కామారెడ్డి : పారిశుధ్య కార్మికులు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని, పరిశుభ్రతను అందించేందుకు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులు చీపుర్లు చేతపట్టుకుని ఫొటోలకు ఫోజులివ్వడం వారిని అబ్బురపరుస్తుంది. పల్లె నుంచి పట్టణాలు, నగరాలు, మహా నగ రాల దాకా ప్రతీ చోటా అందరికన్నా ముం దే రోడ్లపైకి వచ్చేది పారిశుధ్య కార్మికులే. తెలవారకముందే వారు తమకు కేటాయించిన ప్రాంతాలకు బయలుదేరుతారు.
మురికి కాలువలను శుభ్రం చేయ డం, రోడ్లను ఊడ్చడం, చెత్తను ఎత్తి ఆటోలు, ట్రాక్టర్లలో పోయండంలాంటి పనులు చేసే కార్మికులు నిత్యం అనేక సమస్యలను ఎదుర్కొంటుంటారు. మురికితో ముక్కుపుటాలు అదిరిపోతున్నా తమ విధులను నిర్వహిస్తుంటారు. ఒక్కోసారి మురికి కాలువల లో పశువులు, పందులు, కుక్కల కళేబరాలు ఉం టా యి. దుర్గంధం వెదజల్లుతున్నా ముక్కుకు గుడ్డ కట్టుకుని వాటిని బయటకు లాగుతారు. పట్టణాలకు దూరంగా తీసుకెళ్లి పడేస్తారు. రోడ్లపై దుమ్ము, ధూళిని ఊడ్చే సమయంలో నానా యాతన పడుతుంటారు. దగ్గు, తుమ్ములు వస్తున్నా ఆపుకుంటూ ఊడుస్తూనే ఉంటారు. చెత ్తకుండీలు కంపు కొడుతున్నా సరే అందులో నుంచి మొత్తం చెత్తను తొలగిస్తారు.
అరకొర వేతనాలు
సమాజానికి ఆరోగ్యాన్ని అందించేందుకు తమ జీవితాలను పణంగా పెట్టి కష్టించే కార్మికులకు అందే వేతనాలు అంతంతే ఉంటాయి. పట్టణాలలో అయితే మున్సిపా లిటీలు ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు ఇస్తాయి. పల్లెలలో కేవలం వెయ్యి నుంచి మూడు వేల రూపాయలు మాత్రమే అందుతాయి. పల్లె అయినా పట్టణమైనా సరే కార్మికులకు నెలనెలా వేతనాలు సక్రమంగా అందవు. కార్మికుల వేతనాలకు ప్రత్యేక బడ్జెట్ లేకపోవడంతో ప్రజలు చెల్లించే పన్నుల నుంచే వేతనాలు ఇస్తుంటారు. దీంతో బడ్జెట్ లేదంటూ వేతనాలు ఇవ్వడంలో ప్రతీసారీ జాప్యం జరుగుతూనే ఉంటుంది.
రోగాలే మిగిలేది
తెలవారకముందే పనిలో నిమగ్నమయ్యే పారిశుధ్య కార్మికులకు ఇచ్చే వేతనాలు అరకొరగానే ఉంటున్నా యి. ఇదే సమయంలో దుర్గంధం, మురికి మధ్యన నిత్యం జీవితాలను గడపడంతో వారు అనేక రకాల రోగాలబారిన పడుతుంటారు. కార్మికుల ఆరోగ్యం విషయంలో పాలకులు, అధికారులు ఏనాడూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో వారు అనేక రకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు.
అనారోగ్యంపాలైన కార్మికులకు వైద్య సహాయం అందించే విషయాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవు. ఎందరో కార్మికులు రోగాలతో ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. వైద్యం, మందులకయ్యే ఖర్చులకే సంపాదన నైవేద్యం లా ఖర్చు చేయాల్సి వస్తోందని పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
వారు నిజమైన సేవకులు
సమాజానికి స్వచ్ఛతనందించే పారిశుధ్య కార్మికులే నిజమైన సేవకులుగా సమాజంలో గుర్తింపు పొం దారు. నిత్యం సేవలందించే కార్మికులకు పండుగల సమయంలో చాయ్ నీళ్లకంటూ ఐదో, పదో రూపాయలిస్తూ ప్రజలు వారి సేవలను గుర్తిస్తుంటారు. ఎప్పుడైనా సమ్మెకు దిగితే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొనాల్సిందే. పా రిశుధ్య కార్మికులు లేని ప్రపంచాన్ని ఊహించుకోలేమన్నది సామాజిక కార్యకర్తల అభిప్రాయం. అందుకే వారి సంక్షేమం విషయంలో పాలకులు దృష్టి సారించి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది.
అటు సేవలు ఇటు రోగాలు
Published Sun, Nov 23 2014 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM
Advertisement
Advertisement