Summer Plan
-
ముందస్తుగా సమ్మర్ ప్లాన్
విశాఖసిటీ: జీవీఎంసీ పరిధిలో ఏటా ఫిబ్రవరి నెలలో వేసవి ప్రణాళిక రూపొందించేవారిమనీ, ఈ ఏడాది మాత్రం అక్టోబర్‌లోనే సమ్మర్ ప్లాన్ సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ అన్నారు. ఆయన చాంబర్లో మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. రైవాడ, తాటిపూడి రిజర్వాయర్లతో పాటు ఇతర వనరులకు సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియాల్లో వర్షపాతం తక్కువగా నమోదవడం వల్ల ఆయా రిజర్వాయర్లు కనిష్ట నీటిమట్టానికి చేరువలోకి వచ్చేశాయని తెలిపారు. ఈ ఏడాది అదృష్టవశాత్తూ పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తికావడం వల్ల గోదావరి నుంచి ఏలేరుకి నీటి పంపింగ్ చేయడంతో.. ఏలేరులో ప్రస్తుతం 86.43 మీటర్ల నీటి మట్టం ఉందనీ, ఈ నీరు వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకూ సరిపోతుందని వివరించారు. ఏలేరు మెయిన్ కెనాల్‌ను విస్కో 400 క్యూసెక్కుల కెపాసిటీకి డిజైన్ చేసినప్పటికీ లీకేజీలు, బెండ్ ఏరియాలో ఇబ్బందులు, బలహీనమైన గట్ల కారణంగా 350 క్యూసెక్కుల నీటిని మాత్రం తీసుకోగలుగుతున్నామన్నారు. రానున్న ఎద్దడి దృష్టిలో పెట్టుకొని 90 నుంచి 100 ఎంజీడీల నీటిని కేబీఆర్ పాయింట్‌కు పంపింగ్ చేసేందుకు సుమారు రూ.కోటి వ్యయంతో మరమ్మతులు చేపడుతున్నామనీ, వచ్చే నెల 15తేదీ లోగా ఈ పనులు పూర్తి చేసేస్తామని వివరించారు. అదే విధంగా పదేళ్లుగా వినియోగించని పాత రైవాడ లైన్‌ను వాడేందుకు అవసరమైన మరమ్మతులు చేపట్టామనీ, పంపింగ్ ట్రయల్ రన్ కూడా వేసినట్లు తెలిపారు. ఈ పైప్‌లైన్ ద్వారా మేహాద్రి గెడ్డకు 8 ఎంజీడీ పంపించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. గోదావరి నుంచి మరో 15 ఎంజీడీలు ప్రస్తుతం గోదావరి నుంచి 25 ఎంజీడీ జలాలు తీసుకుంటున్నామనీ, మరో 15 ఎంజీడీ నీటిని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని కమిషనర్ వెల్లడించారు. దీనికి సంబంధించిన అనుమతుల కోసం ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. మరోవైపు తాటిపూడి రిజర్వాయర్ నుంచి సాగునీటి గేట్లను మూసివెయ్యాలని జలవనరుల శాఖను కోరామనీ, అవి మూసేస్తే కొంత వరకూ తాగునీటి కోసం ఇబ్బందులు తొలగుతాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికైతే నీటి సరఫరా సమయం కుదించే ఆలోచన లేదన్నారు. వేసవి కాలంలో కూడా రోజూ మంచి నీటిని నగర ప్రజలకు అందించేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు కూడా నీటిని వృథా చెయ్యకుండా జీవీఎంసీకి సహకరించాలని కోరారు. ట్యాంకర్ల ద్వారా చేసే నీటి సరఫరాలో గృహావసరాలకే మొదటి ప్రాధాన్యమిచ్చేలా విభాగంలో మార్పులు చేస్తున్నామని తెలిపారు. అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు టౌన్‌ప్లానింగ్ సిబ్బంది కారణంగా ఇంటి ప్లాన్ల మంజూరులో ఆలస్యం జరుగుతుందన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రంలో ఆన్లైన్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్‌ను దేశంలోనే తొలిసారిగా అమలు చేశారని కమిషనర్ అన్నారు. 2016లో ఈ విధానం అమలైనప్పటి నుంచి ఇప్పటివరకూ జీవీఎంసీ పరిధిలో 9,823 బిల్డింగ్ ప్రొసీడింగ్స్ ఇచ్చామనీ, వీటిలో 8,661 ప్రొసీడింగ్స్ కన్ఫర్మ్ చేశామని తెలిపారు. ప్రజలు సరైన వివరాలు అందిస్తారనే ఉద్దేశంతో ఆన్లైన్లో ప్లాన్ల మంజూరు చేస్తున్నామనీ, అందులో తప్పులు నమోదు చేస్తే చర్యలు తప్పవన్నారు. ఆన్లైన్లో ప్లాన్ కోసం అప్లయ్ చేస్తే 48 గంటల్లో ప్రొసీడింగ్ అప్రూవల్ వస్తుందన్న విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. అక్రమ నిర్మాణాలు చేపడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేహాద్రిగెడ్డపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు మేహాద్రిగెడ్డపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచామని తెలిపారు. 15 మెగా వాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టుకు త్వరలోనే టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రాజెక్టుతో జీవీఎంసీ పరిధిలో మొత్తం 25 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. హౌసింగ్ ఫర్ ఆల్ ప్రాజెక్టులో భాగంగా గ్రేటర్ పరిధిలో 3 విడతల్లో 54,299 ఇళ్లు మంజూరు కాగా ఇందుకోసం 319 ఎకరాలను రెవెన్యూ శాఖ నుంచి తీసుకున్నామనీ, త్వరలో మరో 266 ఎకరాలు సేకరిస్తామని తెలిపారు. ఫేజ్–1లో నిర్మించాల్సిన 4,120 ఇళ్లలో దాదాపు 2వేల ఇళ్ల నిర్మాణం పూర్తయిందనీ, మొత్తం పూర్తి చేసి సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు అందజేయ్యాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అదే విధంగా 2019 స్వచ్ఛ సర్వేక్షణ్కు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల బార్సిలోనాలో జరిగిన స్మార్ట్‌సిటీ వరల్డ్ ఎక్స్పో అండ్ కాంగ్రెస్‌లో పాల్గొని నగరంలో ఎదుర్కొనే అనేక సమస్యల్ని ఎలా అధిగమించాలనే అంశాల గురించి చర్చించామని వివరించారు. -
తాగునీటి ఇబ్బందులు రానీయొద్దు
వేసవి ప్రణాళికపై జిల్లా కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ సమీక్ష అవసరమైతే అదనంగా నిధులిస్తాం ఉపాధి హామీ పనులను ముమ్మరం చేయాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: వేసవి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు కలెక్టర్లను ఆదేశించారు. వేసవి కార్యాచరణ ప్రణాళిక కోసం తాగునీటి సరఫరాకు ఇప్పటికే రూ.263 కోట్లు విడుదల చేశామని, అవసరమైతే అదనంగా మరిన్ని నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు, ఉపాధి హామీ పనుల కల్పన వంటి అంశాలపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ సమీక్షించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మెరుగైనందున గ్రామీణ మంచినీటి పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించాలని మంత్రి సూచించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యుఎస్)తో సమన్వయం చేసుకొని అవసరమైన ప్రాంతాలకు మంచినీటిని సరఫరా చేయాలని, ప్రతిరోజూ నివేదికలు తెప్పించుకొని నీటి సరఫరా తీరును పర్యవేక్షించాలని ఆయన కోరారు. వరంగల్, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు మాట్లాడుతూ.. గతేడాది వేసవి ప్రణాళికకు సంబంధించిన బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదని పేర్కొనగా, మంత్రి స్పందిస్తూ.. ప్రైవేటు బోరు బావులకు గతంలో చెల్లించాల్సిన బకాయిలు ఉన్నట్లైతే వెంటనే చెల్లించే ఏర్పాటు చేస్తామన్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను వినియోగించుకోవాలని, అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. జిల్లాస్థాయిలో పబ్లిక్ కాల్ సెంటర్లకు వచ్చే ఫిర్యాదులు, మీడియాలో వచ్చే కథనాలకు అధికారులు స్పందించాలన్నారు. సబ్స్టేషన్ల నిర్మాణానికి 300 కోట్లు: తెలంగాణ తాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైన విద్యుత్ సరఫరా ఏర్పాట్లకోసం రూ.300 కోట్లు కావాలని విద్యుత్ సంస్థ(డిస్కం)లు ప్రభుత్వానికి నివేదించాయి. ఈ ప్రాజెక్టు అమల్లో భాగస్వాములైన వివిధ విభాగాల ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆరు సెగ్మెంట్లలో చేపట్టిన ఇంటేక్‌వెల్స్, ఇంటర్మీడియెట్ స్టేషన్ల నిర్మాణానికై విద్యుత్ సరఫరా కోసం తొలివిడతగా రూ.100కోట్లు వెంటనే విడుదల చేస్తామన్నారు. ఇంటేక్‌వెల్స్ సమీపంలో అవసరమైన మేరకు సబ్స్టేషన్లు, డెడికేటెడ్ లైన్స్ పనులు వెంటనే ప్రారంభించాలని డిస్కంల మేనేజింగ్ డెరైక్టర్లను సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో సెంట్రల్, నార్తరన్ డిస్కంల మేనేజింగ్ డెరైక్టర్లు రఘుమారెడ్డి, వెంకటనారాయణ, అటవీ సంరక్షణాధికారి శోభ, జలమండలి ఎండీ జగదీశ్వర్, పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ విభాగాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు ఇంతియాజ్, సత్యనారాయణరెడ్డి, సురేందర్‌రెడ్డి, జాతీయ రహదారుల విభాగం చీఫ్ ఇంజనీర్ రవీందర్రావు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ తదితరులు పాల్గొన్నారు. ముమ్మరంగా ఉపాధి హామీ పనులు.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను ముమ్మరంగా చేపట్టాలని మంత్రి కేటీఆర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి గ్రామంలోనూ పనులను ప్రారంభించాలని అన్నారు. గ్రామాల్లోని ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలను తీసుకొని క్షేత్రస్థాయి సిబ్బంది ‘ఉపాధి హామీ’ ద్వారా ఉపయోగకరమైన పనులను చేపట్టాలన్నారు. ముఖ్యంగా కరువు పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల ద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. ఉపాధి కల్పించాలని కోరిన ప్రతి వ్యక్తికి జాబ్‌కార్డు అందజేయాలని సూచించారు. ఈ నెల 9,10 తేదీల్లో ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్వహించనున్న కలెక్టర్ల సదస్సుకు సమగ్ర సమాచారంతో రావాలని మంత్రి కోరారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, కమిషనర్ అనితా రామచంద్రన్, ఆర్‌డబ్ల్యుఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.