దిల్‌ఖుష్ కొందరికే...
వేతనాలు పెంచుతూ {పభుత్వ నిర్ణయం
జీహెచ్‌ఎంసీపై అదనపు భారం రూ.150 కోట్లు
మొత్తం కార్మికులు 24,446 మంది
విధులకు హాజరు కాని 1,700 మందిపై చర్యలు
బంద్ యథాతథం: వామపక్షాలు
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు శుభవార్త. పారిశుద్ధ్య కార్మికులకు, డ్రైవర్లకు 47.05 శాతం వేతనాలు పెంచుతున్నట్టు గురువారం రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పారిశుద్ధ్య కార్మికులకు రూ.4 వేలు, డ్రైవర్లకు రూ.4,800 చొప్పున వేతనాలు పెరగనున్నారుు. దీంతో ప్రస్తుతం రూ.8,500 వేతనం ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు ఇకపై నెలకు రూ.12,500... రూ.10,200 వేతనం పొందుతున్న డ్రైవర్లకు రూ.15 వేలు అందనున్నాయి. స్వచ్ఛ హైదరాబాద్‌లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎంఓ పేర్కొంది. దీనితో జీహెచ్‌ఎంసీలోని 24,446 మంది కార్మికులకు ప్రయోజనం కలుగనుంది. వీరిలో 18,382 మంది పారిశుద్ధ్య కార్మికులు, 948 మంది ఎస్‌ఎఫ్‌ఏలు, 975 మంది డ్రైవర్లు, 1537 మంది రవాణా విభాగం కార్మికులు ఉన్నారు. గురువారం వరకు విధుల్లో చేరని వారితో పాటు సమ్మె సందర్భంగా హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని... అనుచితంగా ప్రవర్తించిన వారిని విధుల నుంచి తొలగించాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్‌ను సీఎం కేసీఆర్‌ఆదేశించారు.
దాదాపు 1700మందిపై ఈ ప్రభావం పడనుంది. జీ హెచ్‌ఎంసీ కార్మికుల వేతనాలు పెంచాల్సిందిగా గత 11 రోజులుగా వివిధ కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. విధులకు హాజరైతే వేతనాలు పెంచుతామని అటు ప్రభుత్వం... ఇటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ చెబుతూ వచ్చినా కార్మిక సంఘాలు వినలేదు. విధులకు హాజరు కాని వారిని తొలగించడం ద్వారా సర్కారు తన ఉద్దేశాన్ని తెలియజెప్పింది. మిగతా మున్సిపాలిటీల్లోనూ సమ్మె కొనసాగుతున్నా... ప్రస్తుతం జీహెచ్‌ఎంసీకి సంబంధించి మాత్రమే సీఎం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనితో జీహెచ్‌ఎంసీపై దాదాపు రూ.150 కోట్ల అదనపు భారం పడనుందని అంచనా.
సీఎంకు కృతజ్ఞతలు: స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్
కార్మికులకు స్వచ్ఛ హైదరాబాద్‌లో ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచిన సీఎం కేసీఆర్‌కు జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. కార్మిక సంఘాలు రెచ్చగొట్టినా.. తమ పిలుపునకు స్పందించి విధుల్లో పాల్గొని, నగర ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసిన పారిశుద్ధ్య కార్మికులను అభినందించారు. కార్మికుల వేతనాలకు చిల్లుపెడుతూ తమ జేబులు నింపుకొంటున్న వారి ఆటలు సాగనివ్వబోమన్నారు. కార్మికులు ఏ నాయకుడికీ ఎలాంటి చెల్లింపులు చేయవద్దని సోమేశ్ కుమార్ సూచించారు.