శుక్రవారం సిద్దిపేటలో పారిశుధ్య కార్మికులతో కలసి టిఫిన్ చేస్తున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని తెలిపారు. శుక్రవారం ఆయన సిద్దిపేటలో పారిశుధ్య కార్మికుల మధ్య మే డే వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత మేరకు విజయం సాధించిందన్నారు. డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. పారిశుధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు అందచేశామని, బీమా సౌకర్యం కూడా కల్పించామన్నారు. తెలంగాణలోని సగం మంది మహిళలు బీడీ కార్మికులుగా కుటుంబాలను పోషించుకుంటున్నారని చెప్పారు. గతంలో నేతన్నల ఆకలి చావులు, ఆత్మహత్యలు ఉండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా బీడీ,, చేనేత, గీత కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. ఆటో డ్రైవర్లకు కూడా ప్రభుత్వం రాయితీలు కల్పించిందని మంత్రి వివరించారు.
హరీశ్ ఆరోగ్య చిట్కా
నిత్యం అపరిశుభ్రమైన వాతావరణంలో పనులు చేసే పారిశుధ్య కార్మికుల ఆరోగ్యంపై మంత్రి హరీశ్‌రావు దృష్టి పెట్టారు. వారికి ఆరోగ్య చిట్కాను ఉపదేశించారు. ప్రతి కార్మికుడు రోజుకు మూడు సార్లు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం పిండుకొని తాగాలని సూచించారు. అయితే.. ఉదయం ఇంటి నుంచి వచ్చే తమకు బయట మంచినీళ్లు పోసే వారే తక్కువ.. అందునా గోరువెచ్చని నీళ్లు ఎలా వస్తాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన మంత్రి.. ప్రతి కార్మికుడికి ప్లాస్కును అందచేశారు. ఈ ప్లాస్కులో ఉదయం వేడి నీరు పోసుకొని పనికి రావాలని చెప్పారు. ఆరోగ్య చిట్కా చెప్పడమే కాకుండా అందుకు కావాల్సిన ప్లాస్కును ఇచ్చిన హరీశ్‌రావుకు పారిశుధ్య కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment