మెదక్: ఘనపురం ప్రాజెక్ట్ కాల్వల ఆధునికీకరణ కోసం రెండేళ్ల క్రితం రూ.21.86 కోట్లు మంజూరయ్యాయి. అయితే పనులు ముందుకు సాగ లేదు. గత ప్రభుత్వ హయాంలో కాల్వ పనులకు కొంతమంది రాజకీయ నాయకులే మోకాలు అడ్డం వేశారనే ఆరోపణలున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు ప్రారంభానికి 2014 జూన్ 19న మళ్లీ శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఎంఎన్ కెనాల్ 76 చైనేజ్ నుంచి 480 చైనేజ్ వరకు జంగిల్ కటింగ్, పూడికతీత కార్యక్రమాలు కొనసాగాయి. అంతలోనే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో పనులను నిలిపివేశారు.
ఈయేడు సింగూర్‌లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున రబీ సీజన్‌కు ఎలాగు నీటిని వదిలే అవకాశం లేదు. తాజాగా టీఆర్‌ఎస్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ ఘనపురానికి నిధులు కేటాయించారు. కనీసం ఇప్పుడైనా కాల్వల మరమ్మతులు ప్రారంభిస్తే తమ కలలు నెరవేరుతాయని చివరి ఆయకట్టు రైతులు ఆశిస్తున్నారు.
తగ్గిన ఆయకట్టు విస్తీర్ణం
ఘనపురం ప్రాజెక్ట్‌ను మంజీర నదిపై కొల్చారం, పాపన్నపేట మండలాల మధ్య 1905లో నిర్మించారు. నాటి నుంచి నేటి వరకు ఆనకట్ట పరిధిలోని మహబూబ్ నహర్ కెనాల్, ఫతే నహర్ కెనాళ్లకు కనీస మరమ్మతులు చేయకపోవడంతో అవి పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. ఫలితంగా 22వేల ఎకరాల ఆయకట్టు కాస్తా 12 వేల ఎకరాలకు పడిపోయింది.
దీంతో 2009లో నగరబాటలో భాగంగా మెదక్ వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఘనపురం కాల్వల ఆధునికీకరణ కోసం రూ.9 కోట్లు మంజూరు చేశారు. అనంతరం పూర్తిస్థాయి మరమ్మతుల కోసం జపాన్ బ్యాంక్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ కార్పొరేషన్ లిమిటెడ్(జైకా) కింద రూ.21.86 కోట్లు మంజూరయ్యాయి. వీటి ద్వారా మహబూబ్‌నహర్ కెనాల్ 34 కిలోమీటర్లు. ఫతేనహర్ కెనాల్ 19కిలో మీటర్ల నిడివి మేర మరమ్మతులు చేయాల్సి ఉంది.
ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ ఫిబ్రవరి 2012లో పనులు చేజిక్కించుకొని అగ్రిమెంట్ కుదుర్చుకుంది. రెండేళ్ల కాలపరిమితిలో కాల్వల లైనింగ్, పూడిక తీత, జంగిల్ కటింగ్ తదితర పనులు పూర్తి చేయాల్సి ఉంది.
అడుగడుగునా అడ్డంకులే!
జైకా పనులు దక్కించుకునేందుకు రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌తోపాటు మరో కంపెనీ పోటీ పడినట్లు తెలిసింది. కాగా పనులు దక్కించుకోలేని కంపెనీ జిల్లాకు చెందిన ఓ మాజీ ముఖ్యనేత అండతో మరమ్మతు పనులు అడ్డుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో పనులు పూర్తిచేసిన రూ.1.27కోట్లకు సంబంధించి బిల్లులు చెల్లించడంలో అధికారులు జాప్యం చేశారనే విమర్శలున్నాయి. చేసిన పనికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు 2013 జూన్ 3న ఎంబీ రికార్డు చేసి పీఏఓకు పంపారు.
కానీ 37 రోజుల తర్వాత 2013 జూలై 08న ఎంబీలో కొన్ని పేజీలు చిరిగి పోయాయని చెబుతూ బిల్లును వాపస్ పంపారు. అసలు పేజీలు ఏ శాఖలో చిరిగి పోయాయన్నది ఇప్పటికీ అంతుబట్టని రహస్యం. అదే సమయంలో జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కాంట్రాక్ట్‌పై ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఇలా ముప్పేట దాడితో విలవిల్లాడిన కాంట్రాక్టర్ పనులు నిలిపి వేసి కోర్టుకెక్కాడు.
దీంతో జైకా పనులు సాగక రైతన్నల భూములకు నీరందక బీళ్లుగా మారాయి. ఈ క్రమంలో 2014 ఫిబ్రవరి 15తో కాంట్రాక్ట్ గడువు ముగిసిపోయింది. తనకు గడువు పెంచాలని కాంట్రాక్టర్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగస్టు 2015 వరకు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
మంత్రి హరీష్ చొరవతో పనులు ప్రారంభం
ఆగిపోయిన జైకా పనులు నీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావు చొరవతో కొలిక్కి వచ్చాయి. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించగానే జైకా పనులపై ప్రత్యేక దృష్టి నిలిపారు. ఈ క్రమంలో పాత కాంట్రాక్టర్‌కు కాంట్రాక్ట్ పదవీ కాలాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు జూన్ 19న జైకా పనులకు మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిల ఆధ్వర్యంలో మరోసారి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఎం.ఎన్. కెనాల్‌లో సుమారు రూ.50 లక్షలు పనులు పూర్తయ్యాయి. అంతలోనే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో సింగూర్ నుంచి ఘనపురం ప్రాజెక్ట్‌కు నీటిని విడుదల చేశారు. దీంతో మరమ్మతు పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ముగిసినందున కాల్వల ఆధునికీకరణ పనులు తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉంది.
గ‘ఘన’మేనా!
Published Fri, Nov 7 2014 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM
Advertisement
Advertisement