
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీలోని పారిశుధ్య కార్మికుల వ్యక్తిగత రక్షణకు సర్కారు భరోసా ఇస్తోంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యం లో పారిశుధ్య కార్మికులందరికీ వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ) అందజేయాలని అన్ని మున్సిపాలిటీలకు రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. పారిశుధ్య కార్మికులు 8 రకాల విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయా విధులకు తగ్గట్టు వారికి రక్షణ కల్పించే ప్రత్యేక పీపీఈలపై అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(అస్కీ) అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫారసులు చేసింది. అస్కీ సిఫారసుల మేరకు కింద పేర్కొన్న పరికరాలను అందజేయాలని మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని 141 పురపాలికల్లో దాదాపు 60 వేలమంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల పలువురు కార్మికులు కరోనా బారిన పడ్డారు. దీంతో వారి రక్షణకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏ ఏ విభాగాలవారికి ఏ ఏ పరికరాలంటే...
మరుగుదొడ్ల నిర్వహణలో ఉన్నవారికి..
► పాలికార్బోనెట్ లెన్స్, ఎన్–95 మాస్క్, రబ్బరు లాటెక్స్ గ్లౌవ్స్, ఉక్కు బొటనవేలు, చీలమండ కలిగిన పొడవాటి బూట్లు, యాప్రాన్లు
మురికి కాల్వలు శుభ్రపరిచేవారికి...
► పాలిథిలిన్ హెల్మెట్, యాంటీ ఫాగింగ్ కంటి అద్దాలు, దూరం నుంచి కనిపించేలా భద్రతాదుస్తులు, ఉక్కు బొటన వేలు కలిగి మోకాలు వరకు ఉన్న పొడవైన బూట్లు, హాఫ్ మాస్క్ రెస్పిరేటర్లు, నైట్రైల్ గ్లౌవ్స్, మ్యాన్‌హోల్‌లోకి ప్రవేశిస్తే రక్షణ కోసం పాలీప్రొఫిలిన్‌తో తయారు చేసిన సూట్, దూరం నుంచి కనిపించేలా రేడియం ప్యాంట్, బుల్లెట్ ఆకారంలో చెవి ప్లగ్స్
సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేసేవారికి...
► పాలిథిలిన్ హెల్మెట్, యాంటీఫాగింగ్ కళ్లద్దాలు, భద్రతాదుస్తులు, ఉక్కుబొట న వేలు కలిగి మోకాలి వరకుండే షూస్, హాఫ్‌మాస్క్ రెస్పిరేటర్స్, నైట్రైల్ గ్లౌవ్స్
వీధులు ఊడ్చేవారు/రోజూ చెత్తను సేకరించేవారు/ చెత్త తరలించే వాహనాల డ్రైవర్లు, చెత్తను వేరుచేసే చోట పనిచేసేవారికి...
► నైట్రైల్ లైనింగ్ గల మందమైన గ్లౌవ్స్, ఎన్–95 మాస్కులు, దూరం నుంచి కనిపించేలా భద్రతాదుస్తులు, ఉక్కుబొటన వేలు కలిగిన చెప్పులు
ఎఫ్‌ఎస్‌టీ ప్లాంటుల ఆపరేటర్లకు...
► నైట్రైల్ గ్లౌవ్స్, యాప్రాన్స్, ఉక్కు బొటనవేలు కలిగి మోకాలు వరకు ఉండే బూట్లు, ఎన్–95 మాస్క్
స్వయం సహాయకసభ్యులు/ఆశ వర్కర్లు
► పునర్వినియోగించదగిన అల్లిక కలిగిన చేతి తొడుగులు, పునర్వినియోగించదగిన ఎన్–95 మాస్కు,
► ఉక్కు బొటనవేలు కలిగి మోకాలు వరకు ఉండే బూట్లు
మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు ప్రతినెలా 1న రూ.12,000 వేతనం చెల్లించాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్ వాటాలను కార్మికుల ఖాతాల్లో ఎప్పటికప్పుడు జమ చేయాలని పేర్కొన్నారు.
వారిని తొలగించండి..
60 ఏళ్లకు పైబడిన మున్సిపల్ ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులను తొలగించి వారిస్థానంలో వారి కుటుంబంలో 25–40 ఏళ్ల ఔత్సాహికులుంటే నియమించుకోవాలని పురపాలక శాఖ డైరెక్టర్ సూచించారు. తొలగించిన కార్మికుల కుటుంబంలో అర్హులెవరూ లేకపోతే, స్థానికంగా పందుల పెంపకందారులకు ఆ ఉద్యోగావకాశాన్ని కల్పించాలని, పందుల పెంపకందారులు అందుబాటులో లేకపోతేస్కావెంజర్లను నియమించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment