సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే రోజున పారిశుధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. పారిశుధ్య కార్మికుల జీతం రూ.వెయ్యి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారిశుద్ధ్య కార్మికులందరికీ నెల నెలా అందే జీతంతోపాటు పెరిగిన రూ.1000 కూడా అందుతుందని సీఎం తెలిపారు. తక్షణమే ఈ పెంపు అమలులోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది కార్మికులకు లబ్ధి చేకూరనుంది.
జీహెచ్‌ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్‌తో పాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీల్లో పని చేస్తూ ప్రస్తుతం జీతం అందుకుంటున్న పారిశుధ్య కార్మికుల వేతనాలు పెరగనున్నాయి. సీఎం కేసీఆర్ నిర్ణయంపై పారిశుధ్య కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల జీతాలను సైతం పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వేతనాల పెంపునకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆర్థికశాఖను ఆదేశించారు.
చదవండి: Video: కొత్త సచివాలయానికి రేవంత్ రెడ్డి.. అడ్డుకున్న పోలీసులు
పాలమూరు -రంగారెడ్డి పథకంపై సమీక్ష
కాగా, కొత్తగా నిర్మించిన సచివాలయంలో తొలిసారి సీఎం కేసీఆర్ పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సుప్రీంకోర్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తాగునీటి పనులను కొనసాగించేందుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన పనుల పురోగతిపై సీఎం చర్చించారు. జులై వరకు కరివెన జలాశయంకు నీళ్లు తరలించాలని, ఆగస్ట్ వరకు ఉద్దండాపూర్ వరకు నీటిని ఎత్తిపోయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నార్లపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ జలాశయాల మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని.. పంప్‌హౌస్‌లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, కన్వేయర్ సిస్టమ్‌లోని పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాలమూరు జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పనులకు సంబంధించిన పురోగతిపై సమీక్షించారు. మిగిలిన కొద్దిపాటి పనులను ఈ జూన్ లోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం సూచించారు.
ఇళ్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు!
హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని మున్సిపాలిటీ పరిధిలోని పేదల ఇళ్ల నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా.. నిబంధనల మేరకు ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించి, న్యాయమైన హక్కులను కల్పించినట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు నోటరీ స్థలాలను జీవో 58-59 ప్రకారం క్రమబద్ధీకరించుకునేందుకు మరో నెల రోజులు గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
చదవండి: ఎమ్మెల్సీ కవితపై కీలక అభియోగాలు మోపిన ఈడీ.. తెరపైకి భర్త అనిల్ పేరు..
Comments
Please login to add a commentAdd a comment