రూ.లక్ష కొట్టు... చీపురు పట్టు | Sweeper to the huge demand for jobs | Sakshi
Sakshi News home page

రూ.లక్ష కొట్టు... చీపురు పట్టు

Published Sun, Jul 19 2015 3:36 AM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM

రూ.లక్ష కొట్టు... చీపురు పట్టు

రూ.లక్ష కొట్టు... చీపురు పట్టు

♦  స్వీపర్ ఉద్యోగాలకు భారీ డిమాండ్
♦ ఒక్కో దానికి రూ.లక్ష వంతున వసూలు
♦ జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య విభాగంలో అక్రమాలు
 
 సాక్షి, సిటీబ్యూరో : అన్నా రూ.50 వేలిస్తా.. కుదరు.్ద రూ.లక్ష కావాల్సిందే. అంత ఇచ్చుకోలేనన్నా.. రూ.70 వేలు చేసుకో.పోవయ్యా పో. ఇది వరకే లక్ష తీసుకునేటోళ్లం. అందులో పెద్దసార్లకు పోనూ నాకు మిగిలేది రూ.15 వేల నుంచి రూ. 20 వేలే. ఇప్పుడింక జీతాలు పెరిగినయ్ తెలుసుగా. ఏమనుకున్నావ్? రూ.2 లక్ష లు ఇస్తామని వస్తున్నారు.

 ... ఇదీ జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మిక ‘పోస్టు’ల రేటు. ఉద్యోగం కావాలని అడుగుతున్న వారికి.. కార్మికుల విధులను పర్యవేక్షించే ఎస్‌ఎఫ్‌ఏ (శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్)ల మధ్య జరుగుతున్న బేరం.

 .... సమ్మె సందర్భంగా విధులకు రాని కార్మికులను తొలగించి... కొత్త వారిని తీసుకుంటామని సీఎం కేసీఆర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ స్పష్టం చేయడంతో... ఈ పోస్టులకు డిమాండ్ భారీగా పెరిగింది. సాధారణ రోజుల్లోనూ రూ.50 వేల డిమాండ్ ఉన్న ఈ పోస్టులకు ఇప్పుడు రూ.లక్షకు త గ్గడం లేదు. జీతాల పెంపుతో బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. పెరిగిన వేతనం మేరకు ఒక్కో కార్మికునికి/కార్మికురాలికి నెల వేతనం రూ.12,500. అంటే రూ.లక్ష వెచ్చించి... పనిలో చేరినా దాదాపు ఏడాదిపాటు  కష్టపడితే గానీ పెట్టుబడి రాదు. రెక్కలు ముక్కలు చేసుకునే పనికి  ఎందుకింత డిమాండ్ అంటే...

  పేరుకు 8 గంటలైనా... 2 గంటలు మాత్రమే పని చేస్తారు. మిగతా సమయంతా వేరే పని చేసుకోవచ్చు. ఎస్‌ఎఫ్‌ఏ అండదండలు ఉంటాయి కనుక అడిగే వారుండరు.  

  కొంతమంది బినామీలను పెట్టుకుంటారు. వచ్చే వేతనంలో రూ.4 వేల నుంచి 5 వేలు మాత్రం వారికి ఇస్తారు. మిగతాదంతా వీరికి ఉచితంగా అందుతున్నట్లే. ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి సదుపాయాలన్నీ తమ పేరిటే ఉంటాయి.

  ఇంకో తరహా వారున్నారు. రెండు చోట్ల ఔట్‌సోర్సింగ్ లో పని చేస్తుంటారు. అలా ఈ వేతనం వారికి అదనం.

  ఎస్‌ఎఫ్‌ఏ.. వారిపైన ఉండే ఏఎంఓహెచ్ (అసిస్టెంట్ మెడికల్ ఆఫ్ హెల్త్)/ డిప్యూటీ కమిషనర్ వంటి వారి అండదండలతో పనిచేసేది ఒకే షిప్టులో అయినా రెండు షిప్టుల్లో పేరుంటుంది. రెండు వేతనాలు అందుతాయి. వాస్తవానికి ఏ షిప్టులోనూ పనిచేయకుండా బినామీలను పెడుతూ వేతనాలు పొందుతుంటారు.

  సాధారణ షిప్టుల్లో కాకుండా సర్కిల్‌కు ఒక మొబైల్ బృందం ఉంటుంది. అత్యవసర సమయాల్లో.. పండుగల సందర్భాల్లో ఎక్కువ చెత్త పేరుకుపోయినప్పుడు ఎక్కడ అవసరమైతే అక్కడ పనిచేసే బృందమన్న మాట. వీరు పనిచేసేదే అరుదు. వీరసలు ఎక్కడ ఉంటారో .. ఏం పనిచేస్తారో ఎస్‌ఎఫ్‌ఏ/ఏఎంఓహెచ్‌లకు మాత్రమే తెలుసు.

  మరికొందరి పద్ధతి వేరు. ఒక ఏరియాలో పారిశుద్ధ్య కార్మికునిగా నమోదై ఉంటారు. అదే ప్రాంతంలో సొంత దుకాణం/వ్యాపారం నిర్వహిస్తుంటారు. ఎప్పుడైనా.. ఎవరైనా తనిఖీలకు వస్తే ‘ఇక్కడే ఉన్నా’.. అంటూ పరుగున వచ్చేస్తారు.

 .... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వ్యవస్థలోని లొసుగులకు అంతే లేదు. వీటి గురించి పూర్తిగా తెలిసేది ఎస్‌ఎఫ్‌ఏకే కనుక ఆయనను మచ్చిక చేసుకుంటే చాలు... పని ‘సులువైపోతుంది.’  

 .... ఎస్‌ఎఫ్‌ఏలంటే వీరికంటే పెద్ద అర్హతలున్నవారు కాదు. కార్మికుల్లో ఒకరిని ఎస్‌ఎఫ్‌ఏగా నియమిస్తారు. గ్రూపులో ఏడుగురు సభ్యులు ఉంటారు. ఇలాంటి మూడు బృందాల పనిని ఎస్‌ఎఫ్‌ఏ పర్యవేక్షిస్తాడు. మిగిలిన వారికంటే రూ.వెయ్యి అదనంగా ఇస్తారు.   వీరి వైభోగం చెప్పనలవి కాదు. త న పరిధిలోని మూడు గ్రూపుల్లో ఉండాల్సిన 21 మంది కార్మికుల్లో ఒక్కరోజూ పూర్తి స్థాయిలో విధులకు హాజరు కారు. 14 లేదా 15 మంది మాత్రమే ఉంటారు. మిగిలిన వారు రాకపోయినా పూర్తి హాజరు వేస్తారు. ఆ జీతాలు ఆయనే అందుకుంటాడు. అందులో ఏఎంఓహెచ్‌లు/డీఎంసీలకు వాటాలు చెల్లిస్తారు. అంతేకాదు.

 ఎస్‌ఎఫ్‌ఏల ఇబ్బందులివీ...
 ఇక ఎస్‌ఎఫ్‌ఏగా కొనసాగాలంటే ఏఎంఓహెచ్/ డీఎంసీ/ ఇతరత్రా ‘పెద్దసార్లు’ చెప్పిన పని చేయాలి. విధుల్లోలేని ఆరేడుగురికి హాజరు వేసినందుకు ఆ జీతాల్లో వాటాలు పంచాలి. కొందరు తమ ఇంటికి అవసరమయ్యే మాంసం/చేపలు వంటి వాటితోపాటు సీజన్‌ను బట్టి పండ్లు తదిరమైనవి సరఫరా చేయాలి. ఆదివారాల్లో ఈ కోటాలు అదనం. కార్పొరేటర్ల హయాంలో వారి కోసం ఏర్పాటు చేసుకున్న గ్రూ పులు కాగి తాల మీదే ఉండేవి. గ్రూపులోని కార్మికుల వేతనాలన్నీ కార్పొరేటర్లకు, అధికారులకు, ఎస్‌ఎఫ్‌ఏలకు వెళ్లేవి.

 పెద్దల కనుసన్నల్లోనే...
 ఈ సంగతి తెలియదా అంటే... అందరికీ తెలుసు. కానీ చర్యల్లేవు. ఎవరి అవసరాలు వారివి. గట్టిగా అడ్డుకుందామంటే సచివాలయం స్థాయి నుంచి ఆదేశాలు. స్థానిక ఎమ్మెల్యేల నుంచి హుకుంలు. వీరిలో దాదాపు 20 శాతం నియామకాలు వారి సిపాసులతో జరిగేవే. అందుకే తమ అనుచరుల కోసం.. వారి సంబంధీకుల కోసం వారే ఫోన్లు చేసి ఈ పోస్టులు ఇప్పిస్తారు.

 రాకపోయినా వచ్చినట్టే...
  తాజా సమ్మె నేపథ్యంలో ధర్నాలో పాల్గొన్నప్పటికీ పలువురు విధుల్లో ఉన్నట్టు హాజరు నమోదైంది.

  తొలగింపు హెచ్చరికల నేపథ్యంలో విధుల్లో ఉన్న వారి పేర్ల కోసం భారీ డిమాండ్ పలుకుతోంది. ఉద్యోగం ఉండాలంటే... ఎలాగైనా హాజరు వేయాల్సిందిగా వేడుకుంటున్నారు. మరో రకం దందా నడుస్తోంది. కార్మికుల  పేర్లు వేసేదీ.. తీసేది ఎస్‌ఎఫ్‌ఏలే కనుక ఇప్పటికే బోగస్‌లుగా ఉన్నవారి స్థానంలో తమను నియమించాల్సిందిగా పలువురు వారి వెంట పడుతున్నారు. సమ్మె సందర్భంగా ఎలాగైనా ఎక్కువ మందిని విధుల్లోకి రప్పించాల్సిందిగా పైనుంచి ఆదేశాలు అందడంతో.. ఎవరు పడితే వారిని పనిలోకి తెచ్చారు. అసలు కార్మికుల స్థానే అందుబాటులో ఉన్నవారిని వినియోగించారు. ‘ఇప్పుడు మీకు ఉద్యోగం ఖాయమవుతుంద’ం ంటూ వారి నుంచీ లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

  కార్మికులు వీధులు శుభ్రపరచినట్లు కార్పొరేటర్లు ధ్రువీకరించాలని గతంలో ఓ తీర్మానం చేశారు. నిజంగా వీధులు శుభ్రపడేందుకు కాదు. కార్పొరేటర్ల జేబులు నిండేందుకు. పని చేయని వారిని చూసీ చూడనట్లు వదిలేసేందుకు. అదనపు వాటా కోసం. ఇవన్నీ బహిరంగ విషయాలే. చర్చల సందర్భాల్లో వెల్లడైన అంశాలు. అయినప్పటికీ అధికారులకు కనిపించదు. ఎవరిపైనా చర్యలుండవు. ఎందుకంటే వారే సమాధానం చెప్పాల్సి వస్తుంది. అదీ కథ.

 జేబుల్లోకి జీహెచ్‌ఎంసీ డబ్బు
 బోగస్‌లు, డూప్లికేట్లు.. ఇతరత్రా దాదాపు 5 వేల మందికి పని చేయకుండానే వేతనాలు అందుతున్నాయి. ఈ మొత్తం వ్యక్తుల జేబుల్లోకి వెళుతోంది. నెలకు సగటున ఒక్కొక్కరి వేతనం రూ.8 వేలుగా లెక్కించుకున్నా రూ.4 కోట్ల వరకూ జీహెచ్‌ఎంసీ సొమ్ము రాబందుల పాలవుతోంది.
 
 మూన్నాళ్ల ముచ్చటే..  
 అవకతవకల నిరోధానికి... కార్మికులు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారు? ఏ వీధిలో చెత్త ఎంత ఉంది? అనే అంశాలను కార్యాలయాల్లోని కంప్యూటర్ల నుంచే ఉన్నతాధికారులు వీక్షించేలా ప్రవేశపెట్టిన ఓఎస్సార్టీ సాంకేతిక విధానాన్ని అటకెక్కించారు. హాజరు కోసం బయోమెట్రిక్‌ను అట్టహాసంగా ఒక సర్కిల్‌లో ప్రారంభించారు. అదీ అతీగతీ లేకుండా పోయింది. ఇలా .. ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చినా వెంటనే అటకెక్కిస్తారు. ఎందుకంటే... వాటి వల్ల అందరికీ నష్టమని.
 
  అధికారం వారిదే...
 గ్రూపులో ఎవరైనా నచ్చకపోతే తొలగిస్తారు. తొలగింపు.. నియామక అధికారాలు వీరివే. కొత్తగా నియమించుకున్నవారి నుంచి వారి అవసరం.. ఆయన దర్పాన్ని బట్టి కనిష్టంగా రూ.50 వేల నుంచి ఎంత వీలైతే అంత ఎక్కువగా దండుకుంటాడు. మహిళా కార్మికులపై కన్నేస్తే సతాయింపులు మామూలే. తమ మాట వినని వారిని ఏదో వంకతో తప్పిస్తారు. కుటుంబ పరిస్థితులు, ఆర్థికావసరాలతో చాలా విషయాలను బాధితులు వెల్లడించరు. నెలనెలా వేతనాల్లోనూ మొత్తం జీతం కార్మికులకు అందదు. వారి ఏటీఎం కార్డులు ఎస్‌ఎఫ్‌ఏల వద్దే ఉంటాయి. కేవలం జీతం డబ్బులు డ్రా చేసేందుకు కార్మికులనూ యంత్రాల్లానే వినియోగించుకుంటారు. వచ్చే మొత్తంలో రూ.వెయ్యి, రూ.రెండు వేలు తగ్గించి ఇస్తారు. ఇంతటి ‘అధికారాలున్న’ ఎస్‌ఎఫ్‌ఏ పోస్టులకు మరింత డిమాండ్ ఉంటోంది. ప్రస్తుతం కనిష్టంగా రూ.2 లక్షలు పలుకుతున్నాయి.  
 
 పక్కాగా ఉండాలని...
 వివిధ విభాగాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ విధుల్లోని కార్మికుల వివరాలను ఆయా వీధుల్లో బోర్డులపై ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎవరైనా... ఏ వీధినైనా శుభ్రపరచకుంటే సంబంధిత అధికారికి ఫిర్యాదు చేసేలా ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచుతామన్నారు. దీనిపైఎందుకనో పెద్దగా శ్రద్ధ చూపలేదు. ప్రస్తుతం ఈ వ్యవస్థపై సీరియస్‌గా ఉన్నారు. ఆధార్ అనుసంధానంతో సహా బయోమెట్రిక్, బ్యాంకు అకౌంట్లు తదితరమైనవన్నీ పక్కాగా అమలు చేస్తామంటున్నారు.
 
 మాయల్లో మచ్చుకు కొన్ని..
 సర్కిల్-9లో ఒక పారిశుద్ధ్య కార్మికుడు కొంతకాలం క్రితం మరణించాడు. పీఎఫ్ డబ్బులు, దహన సంస్కారాల కోసం ఇచ్చే ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకుంటే... కార్మికుడు మరణించలేదని, అతని పేరిట ఎలా ఇస్తామని అధికారులు ఎదురు ప్రశ్నించారు. మరణించాక దాదాపు ఏడు నెలలపాటు ఆయన పేరిట నెలనెలా పీఎఫ్ జమవుతోందన్నారు. అంటే విధుల్లో ఉన్నట్లే లెక్క. పీఎఫ్ జమ అయిందంటే నెలనెలా వేతనం కూడా పొందాడు. మరి ఈ మొత్తం ఎవరి జేబుల్లోకి వెళ్లింది..? మరణించినప్పటికీ ఆయన ఎలా జీవించగలిగాడో సంబంధిత అధికారులకే తెలియాలి.

 కంచన్‌బాగ్ పరిసరాల్లోని ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో స్వీపర్‌గా ఔట్‌సోర్సింగ్‌పై పని చేస్తున్న ఓ వ్యక్తి జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య గ్రూపుల్లోనూ స్వీపర్‌గా వేతనాలు పొందుతున్నాడు. ఏళ్ల తరబడి ఈ తంతు సాగుతోంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షిప్టు అయినప్పటికీ.. ఎస్‌ఎఫ్‌ఏ చలువతో ఉదయం 8 గంటలకు వెళ్లిపోయి... 10 గంటల నుంచి ప్రభుత్వరంగ సంస్థలో పని చేస్తాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement