రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికుల సమ్మె | Municipal contract staff to go on strike | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 21 2013 7:09 AM | Last Updated on Thu, Mar 21 2024 9:10 AM

రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులు సమ్మెబాట పట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న కార్మికులు నేటి నుంచి సమ్మె సైరన్ మోగించారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 164 మునిసిపాలిటీలు, 19 కార్పొరేషన్లలో పనిచేస్తున్న 25 వేల మందికి పైగా కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. కాంట్రాక్టు కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు కూడా వీరిలో ఉన్నారు. నెలసరి కనీస వేతనం 12 వేల 5వందల రూపాయలతో పాటు పలు డిమాండ్ల సాధనకు రెండు నెలలుగా వివిధ రకాల ఆందోళనలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో రెండు దఫాలుగా అధికారులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సోమవారం నుంచి సమ్మెకు దిగారు. గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా 10 కాంట్రాక్టు కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయి. వీరి సమ్మెకు ఏఐటీయూసీ, సీఐటీయూ, టీఎన్‌టీయూసీ తదితర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. కార్మికులతో చర్చలు జరపడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాల్సిన మున్సిపల్ శాఖ అధిపతులు అందుబాటులో లేకపోవడంతో సమ్మెలోకి వెళ్లే కార్మికులను కనీసం చర్చలకు కూడా పిలవలేదు. నిన్నమొన్నటి దాకా సీమాంధ్ర జిల్లాల్లో మున్సిపల్ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. వీరి సమ్మె విరమణ జరిగిన వారంలోపే రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులు సమ్మెలోకి వెళ్లనుండటంతో అంతంత మాత్రంగా ఉన్న నగర పారిశుధ్యం పూర్తిగా చతికిలపడనుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement