కరోనా.. ఏడాదిగా ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి.వైరస్ వ్యాప్తి మొదలైన కొత్తలో అంతా ఆందోళనే. ఇంట్లోంచి కాలు బయటపెట్టాలన్నా వణికే పరిస్థితి. అత్యవసర రంగాలకు చెందినవాళ్లు తప్పనిసరి పరిస్థితుల్లో భయం భయంగానే విధులకు వచ్చారు. కరోనా అంటేనే హడలిపోయే పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి పనిచేశారు. అలాంటి ఫ్రంట్‌లైన్ వారియర్లలో ఎందరో మహిళలు ఉన్నారు. డాక్టర్లు, నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు ఇలా చాలా రంగాల్లో మహిళలు తమ సేవలు అందించారు. వైరస్ వ్యాప్తి అరికట్టడానికి కృషి చేశారు, కోవిడ్ బారినపడ్డ వారికి చికిత్స అందించారు. నిత్యావసరాలు అందజేసి బాధితుల ఆకలినీ తీర్చారు. ఒకవైపు కుటుంబాన్ని, మరోవైపు సమాజాన్ని రక్షించే అత్యున్నత బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారు చేసిన సేవలు, అభిప్రాయాలతో ప్రత్యేక కథనం..
తొలి కరోనా బాధితుడికి సేవలు చేశా..
‘‘గాంధీ ఆస్పత్రిలో మొదటి కరోనా రోగిని చేర్చినప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను. కరోనా పేరు వింటేనే వణికిపోయే పరిస్థితుల్లో విధులు ఎలా నిర్వర్తించాలా అన్న ఆందోళన కలిగింది. మొదట చాలా భయం వేసింది. అయినా ధైర్యం తెచ్చుకున్నాను. రోజూ రెండు సార్లు బాధితుడి వద్దకు వెళ్లి వైద్య సేవలు అందించేదాన్ని. అదే సమయంలో మానసికంగా ధైర్యం చెప్పాను. నా కుటుంబ సభ్యులు భయపడినా.. నన్ను ప్రోత్సహించడంతో ఆత్మ విశ్వాసం కలిగింది. ఇప్పటిదాకా 100 మందికి పైగా కరోనా రోగులకు సేవలు చేశాను. లతా జ్యోత్స్న (హెడ్ నర్సు), సారా (స్టాఫ్ నర్స్) కలిసి టీంగా పనిచేశాం. జాగ్రత్తగా ఉండటం వల్ల నాకు, మా కుటుంబ సభ్యులెవరికీ వైరస్ సోకలేదు.’’
–అరుణాదేవి, స్టాఫ్‌నర్సు, గాంధీ ఆస్పత్రి, హైదరాబాద్
అరుణాదేవి, కవిత, డాక్టర్ జూలకంటి మాధవి
జనం దగ్గరికి రానివ్వని పరిస్థితుల్లో..
లాక్ డౌన్ సమయంలో మా ఆరోగ్య కేంద్రం పరిధి మాలపల్లిలో కంటైన్‌మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. పాజిటివ్ వారిని 14 రోజుల పాటు పరిశీలించాల్సి ఉండేది. కానీ కంటైన్‌మెంట్ జోన్ పెట్టిన కాలనీ వాసులు మమ్మల్ని చాలా ఇబ్బందిపెట్టేవారు. కరోనా పేరిట అనవసరంగా బదనాం చేస్తున్నామని తిరగబడ్డారు. తెలిసిన వారు సైతం దగ్గరకు రానివ్వలేదు. పాజిటివ్ కేసుల పరిశీలనకు వెళ్లినప్పుడు ఒకట్రెండు సార్లు కొట్టేందుకు ప్రయత్నించారు. ప్రాణాలకు తెగించి పనిచేయాల్సి వచ్చింది. నాకు, నా ద్వారా ఇంట్లో వాళ్లకు కరోనా వస్తుందేమోనని ప్రతిరోజూ భయంగానే ఉండేది. అన్నీ తట్టుకుని పనిచేశాం.
– కవిత, ఆశ కార్యకర్త, మాలపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం, నిజామాబాద్ జిల్లా
సిబ్బందిలో 70 శాతంపైగా మహిళలమే..
కరోనా అనుమానాస్పద కేసులన్నీ ఉస్మానియా ఆస్పత్రికి వచ్చేవి. సిబ్బందిలో 70 నుంచి 80 శాతం మంది మహిళలే. స్వీపర్ నుంచి పైస్థాయి వరకు అందరం గంటల కొద్దీ పీపీఈ కిట్లు వేసుకొని పనిచేయాల్సి వచ్చింది. మాది క్రిటికల్ కేర్ విభాగం కావడంతో పేషెంట్లకు మరింత దగ్గరగా పనిచేయాల్సి వచ్చేది. అంతా ఆత్మ విశ్వాసంతో పనిచేశాం. నేను అనెస్థీషియా నేషనల్ టాస్క్‌ఫోర్స్ కమిటీకి తెలంగాణ కోఆర్డినేటర్‌గా ఉండేదాన్ని. కరోనా చికిత్సపై ఢిల్లీ, మహారాష్ట్ర డాక్టర్లతో మాట్లాడేదాన్ని. ఎప్పటికప్పుడు చికిత్స పద్ధతులు మారేవి. నాకు, చాలా మంది పీజీ విద్యార్థులకు వైరస్ లక్షణాలు కనిపించకున్నా.. యాంటీబాడీస్ మాత్రం వచ్చాయి.
– డాక్టర్ జూలకంటి మాధవి, క్రిటికల్ కేర్ విభాగం, ఉస్మానియా ఆస్పత్రి, హైదరాబాద్
చనిపోతావని భయపెట్టినా..
గాంధీ ఆస్పత్రిలో మొదటి కేసు వచ్చినప్పుడు నేను ఆ గదికి వెళ్లి శుభ్రం చేసేదాన్ని. కొందరైతే చచ్చిపోతావు అని భయపెట్టారు. గతంలో స్వైన్‌ఫ్లూ కేసులు వచ్చినప్పుడూ ఇలాగే సేవలు చేశా. ఏదైతే అది అవుతుందనుకొని ధైర్యంగా ఉన్నాను. మొదట్లో ఇంట్లో వాళ్లు కూడా ఇంత రిస్క్ ఎందుకన్నారు. ఉద్యోగం మానేయమన్నారు. 150 మంది కరోనా రోగులకు సేవ చేశాను. నేను కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నాను. ఇంత సేవ చేసిన మాకు వేతనం పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.
– అంబాల రాధిక, స్వీపర్, గాంధీ ఆస్పత్రి
అంబాల రాధిక, స్వప్న
టెస్టులు చేస్తుంటే భయం వేసేది
కరోనా అనుమానితులకు టెస్టులు చేయాల్సిన డ్యూటీ నాది. కరోనా ఎవరి నుంచి సోకుతుందో తెలియని పరిస్థితుల మధ్య రోజూ టెస్టులు చేయాల్సి వచ్చేది. ఓవైపు భయంగా ఉన్నా.. నా విధులు నన్ను ముందుకు నడిపించాయి. మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాం.
– స్వప్న, ఏఎన్‌ఎం, మిరుదొడ్డి (దుబ్బాక)
కనిపించని శత్రువుతో యుద్ధం చేశాం
కరోనా సమయంలో పోలీస్ డిపార్ట్‌మెంట్ కీలకంగా వ్యవహరించాల్సి వచ్చింది. నేను ఆ సమయంలో నిత్యావసరాల సరఫరాకు ఆటంకం కలగకుండా చూసే కంట్రోల్ రూం బాధ్యతలు చూశాను. 24 గంటలపాటు అనేక మంది వ్యాపారులను కలవాల్సి వచ్చింది. అదే క్రమంలో నాకూ కరోనా పాజిటివ్ వచ్చింది. చాలా భయపడ్డాను. డీజీపీ, వైద్యులు, మా కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. క్వారంటైన్‌లో ఉన్నప్పుడు పిల్లలు గుర్తుకొచ్చి బాధ వేసేది. కనిపించని శత్రువుతో 25 రోజుల పాటు పోరాడాను. యోగా చేశాను, పుస్తకాలు చదివాను. నాకు నేను ధైర్యం చెప్పుకుని విజేతగా నిలిచాను. – స్వాతి లక్రా, ఐజీ, విమెన్‌సేఫ్టీ వింగ్ చీఫ్
స్వాతి లక్రా, జ్యోత్స్న
పిల్లల గురించి బాధపడ్డా..
జూలైలో నాకు గాంధీ ఆస్పత్రిలో బందోబస్తు డ్యూటీ వేశారు. డాక్టర్లు, సిబ్బంది, పేషెంట్లు, టెస్టుల కోసం వచ్చే వాళ్లతో మాట్లాడాల్సి వచ్చేది. ఓ రోజు అకస్మాత్తుగా తలనొప్పి మొదలైంది. మొదట్లో తేలికగా తీసుకున్నా.. తర్వాత టెస్టుకు వెళ్లాను. ముందు జాగ్రత్తగా పిల్లలకు దూరంగా ఉన్నాను. ఒకరోజు తర్వాత పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. నాకేం భయం అనిపించలేదు. కానీ ఒక తల్లిగా నా పిల్లలకు వచ్చి ఉంటుందేమోనన్న అనుమానం స్థిమితంగా ఉండనీయ లేదు. మా బాబుకు మూడు రోజుల తర్వాత పాజిటివ్ గా తేలింది. అయితే రెండు వారాల్లోనే కోలుకున్నాం. 15 రోజుల తర్వాత మళ్లీ డ్యూటీలో చేరాను. – జ్యోత్స్న, ఇన్‌స్పెక్టర్
Comments
Please login to add a commentAdd a comment