వీవోఏల జీతం రూ. 5 వేలు | CM kCR hikes VOA's wages in janahitha vedhika | Sakshi
Sakshi News home page

వీవోఏల జీతం రూ. 5 వేలు

Published Thu, Mar 2 2017 2:15 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

వీవోఏల జీతం రూ. 5 వేలు - Sakshi

వీవోఏల జీతం రూ. 5 వేలు

వారి వేతనాల పెంపునకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ
ప్రభుత్వం తరఫున రూ.3 వేలు, గ్రామైక్య సంఘాల నుంచి రూ.2 వేలు
18,405 మందికి ప్రయోజనం
డ్వాక్రా మహిళలు కుటీర పరిశ్రమలు నడపాలన్న సీఎం
అవసరమైన శిక్షణ, చేయూత అందిస్తామని వెల్లడి  


సాక్షి, హైదరాబాద్‌: జనహిత వేదికగా వివిధ వర్గాలతో సమావేశమవుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరో వరం ప్రకటించారు. గ్రామాల్లో అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్ల (వివో ఏల) వేతనాలను రూ.5 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అందులో రూ.3 వేల ను ప్రభుత్వం తరఫున, మరో రూ.2 వేలు గ్రామైక్య సంఘాల తరఫున అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 18,405 మంది వీవోఏలు ఉన్నారు. సీఎం తాజా నిర్ణయంతో వారందరికీ లబ్ధి కలగనుంది. ఒక్కొక్కరికి కనీసం రూ.3,500 వేతనం పెరగనుంది.

ఇప్పుడిస్తున్నది రూ. 1,500 లోపే!
ప్రస్తుతం గ్రామంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల సంఖ్య, వారి ఆర్థిక పరిస్థితిని బట్టి వీవోఏలకు వేతనాలు చెల్లిస్తున్నారు. ఇలా వీవోఏలకు నెలకు రూ.500 నుంచి రూ.1,500 వరకు మాత్రమే వేతనంగా అందుతున్నాయి. దీంతో తాము చేసే పనికి వస్తున్న జీతం సరిపోవడం లేదంటూ వారు కొన్నేళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామైక్య సంఘాలిచ్చే డబ్బుతో పాటు ప్రభుత్వం కూడా కొంత వేతనంగా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ నేపథ్యం లో బుధవారం ప్రగతి భవన్‌లో వీవోఏలతో సీఎం కేసీఆర్‌ సమావేశమై.. వారి సమస్యలు తెలుసుకున్నారు. వారికి నెలకు రూ.5 వేల వేతనం చెల్లించేందుకు ఆమోదం తెలిపారు. గ్రామైక్య సంఘాలు రూ.2 వేలు చెల్లించాలని, మిగతా రూ.3 వేలు ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించారు. ప్రభుత్వ వాటాను సెర్ప్‌ ద్వారా చెల్లిస్తామని, గ్రామైక్య సంఘాల వాటాను చెల్లించే బాధ్యతను సూపర్‌ వైజర్లు తీసుకోవాలని చెప్పారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి చర్యలు
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఈ సంద ర్భంగా సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. గ్రామాల్లో డ్వాక్రా మహిళల ఆర్థిక స్థితి మెరుగు పడాలని చెప్పారు. ‘రాష్ట్రంలో మహిళా సంఘాలకు మంచి పేరు వచ్చింది. కేవలం పొదుపుతోనే సరిపెట్టుకోకుండా కుటీర పరిశ్రమలు నడ పాలి. గ్రామాల్లో దొరికే వస్తువులను మార్కెట్‌ అవసరాలు తీర్చేలా ప్రాసెసింగ్‌ చేయాలి. కారంపొడి, పసుపు పొడి, పాపడాలు, కారా, బూందీ లాంటి వస్తువులను తయారు చేయా లి. అప్పుడు మహిళలకు ఉపాధి లభిస్తుంది, ప్రజలకు కల్తీలేని సరుకులు దొరుకుతాయి’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

ఇందుకోసం ప్రభుత్వం మహిళలకు అవసరమైన శిక్షణను అందిస్తుందన్నారు. వివిధ రాష్ట్రాలు, బంగ్లా దేశ్‌ లాంటి దేశాల్లో మహిళా సంఘాలు ఎలా పనిచేస్తున్నాయో అధ్యయనం చేస్తామని... పూర్తిస్థాయి కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సెర్ప్‌ సీఈవో నీతూ ప్రసాద్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement