పండగ వేళ జీతాల్లేవ్‌! | No Wages For GHMC Employees | Sakshi
Sakshi News home page

పండగ వేళ జీతాల్లేవ్‌!

Published Fri, Oct 4 2019 10:52 AM | Last Updated on Sat, Oct 12 2019 1:29 PM

No Wages For GHMC Employees - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: నాలుగు రోజుల్లో దసరా పండగ.. విద్యార్థులకు సెలవులు కూడా. పండగకు ఊరెళ్లేముందే నగరంలో దుస్తులు, ఇతర వస్తువులు కొనుక్కొని వెళ్లవచ్చుననుకున్న జీహెచ్‌ఎంసీ రెగ్యులర్‌ ఉద్యోగులకు ఊహించని శరాఘాతం తగిలింది. ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు తీసుకునే వీరికి అక్టోబర్‌ 3వ తేదీ నాటి కూడా అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ విజయ దశమి ఆనందం వారి కుటుంబాల్లో కనిపించే పరిస్థితి లేదు.  జీహెచ్‌ఎంసీ ఆదాయం ఏ మాత్రం తగ్గలేదు. ప్రజల నుంచి వసూలవుతున్న పన్నులు గతంలో కంటే ఎక్కువే ఉన్నాయి. అయితే,  ఇబ్బడిముబ్బడిగా పెరిగిన ఖర్చుతో ఏరోజుకారోజు అన్న చందంగా బల్దియా నెట్టుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఒకటో తేదీన జీతాలందించేందుకు ఖజానాలో తగిన నిధులు లేకపోవడంతో విడుదల చేయలేదు. రెండో తారీఖు సెలవు. కనీసం మూడో తేదీనైనా అందుతాయనుకున్న రెగ్యులర్‌ ఉద్యోగులకు ఆ ఆశ తీరలేదు. జీహెచ్‌ఎంసీ ఏర్పాటయ్యాక ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురవలేదు. జీహెచ్‌ఎంసీలో జీతాల చెల్లింపులకు ప్రతినెలా దాదాపు రూ.110 కోట్లు కావాలి. సోమవారం వరకు ఖజానాలో దాదాపు రూ.60 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకటోతేదీ జీతాలు విడుదల కాలేదు. కనీసం గురువారమైనా అందుతాయేమోనని ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురైంది. రాత్రి 8 గంటల వరకు జీతాలు ఉద్యోగుల  బ్యాంకు ఖాతాల్లో పడలేదు. 

గొప్పకు పోయి ఇక్కట్లు  
ఒకప్పుడు మిగులు నిధులతో, బ్యాంక్‌ డిపాజిట్లతో కళకళలాడిన జీహెచ్‌ఎంసీ.. ఎస్సార్‌డీపీలో భాగంగా చేపట్టిన రూ.వేల కోట్ల పనులకు బాండ్ల ద్వారా అప్పులు తీసుకుంటోంది. దీంతో వాటి వడ్డీతో సహా అసలు చెల్లించాల్సి రావడం, ఇతరత్రా పనుల ఖర్చులు పెరిగిపోవడం.. ఔట్‌సోర్సింగ్‌పై వందల సంఖ్యలో నియామకాలు వంటి కారణాలతో ఖర్చులు పెరిగాయి. ఆదాయం కూడా పెరిగినా ఖర్చులు దానికంటే అధికంగా పెరిగాయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్‌ఎంసీలో రూ.312 కోట్ల బ్యాంక్‌ డిపాజిట్లున్నాయి. ఆర్టిసీకి నష్టాలు రావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ నుంచి రెండు విడతల్లో రూ.330 కోట్లు చెల్లించారు. రూ.495 కోట్లు బాండ్ల ద్వారా సేకరించారు. వాటికి నెలనెలా వడ్డీ, ఆర్నెళ్లకోమారు అసలు వాయిదాల చెల్లింపులు, ఔట్‌సోర్సింగ్‌పై తీసుకున్న దాదాపు 400 మంది ఇంజినీర్ల వేతనాలు.. స్వచ్ఛ ఆటోల కొనుగోళ్లకు నెలనెలా బ్యాంకు రుణాల చెల్లింపు.. ఇలాంటి కారణాలతో జీహెచ్‌ఎంసీపై ఆర్థిక భారం పెరిగింది. మరోవైపు ప్రభుత్వం నుంచి ఎలాంటి గ్రాంట్లు అందడం లేదు. ఈ పరిస్థితుల్లో కొంతకాలంగా ఏనెలకానెల అన్నట్లుగా నెట్టుకొస్తున్నారు. 

వసూళ్లను మించిన ఖర్చులు
వాస్తవానికి గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లు పెరిగాయి. గత సంవత్సరం సెప్టెంబర్‌లో రూ.26 కోట్ల  ఆస్తి పన్ను వసూలు కాగా, ఈసారి రూ.68 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.1402 కోట్లు వసూలవగా, ఈసారి ఆరు నెలల్లోనే రూ.876 కోట్లు వసూలయ్యాయి. అయినా ఖర్చులు పెరిగిపోవడం వల్లే ఒకటోతేదీన జీతాలందని పరిస్థితి ఎదురైంది.   వివిధ పనుల బిల్లుల చెల్లింపుల్లోనూ జాప్యం జరుగుతోంది. జోన్లలో జరిగిన పనులకు ఆగస్టులో చెల్లించాల్సిన బిల్లులు దాదాపు రూ.55 కోట్లు సెప్టెంబర్‌ నెలాఖరులో చెల్లించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు రాకపోవడంతో దాదాపు రూ.500 కోట్ల బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. మరో రూ.300 కోట్ల బిల్లులు రెడీగా ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement