ఎనిమిది నెలలుగా అందని వేతనాలు
ప్రభుత్వాస్పత్రి ఎదుట పారిశుధ్య సిబ్బంది ఆందోళన
పెద్దపల్లిరూరల్ : పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో పారిశుధ్య పనులు నిర్వహించే కాంట్రాక్టర్ తమకు ఎనిమిది నెలలు గా వేతనాలు ఇవ్వడంలేదని కార్మికులు శుక్రవారం ఆస్ప త్రి ఎదుట ఆందోళన చేశారు. పాత కాంట్రాక్టర్ మూడు మాసాలు, కొత్తగా పనులు తీసుకున్న కాంట్రాక్టర్ నుంచి ఐదు నెలల వేతనాలు అందాల్సి ఉందని కార్మికులు దాసరి లక్ష్మి, గుజ్జుల విజయ పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లేందుకు ఆస్పత్రి ప్రధాన ద్వారం ఎదుట ఆందోళన చేశారు. ఒక్కొక్కరికీ రూ.4 వేల చొప్పున వేతనం ఇస్తున్న కాంట్రాక్టర్లు ఇపుడు తమకు అనుకూలమైన ఎనిమిది మందికే పనికల్పిస్తామంటున్నారని కార్మికురాలు లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది.
తమకు నెలానెల వేతనాలివ్వకపోవడంతో పస్తులుంటున్నామని విజయ, లక్ష్మి, పద్మ, కనకమ్మ, ఈశ్వరి, ఈర్ల పోశమ్మ, బీబీ, భాగ్యమ్మ, రవి ఆవేదన వ్యక్తం చేశారు. 14 మంది పనిచేస్తున్నా ఎనిమిది మంది ఖాతాలకే వేతనాలు వేస్తామంటున్నారని తెలిపారు. తమకు బకాయి వేతనాలను వెంటనే చెల్లించడంతోపాటు పనిభద్రతను కల్పించేలా ఉన్నతాధికారులు చొరవచూపాలని కోరారు. ఈ విషయమై పారిశుధ్య పనులు పొందిన సావనీర్ కంపనీ ప్రతినిధిని ఫోన్ లో సంప్రదించగా అవసరానికి మించి సిబ్బంది ఉండడం ఇబ్బందిగా మారిందన్నారు. ఎనిమిది మందికే వేతనాలందించే అవకాశముందన్నారు. అయితే చాల కాలంగా పనిచేస్తున్నందున తాము ఇచ్చే వేతనాలను అందరూ పంచుకోవాలని సూచించామని పేర్కొన్నారు.