సాక్షి, అమరావతి: అమ్మవారి సేవాభాగ్యం దొరుకుతుందంటే ఆశగా వచ్చిన డ్వాక్రా మహిళలను పారిశుద్ధ్య పనుల్లో నియమించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునిసిపల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో పలుచోట్ల పట్టణ ప్రాంతాల్లో పేరుకుపోతున్న చెత్త తొలగింపు కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలను నియమించింది. దసరా ఉత్సవాలు జరుగుతున్న విజయవాడ కనకదుర్గ గుడి వద్ద కొందరు డ్వాక్రా మహిళలకు వ్యర్థ్యాల తొలగింపు, పారిశుధ్యం బాధ్యతలు అప్పగించడంతో అలవాటు లేని పనులు చేయలేక అవస్థలు పడుతున్నారు.
విజయవాడ, విశాఖలో పారిశుద్ధ్య పనులకు డ్వాక్రా మహిళలు
పట్టణ ప్రాంతాల్లో దాదాపు 20 లక్షల మంది డ్వాక్రా మహిళలున్నారు. మునిసిపల్ కార్మికుల సమ్మెతో పరిస్థితులు క్షీణించిన చోట ఎంపిక చేసిన డ్వాక్రా మహిళలకు పారిశుద్ధ్య పనుల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని మెప్మా ఉన్నతాధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో ఉన్నతస్థాయి ఆదేశాలతో పలు మున్సిపాలిటీల్లో డ్వాక్రా మహిళలను పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ ఒత్తిడి చేస్తున్నారు.
పట్టణ ప్రాంతాల్లో కొన్ని మురికివాడలను ఎంపిక చేసుకొని అందులోని డ్వాక్రా సంఘాల సభ్యులను తాము చెప్పినట్లుగా పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొనకుంటే బ్యాంకు రుణాలు అందకుండా చేస్తామంటూ బెదిరిస్తున్నారని కొందరు మహిళలు ‘సాక్షి’ ప్రతినిధికి వెల్లడించారు. దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ గుడి పరిసరాలు, ఇతర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు తెనాలి నుంచి పలువురు డ్వాక్రా మహిళలను తరలించారు.
విశాఖపట్నంలో కూడా పారిశుద్ధ్య పనుల కోసం జిల్లాలోని పలు మున్సిపాలిటీల నుంచి డ్వాక్రా మహిళలను ప్రత్యేక వాహనాల ద్వారా పారిశుద్ధ్య పనులకు తరలించడం గమనార్హం. సొంత ప్రాంతాల్లో పనులు చేసేందుకు నిరాకరించే వారిని ఇతరచోట్లకు పంపి పారిశుద్ధ్య పనుల కోసం పురమాయిస్తున్నారు. ఇందుకు అంగీకరించకుంటే రుణాలు ఇచ్చేది లేదని బెదిరిస్తున్నారు.
అలవాటు లేని పనులు చేయలేక అవస్థలు
‘అమ్మ’ సేవ కోసం వచ్చిన మహిళలతో క్యూ లైన్ల నిర్వహణ, ప్రసాదం పంపిణీ, ఉచిత అన్నదానం తదితర పనులు కాకుండా మురుగు కాల్వల్లోని సిల్టు, వీధుల్లో చెత్తాచెదారం ఊడ్చే పనులు చేయిస్తున్నారు. మరోవైపు రోజుకు రూ.500 ఇస్తామంటూ గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యవసాయ కార్మికులను తీసుకొచ్చి రూ.200 మాత్రమే ఇస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. ఉచిత భోజనం, వసతి కల్పిస్తామన్న అధికారులు తీరా ఇక్కడకు వచ్చిన తరువాత ముఖం చాటేయడంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
గ్రామాల్లో వరి నాట్లు, కలుపు తీత, కుప్ప నూర్పిడులు లాంటి పనులు చేసిన తమతో చెత్తను ఎత్తిస్తున్నారని వ్యవసాయ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల పనులకు దుర్గ గుడి అధికారులు తెనాలి నుంచి 50 మంది కార్మికులను రోజువారీ వేతనం చెల్లించేలా తెచ్చారు. వారిలో 10 మందితో దుర్గగుడి పనులు చేయిస్తూ మిగిలిన 40 మందిని మున్సిపల్ పనులు నిర్వహించే కాంట్రాక్టరుకు అప్పగించారు.
ఆ కాంట్రాక్టరు వారితో పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారు. దీంతో కొంత మంది కార్మికులు చెప్పకుండానే వెళ్లిపోయారు. ఆరు రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె కారణంగా చెత్త కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. దీన్ని గ్లౌజులు, మాస్కులు లేకుండా కార్మికులతో ఎత్తి వేయిస్తున్నారు. దీంతో రోగాలు సోకే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.
తెనాలి కార్మికుల ఆవేదన..
వరలక్ష్మి: దుర్గగుడికి వచ్చే భక్తులకు మంచి నీళ్ల ప్యాకెట్ల పంపిణీ, క్యూలైన్ల నిర్వహణ లాంటి పనులు చేయాల్సి ఉంటుందని చెప్పడంతో ఊరి నుంచి వచ్చా. ఇక్కడకు వచ్చిన తరువాత మాతో కుళ్లిపోయిన చెత్త ఎత్తిస్తున్నారు. అధికారులు మోసం చేశారు. దుర్వాసన కారణంగా రాత్రి భోజనం కూడా చేయడం లేదు. నాకు పొలం, పుట్ర, నగ, నట్రా ఉన్నాయి.
మాణిక్యం: దసరా ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవచ్చనే ఆశతో వచ్చా. ఆలయంలో పని చేస్తే పుణ్యం వస్తుందని వచ్చా. తీరా ఇక్కడకు వచ్చాక మురుగు కాల్వల్లో మట్టి తీయిస్తున్నారు. కనీసం గుడికి దగ్గరలో పనులు కూడా ఇవ్వలేదు.
పున్నారావు: నా దగ్గర చార్జీలకు కూడా డబ్బులు లేకపోవడంతో తిరిగి వెళ్లలేక ఆగిపోయా. మా ఊళ్లో ఎప్పుడూ ఈ పనులు చేయలేదు. కలుపుతీత, వ్యవసాయ పనులకు వెళ్తే సాయంత్రానికి రూ.400 వచ్చేవి. ఇక్కడ ఈ పనులు చేస్తే రోగాలు తప్పకుండా వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment