చిక్కుకుంది. హస్తినాపురం డివిజన్ సాగర్ ఎంక్లేవ్‌లో ఆయన పర్యటిస్తుండగా వరదలో ఎమ్మెల్యే కారు చిక్కుకుపోయింది. సెక్యూరిటీతో పాటు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూడా కారును తోశారు. అతికష్టం మీద వరదలో చిక్కుకున్న కారు బయటకొచ్చింది.
హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. నాగోల్ అయ్యప్పనగర్ కాలనీ నీట మునిగింది. మల్లికార్జునగర్, త్యాగరాజనగర్ కాలనీల్లోకి వరద నీరు చేరింది. 60 మందిని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. రామంతాపూర్‌లో భారీ వర్షానికి ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. వనస్థలిపురం చింతలకుంట జాతీయ రహదారిపై వర్షపునీరు నిలిచిపోయింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి రహదారులు జలమయం అయ్యాయి.