పారిశుద్ధ్య కార్మికులకు @18 వేలు | GVMC Sanitation Workers Wages Hikes | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య కార్మికులకు @18 వేలు

Published Fri, Sep 6 2019 11:49 AM | Last Updated on Sun, Sep 15 2019 11:25 AM

GVMC Sanitation Workers Wages Hikes - Sakshi

విధులకు హాజరవుతున్న పారిశుద్ధ్య కార్మికులు

మహా విశాఖ నగర పాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు పండగొచ్చింది. ఎండనక, వాననక నిత్యం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు శ్రమిస్తున్న మున్సిపల్‌ కార్మికుల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టి సారించారు. వారి ఆరోగ్య భద్రత కోసం హెల్త్‌ అలవెన్సు కింద నెలకు రూ.6 వేల చొప్పున వేతనంతో కలిపి ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో జీవీఎంసీ పరిధిలో 5,130 మంది కార్మికులకు కనీస వేతనం రూ.18 వేలుగా మారడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

సాక్షి, విశాఖపట్నం: పారిశుద్ధ్య కార్మికులు.. నిరంతరం మురుగులో పనిచేస్తుంటారు. చెత్త కంపు కొడుతున్నా.. దాన్ని సేకరించడం.. డంపర్‌ బిన్లలో వేయడం... మినీ వ్యానుల్లో తరలించడం.. కాల్వలు శుభ్రం చేయడం.. ఇలా నిత్యం చెత్తతోనే సావాసం చేస్తుంటారు. కుళ్లిపోయిన వ్యర్థాల నుంచి విష వాయువులు వెలువడుతున్నా.. వాటిని తొలగించాల్సిందే. ఫలితంగా వారి ఆరోగ్యాలు అంపశయ్యపై ఉన్నాయి. అయినా పనికి రాకపోతే పూటగడవని పరిస్థితి. తమ ఆరోగ్యాల్ని పట్టించుకోండి మహా ప్రభో అంటూ వందల సార్లు గత ప్రభుత్వాలకు విన్నవించినా పట్టించుకున్న పాపానపోలేదు. కనీస వేతనం అందక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ విధులకు హాజరైన పరిస్థితులెన్నో ఉన్నాయి.

చాలీచాలని వేతనం
జిల్లా, జీవీఎంసీ పరిధుల్లో పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని, అదే విధంగా వారికి అలవెన్సు ప్రకటించాలని గత టీడీపీ ప్రభుత్వానికి మున్సిపల్‌ యూనియన్లు ఎన్నో దఫాలుగా విజ్ఞప్తులు చేశారు. వినతిపత్రాలు అందించారు. కానీ.. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమాన్ని, ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరించారు. దీంతో విసుగెత్తిన కార్మిక సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ధర్నాలు, సమ్మెలు చేసినా ఫలితం లేదు.

భారమే.. అయినా...
ఔట్‌ సోర్సింగ్‌ పారిశుద్ధ్య కార్మికులకు అలవెన్స్‌ మంజూరు చేయడం వల్ల ప్రభుత్వానికి, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లపై నెల నెలా కోట్ల రూపాయిల భారం పడనుంది. అయినా.. కార్మికుల సంక్షేమమే ముఖ్యమని తలచి.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. అలవెన్సుని అందించడం వల్ల జీవీఎంసీపై నెలకు రూ.3.09 కోట్ల అదనపు భారం పడనుంది. ఏడాదికి రూ.37.08 కోట్లు అదనంగా ఖర్చవనుంది. ప్రభుత్వ నిర్ణయంతో జీవీఎంసీ పరిధిలోని 5,130 మంది, నర్సీపట్నం మున్సిపాలిటీలోని 92 మంది, యలమంచిలి మున్సిపాలిటీలోని 90 మంది ఔట్‌సోర్సింగ్‌ పారిశుద్ధ్య కార్మికులకు లబ్ధి చేకూరనుంది.

మాటిచ్చారు..నిలబెట్టుకున్నారు..
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామంటూ ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న సమయంలో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆ హామీని నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఔట్‌సోర్సింగ్‌ పారిశుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వర్తిస్తున్న వారందరికీ హెల్త్‌ అలవెన్సు కింద రూ. 6వేలు వారి వేతనంతో పాటు అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.ఈ అలవెన్సుతో పారిశుద్ధ్య కార్మికుని వేతనం రూ. 18 వేలకు చేరుకుంది. ఈ అలవెన్సుని ప్రతి నెలా 5న చెల్లించాలని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 15 నుంచి ఈ అలవెన్సుని మంజూరయ్యేలా లెక్కించాలని సూచించింది.

ఎన్నాళ్లుగానో ఎదురు చూశాం...
రోజూ నగరం శుభ్రం చేయాలని ఎంతో కష్టపడుతున్నాం. కానీ.. మమ్మల్ని పట్టించుకున్న ప్రభుత్వమే లేదు. రోజూ చెత్తలోనే జీవనం సాగిస్తుండటం వల్ల రోగాలు చుట్టుముడుతున్నాయి. అయినా ఏ ప్రభుత్వమూ దాని గురించి పట్టించుకోలేదు. సీఎం జగన్‌ మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ రోజు కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూశాం.– కింతాడ శ్రీనివాసరావు,పారిశుద్ధ్య కార్మికుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement