ముందస్తుగా సమ్మర్‌ ప్లాన్‌ | Summer Plan For Drinking Water Visakhapatnam | Sakshi
Sakshi News home page

ముందస్తుగా సమ్మర్‌ ప్లాన్‌

Published Wed, Nov 28 2018 11:03 AM | Last Updated on Thu, Jan 3 2019 12:14 PM

Summer Plan For Drinking Water Visakhapatnam - Sakshi

విశాఖసిటీ: జీవీఎంసీ పరిధిలో ఏటా ఫిబ్రవరి నెలలో వేసవి ప్రణాళిక రూపొందించేవారిమనీ, ఈ ఏడాది మాత్రం అక్టోబర్‌లోనే సమ్మర్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని జీవీఎంసీ కమిషనర్‌ హరినారాయణన్‌ అన్నారు. ఆయన చాంబర్‌లో మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. రైవాడ, తాటిపూడి రిజర్వాయర్లతో పాటు ఇతర వనరులకు సంబంధించిన క్యాచ్‌మెంట్‌ ఏరియాల్లో వర్షపాతం తక్కువగా నమోదవడం వల్ల ఆయా రిజర్వాయర్లు కనిష్ట నీటిమట్టానికి చేరువలోకి వచ్చేశాయని తెలిపారు. ఈ ఏడాది అదృష్టవశాత్తూ పురుషోత్తపట్నం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పూర్తికావడం వల్ల గోదావరి నుంచి ఏలేరుకి నీటి పంపింగ్‌ చేయడంతో.. ఏలేరులో ప్రస్తుతం 86.43 మీటర్ల నీటి మట్టం ఉందనీ, ఈ నీరు వచ్చే ఏడాది సెప్టెంబర్‌ వరకూ సరిపోతుందని వివరించారు. ఏలేరు మెయిన్‌ కెనాల్‌ను విస్కో 400 క్యూసెక్కుల కెపాసిటీకి డిజైన్‌ చేసినప్పటికీ లీకేజీలు, బెండ్‌ ఏరియాలో ఇబ్బందులు, బలహీనమైన గట్ల కారణంగా 350 క్యూసెక్కుల నీటిని మాత్రం తీసుకోగలుగుతున్నామన్నారు. రానున్న ఎద్దడి దృష్టిలో పెట్టుకొని 90 నుంచి 100 ఎంజీడీల నీటిని కేబీఆర్‌ పాయింట్‌కు పంపింగ్‌ చేసేందుకు సుమారు రూ.కోటి వ్యయంతో మరమ్మతులు చేపడుతున్నామనీ, వచ్చే నెల 15తేదీ లోగా ఈ పనులు పూర్తి చేసేస్తామని వివరించారు. అదే విధంగా పదేళ్లుగా వినియోగించని పాత రైవాడ లైన్‌ను వాడేందుకు అవసరమైన మరమ్మతులు చేపట్టామనీ, పంపింగ్‌ ట్రయల్‌ రన్‌ కూడా వేసినట్లు తెలిపారు. ఈ పైప్‌లైన్‌ ద్వారా మేహాద్రి గెడ్డకు 8 ఎంజీడీ పంపించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.

గోదావరి నుంచి మరో 15 ఎంజీడీలు
ప్రస్తుతం గోదావరి నుంచి 25 ఎంజీడీ జలాలు తీసుకుంటున్నామనీ, మరో 15 ఎంజీడీ నీటిని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని కమిషనర్‌ వెల్లడించారు. దీనికి సంబంధించిన అనుమతుల కోసం ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. మరోవైపు తాటిపూడి రిజర్వాయర్‌ నుంచి సాగునీటి గేట్లను మూసివెయ్యాలని జలవనరుల శాఖను కోరామనీ, అవి మూసేస్తే కొంత వరకూ తాగునీటి కోసం ఇబ్బందులు తొలగుతాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికైతే నీటి సరఫరా సమయం కుదించే ఆలోచన లేదన్నారు. వేసవి కాలంలో కూడా రోజూ మంచి నీటిని నగర ప్రజలకు అందించేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు కూడా నీటిని వృథా చెయ్యకుండా జీవీఎంసీకి సహకరించాలని కోరారు. ట్యాంకర్ల ద్వారా చేసే నీటి సరఫరాలో గృహావసరాలకే మొదటి ప్రాధాన్యమిచ్చేలా విభాగంలో మార్పులు చేస్తున్నామని తెలిపారు.

అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు
టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది కారణంగా ఇంటి ప్లాన్ల మంజూరులో ఆలస్యం జరుగుతుందన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రంలో ఆన్‌లైన్‌ బిల్డింగ్‌ ప్లాన్‌ అప్రూవల్‌ను దేశంలోనే తొలిసారిగా అమలు చేశారని కమిషనర్‌ అన్నారు. 2016లో ఈ విధానం అమలైనప్పటి నుంచి ఇప్పటివరకూ జీవీఎంసీ పరిధిలో 9,823 బిల్డింగ్‌ ప్రొసీడింగ్స్‌ ఇచ్చామనీ, వీటిలో 8,661 ప్రొసీడింగ్స్‌ కన్‌ఫర్మ్‌ చేశామని తెలిపారు. ప్రజలు సరైన వివరాలు అందిస్తారనే ఉద్దేశంతో ఆన్‌లైన్‌లో ప్లాన్ల మంజూరు చేస్తున్నామనీ, అందులో తప్పులు నమోదు చేస్తే చర్యలు తప్పవన్నారు. ఆన్‌లైన్‌లో ప్లాన్‌ కోసం అప్లయ్‌ చేస్తే 48 గంటల్లో ప్రొసీడింగ్‌ అప్రూవల్‌ వస్తుందన్న విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. అక్రమ నిర్మాణాలు చేపడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మేహాద్రిగెడ్డపై ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టు
మేహాద్రిగెడ్డపై ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచామని తెలిపారు. 15 మెగా వాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టుకు త్వరలోనే టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రాజెక్టుతో జీవీఎంసీ పరిధిలో మొత్తం 25 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ ప్రాజెక్టులో భాగంగా గ్రేటర్‌ పరిధిలో 3 విడతల్లో 54,299 ఇళ్లు మంజూరు కాగా ఇందుకోసం 319 ఎకరాలను రెవెన్యూ శాఖ నుంచి తీసుకున్నామనీ, త్వరలో మరో 266 ఎకరాలు సేకరిస్తామని తెలిపారు. ఫేజ్‌–1లో నిర్మించాల్సిన 4,120 ఇళ్లలో దాదాపు 2వేల ఇళ్ల నిర్మాణం పూర్తయిందనీ, మొత్తం పూర్తి చేసి సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు అందజేయ్యాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అదే విధంగా 2019 స్వచ్ఛ సర్వేక్షణ్‌కు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల బార్సిలోనాలో జరిగిన స్మార్ట్‌సిటీ వరల్డ్‌ ఎక్స్‌పో అండ్‌ కాంగ్రెస్‌లో పాల్గొని నగరంలో ఎదుర్కొనే అనేక సమస్యల్ని ఎలా అధిగమించాలనే అంశాల గురించి చర్చించామని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement