హైదరాబాద్ : పారిశుధ్య కార్మికులు సమ్మెబాట పట్టారు. జీహెచ్‌ఎంసీ సేవలన్నీ శుక్రవారం నుంచి నిలిచిపోయాయి. జీహెచ్‌ఎంసీ గుర్తింపు యూనియన్ జీహెచ్‌ఎంఈయూ పిలుపు మేరకు ‘గ్రేటర్’లో పనిచేస్తున్న సిబ్బందిలో దాదాపు ఇరవైవేల మంది నిరవధికంగా విధులకు డుమ్మాకొట్టి సమ్మెలో పాల్గొన్నారు. ఫలితంగా చెత్త తరలింపు.. వీధులూడ్చటం.. దోమల నివారణ మందులు చల్లడం.. తదితర సేవలన్నీ స్తంభించాయి.
మునిసిపల్ పరిపాలన, పట్ణణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ మేరకు ఈ నెల 10వ తేదీ నాటికి ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనం నెలకు రూ.16,500కి పెంచే విషయంతో పాటు, మెగాసిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ తదితర హామీలు అమలుకు నోచుకోనందున గురువారం అర్థరాత్రి నుంచే సమ్మెలో పాల్గొన్నారు.
జీహెచ్‌ఎంసీ ఉద్యోగులందరికీ హెల్త్‌కార్డులు, పారిశుధ్య విభాగంలో శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్, ఈఎఫ్‌ఏలకు ఇంధన అలవెన్సు, కార్మికులకు మాస్కులు, గ్లౌజులు, రెయిన్‌కోట్లు, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్, ఇన్సూరెన్స్ సదుపాయాలు తదితరమైనవి యూనియన్ డిమాండ్లలో ఉన్నాయి.
మరోవైపు సర్వసభ్య సమావేశంలో తమకు జరిగిన అవమానానికి నిరసనగా జీహెచ్‌ఎంసీ ఇంజనీర్లు ప్రారంభించిన నిరసన కొనసాగుతోంది. నిన్నసామూహిక సెలవులతో విధులకు హాజరుకాని ఇంజనీర్లు.. నేడు కూడా సామూహిక సెలవు పెట్టి గైర్హాజరు కానున్నట్లు సమాచారం.