‘సఫాయీ’ల ఆకలి కేకలు!
వేతనాల్లేక పస్తులుంటున్న బడుగు కుటుంబాలు
సాక్షి, హైదరాబాద్: పారిశుధ్య కార్మికుల ఇళ్లల్లో పొయ్యి వెలగడం లేదు. పప్పు కూడు తిందామన్నా అప్పు పుట్టడం లేదు. మునిసిపాలిటీలు చెల్లించే చాలీచాలని వేతనాలూ ఆగిపోవడంతో కార్మికుల బతుకులు దుర్భరంగా మారాయి. దుఃఖాన్ని కడుపులో దాచుకుని పస్తులతో రోజులు గడుపుతున్నారు. నిన్నటి దాకా చీపురు పట్టి ఊడ్చిన చోటే చేతులు చాచి యాచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పాలక, ప్రతిపక్షాల ఆధిపత్య రాజకీయాల మధ్య పారిశుధ్య కార్మికులు నలిగిపోతున్నారు.
గుండెలు పగిలే ఆవేదనతో మరణాలకు చేరువవుతున్నారు. ఆత్మహత్యాయత్నం లాంటి అఘాయిత్యాలకూ పాల్పడుతున్నారు. అయినా సర్కారు కనికరించడం లేదు. కనీస వేతనంపై నోరు విప్పడం లేదు. సమ్మెకు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు, మద్దతు తెలిపిన విపక్షాలు బెట్టు వీడడం లేదు. కనీస వేతనాల పెంపు సహా 16 డిమాండ్ల సాధన కోసం గతనెల 6 నుంచి మున్సిపల్ తాత్కాలిక కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారానికి 36వ రోజుకు చేరింది.
ప్రభుత్వ చొరవతో గ్రేటర్ హైదరాబాద్‌లో కార్మికులు సమ్మె విరమించినా.. రాష్ట్రంలోని ఇతర 67 నగర, పురపాలికలు, నగర పంచాయతీల్లో సమ్మె కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14 వేల మంది కార్మికులు సమ్మెలో ఉన్నారు. అందులో 90 శాతం కార్మికులు దళితులు, అభాగ్య మహిళలే. భర్తలను కోల్పోయి ఏ దిక్కు లేక సఫాయి పనులు చేస్తున్న మహిళలే ఎక్కువగా ఉన్నారు.
నిర్ణయాధికారమే లేదట..
జీహెచ్‌ఎంసీ కార్మికుల వేతనాలను పెంచుతున్నట్లు గతనెల 16న సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. 17న ఇతర మున్సిపాలిటీల్లోని కార్మికుల వేతనాల పెంపుపై అధికారులతో సమీక్షించారు.
పెంపు సాధ్యాసాధ్యాలపై అధికారులు ప్రతిపాదనలు సమర్పిస్తే.. ఆ మరుసటి రోజే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. సీఎం ఆదేశాల మేరకు పురపాలక శాఖ ప్రతిపాదనలు సమర్పించినా.. ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.
మున్సిపాలిటీల ఆర్థిక పరిస్థితి క్షీణించి ఉండడంతో కార్మికుల వేతనాల పెంపు సాధ్యం కాదని గతనెల 23న సీఎంవో ప్రచార విభాగం ఓ అనధికార ప్రకటన జారీ చేసింది. ఆస్తి పన్నులు పెంచక తప్పదని సంకేతాలిచ్చింది. ఆ రోజు నుంచి ఇప్పటివరకు సమ్మె పరిష్కారం విషయంలో ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు.
సమ్మె విరమిస్తే వేతనాలు పెంచుతామని గతనెలలో ప్రకటన చేసిన ప్రభుత్వం.. నిర్ణయం తీసుకునే అధికారమే తమకు లేదని తాజాగా ప్రకటించడంతో కార్మికుల్లో ఆందోళన తీవ్రమవుతోంది. కార్మిక సంఘాలతో విభేదాల నేపథ్యంలో కార్మికులతో నేరుగా చర్చలు జరిపి సమ్మెను పరిష్కరించే అంశంపై అయినా ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంది.
పిల్లలతో పస్తులుంటున్న
15 ఏళ్లుగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న. జీతం చాలడం లేదని సమ్మెకు దిగాం. జీతం ఆగిపోయింది. పిల్లలతో పస్తులుంటున్న. నా భర్త చనిపోయాడు. కుటుంబ పోషణ భారం నాపైనే ఉంది. సఫాయి పనిచేస్తూ పిల్లలను సదివిస్తున్నా. ఇంటి అద్దె కట్టాలి. మార్కెట్ ఊడ్చితే వ్యాపారులు కూరగాయలు ఇచ్చేవారు. అవి కూడా రావడం లేదు.
- బాలమణి, పారిశుధ్య కార్మికురాలు, సంగారెడ్డి
అప్పు కూడా పుట్టడం లేదు..
జీతం రాక, అప్పు పుట్టక కుటుంబ పోషణ భారంగా మారింది. పస్తులతో కాలం గడుపుతున్నాం. పిల్లల చదువులకు డబ్బుల్లేక సర్కారు బడిలో వేశా.
-సునంద,పారిశుధ్య కార్మికురాలు,సంగారెడ్డి