సానిటేషన్ సిబ్బంది.. సార్ల ఇండ్లలో..! | sanitation workers in karim nagar district | Sakshi
Sakshi News home page

సానిటేషన్ సిబ్బంది.. సార్ల ఇండ్లలో..!

Published Fri, Jul 8 2016 11:37 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 AM

నగర పాలక సంస్థ సానిటేషన్ వర్కర్స్ తో అధికారులు, ప్రజాప్రతినిధులు తమ ఇండ్లలో సానిటేషన్ సిబ్బందితో పని చేయించుకోవడం చర్చనీయాంశమవుతోంది.

 
అధికారులు, ప్రజాప్రతినిధుల ఇండ్లల్లో నగర పాలక సంస్థ సానిటేషన్ వర్కర్స్ 
ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్, కమిషనర్, మేయర్, కార్పొరేటర్ నివాసాల్లో పనులు
 
కరీంనగర్ : కరీంనగర్‌లోని రోడ్లు, డ్రైనేజీలను శుభ్రం చేసేందుకు నగరపాలక సంస్థలో 672 మంది సానిటేషన్ వర్కర్స్ పని చేస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న వీరికి నగరపాలక సంస్థ ప్రతినెలా రూ.8,300 వేతనం చెల్లిస్తోంది. పీఎఫ్, ఈఎస్‌ఐ కలుపుకుని రూ.10 వేల వరకు ఇస్తోంది. అందుకోసం ఏటా రూ.10.50 కోట్లను కార్పొరేషన్ ఖర్చు చేస్తోంది. నగరంలోని రోడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి సుందరంగా ఉంచాలనే లక్ష్యంతో ఇంత పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నారు. కానీ సానిటేషన్ వర్కర్లలో పలువురిని ఆ పని నుంచి తప్పించి ప్రముఖుల ఇళ్లల్లో పని చేయించుకుంటున్నారు. ఎవరైనా తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సిన ప్రజా ప్రతినిధులు, అధికారులే తమ ఇండ్లలో సానిటేషన్ సిబ్బందితో పని చేయించుకోవడం చర్చనీయాంశమవుతోంది. నిజానికి కలెక్టర్, కార్పొరేషన్ కమిషనర్, మేయర్ అధికారిక నివాసాల్లో పనుల కోసం వర్కర్లను నియమించుకునే అధికారం వారికుంటుంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది.
 
కానీ అలా చేయకుండా నగరపాలక సంస్థలో పనిచేస్తున్న సానిటేషన్ వర్కర్స్‌ను ఇంటి పనులకు వాడుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. సుమారు 25 మంది సానిటేషన్ వర్కర్స్‌ను అధికారులు, ప్రజా ప్రతినిధుల నివాసాల్లో పనికి వినియోగించుకుంటున్నట్లు తెలిసింది. తద్వారా నగరపాలక సంస్థ వీరికి ప్రతినెలా రూ.2.5 లక్షల చొప్పున ఏటా రూ.30 లక్షల మొత్తం ఖర్చు చేయడం గమనార్హం. నిజానికి పైన పేర్కొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పని మనుషులకు డబ్బులు చెల్లించే స్తోమత లేనివారు కాదు. పైగా ప్రొటోకాల్ ప్రకారం వీరిలో కొందరికి ప్రభుత్వమే చెల్లిస్తుంది. అయినప్పటికీ నగర పాలక సంస్థలో పనిచేసే శానిటేషన్ వర్కర్స్‌ను నియమించుకోవడం ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
 
వారికి ఈ విషయం తెలియదా?
నగర పాలక సంస్థలో పనిచేసే సానిటేషన్ వర్కర్స్‌ను తమ నివాసాల్లో పనికి వినియోగించుకుంటున్న విషయం కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషర్లకు తెలియదని, ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వం వారిని నియమించిందనే భావనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఓ కాంట్రాక్టర్ కమిషనర్‌కు ఫోన్ చేసి ఈ విషయం చెబుతూ నిలదీయడంతో అవాక్కైనట్లు తెలిసింది. సానిటేషన్ టెండర్ల కాంట్రాక్టర్లలో తానొక్కడినే అవినీతిపరుడంటూ చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహంతో ఉన్న ఆయన అమీతుమీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై కమిషనర్‌కు ఫోన్ చేసి సానిటేషన్ ద్వారా వచ్చే ఆదాయంలో ఎవరెవరికి ఎంతెంత ముడుతోంది? సానిటేషన్ వర్కర్లలో ఎవరెవరు ఏయే అధికారి, ప్రజాప్రతినిధి ఇంట్లో పనిచేస్తున్నారో చెబుతూ ‘ఇది అవినీతి కాదా?’ అని నిలదీసినట్లు సమాచారం.
 
దీంతో విస్తుపోయిన సదరు కమిషనర్ ప్రక్షాళనకు పూనుకున్నట్లు తెలిసింది. మరోవైపు నగర మేయర్, కమిషనర్ వాహనాలకు ఖర్చయ్యే డీజిల్, డ్రైవర్ల వేతనాలను సైతం కాంట్రాక్టరే చెల్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపైనా ఆరా తీస్తున్నట్లు సమాచారం. అట్లాగే వారి నివాసాల్లో నెలవారీ అవసరమయ్యే సరుకులు, నిత్యావసర వస్తువులకు కాంట్రాక్టరే డబ్బులు చెల్లిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అలాంటప్పుడు ప్రభుత్వం నుంచి విడుదలయ్యే డబ్బులు ఏమవుతున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. నగర పాలక సంస్థలో పనిచేసే సంబంధిత బాధ్యులను విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. 
 
ప్రతిరోజూ వంద మంది డుమ్మా !
నగర పాలక సంస్థలో పనిచేసే సానిటేషన్ సిబ్బందిలో సగటున ప్రతిరోజు వంద మంది విధులకు గైర్హాజరవుతున్నట్లు తెలుస్తోంది. హాజరు పట్టికలో మాత్రం అందరూ విధులకు హాజరవుతున్నట్లు రికార్డులు చూపుతున్నారని సమాచారం. ఇటీవల నగరంలో తనిఖీలకు వెళ్లగా ప్రతి పది మందిలోనూ ఆరుగురికి మించి పని చేయడం లేదని తెలిసింది. అయినా వారిని విధులకు హాజరైనట్లుగా చూపుతూ డబ్బులు కాజేస్తున్నట్లు తెలిసింది. ఈ లెక్కన ప్రతినెలా రూ.10 లక్షల చొప్పున ఏటా రూ.1.10 కోట్లు పక్కదారి పడుతున్నాయనే విమర్శలున్నాయి. ఇందులో సగం సొమ్ము కార్పొరేషన్‌కు చెందిన అధికారులు, కొందరు కార్పొరేటర్లకు వెళుతున్నాయనే ఆరోపణలున్నాయి.
 
మూలనపడ్డ బయోమెట్రిక్...
నగరపాలక సంస్థలో గతేడాది ఆగస్టు 27న ప్రారంభించిన బయోమెట్రిక్ విధానం మూలనపడింది. కార్మికులకు బయోమెట్రిక్ అమలు చేస్తే హాజరు పెరిగి కాంట్రాక్టర్లకు లాభాలు తగ్గుతాయని, కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులకు రావాల్సిన అమ్యామ్యాలు తగ్గిపోతాయనే ఉద్దేశంతో వాటికి సాంకేతిక కారణాలు చెప్పి మూలనపడేశారు. కార్మికుల వేలిముద్రలు మ్యాచ్‌కావడం లేదని, బ్యాటరీలు సరిగా పనిచేయడం లేదని, మిషన్లు మొరాయిస్తున్నాయనే సాకుతో పక్కనపెట్టిన కాంట్రాక్టర్లు, ఆ తర్వాత వాటిని ఏకంగా మూలన పడేశారు. దీంతో గత తొమ్మిది నెలలుగా వాటి వాడకమే లేకుండా పోయింది. దీంతో హాజరు ఇష్టారాజ్యమైంది. 
 
ఎక్కడెక్కడ పని చేస్తున్నారో లెక్కలు తీస్తున్నాం : మేయర్
నాకు క్వార్టర్ సౌకర్యం ఉన్నప్పటికీ సొంత ఇంట్లోనే ఉంటున్నా. ప్రభుత్వం ఇచ్చే వర్కర్లను ఉపయోగించుకోవడం లేదు. గత మేయర్లు వాడిన క్వార్టర్ అద్దె రూ.6.70 లక్షలు జెడ్పీకి చెల్లించాల్సి ఉంది. మున్సిపల్‌కు చెందిన ఒక అటెండర్, వర్కర్ క్యాంపు ఆఫీసులో పని చేస్తున్నారు. కాంట్రాక్టు కార్మికులు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారనే విషయమై లెక్కలు తీస్తున్నాం. డీజిల్ దుర్వినియోగం జరగకుండా గెజిటెడ్ ఆఫీసర్‌కు బాధ్యతలు అప్పగిస్తాం. బయోమెట్రిక్ విధానాన్ని జవాన్ల నుంచి తప్పించి సానిటరీ ఇన్స్‌పెక్టర్లకు అప్పగిస్తాం. 
 
వారం రోజుల్లో టెండర్లు పిలుస్తాం : కమిషనర్
సానిటేషన్ టెండర్లు వారం రోజుల్లో నిర్వహిస్తాం. రెండు మూడు రోజుల్లోనే టెండర్లు నిర్వహించా ల్సింది కానీ.. హరితహారంవల్ల కొంత ఆలస్యం జరుగుతోంది. వారధి ద్వారా ఈ ఒక్క నెల మాత్ర మే వేతనాలు చెల్లిస్తాం. కాంట్రాక్టర్లు, కార్పొరేటర్ల ఇండ్లలో కార్మికులు పనిచేస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. బయోమెట్రిక్ విధానాన్ని కచ్చితంగా అమలు చేసేందుకు ఆదేశాలు జారీచేశాం.
 
విశ్వసనీయ సమాచారం మేరకు ఎవరెవరి ఇంట్లో ఎంత మంది పనిచేస్తున్నారంటే..
 
 కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆరుగురు
 నగర మేయర్ రవీందర్‌సింగ్ నివాసంలో ఇద్దరు
 కమిషనర్ నివాసంలో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు వర్కర్లు
 ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు ఇంట్లో ఒకరు
 ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్ ఇంట్లో ఒకరు
 ఎమ్మెల్యే గంగుల నివాసంలో ఒకరు
 ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ ఇంట్లో ఒకరు
 ఎంపీ వినోద్‌కుమార్ నివాసంలో ఒకరు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement